కరోనా.. ఓ కరుడుగట్టిన విలన్‌
close
Published : 29/04/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా.. ఓ కరుడుగట్టిన విలన్‌

సినిమా భాషలోనే చెప్పాలంటే... కరడుగట్టిన విలన్‌లా మారింది కరోనా. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. సినిమా రంగంపై కూడా ఆ ప్రభావం చాలా బలంగా పడింది. రెండేళ్లుగా ఎంతోమంది ఉపాధిని నాశనం చేస్తోంది. వ్యాపారాల్ని దెబ్బ తీస్తోంది. అభిమానులు ఎప్పట్నుంచో చూడాలనుకుంటున్న సినిమాల్ని అంతకంతకూ దూరం చేస్తూనే ఉంది. కానీ సినిమాల్లో చివరికి గెలిచేది హీరోనే కాబట్టి... కరోనా విలన్‌ కూడా ఎప్పుడో ఒకసారి అంతం కాక తప్పదు, సెట్స్‌పై ఉన్న సినిమాలు విడుదల కాక తప్పదు. సినీ వర్గాలు కూడా అదే భరోసాతో ఉన్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మళ్లీ రెట్టింపు స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకి వస్తారనే నమ్మకం కనిపిస్తోంది. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకి అదే తరహా ఆదరణ లభించింది. అందుకే కరోనా రెండోసారి కూడా ఇబ్బంది పెడుతున్నా...సినీ వర్గాలు మాత్రం ధైర్యంగానే కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో గతేడాది, ఈ ఏడాదీ... రెండుసార్లూ ఇబ్బంది పడిన సినిమాలు తెలుగులో చాలానే కనిపిస్తున్నాయి.

2020 ఆరంభంలో విడుదలైన కొన్ని సినిమాలు మినహా... సెట్స్‌పై ఉన్న సినిమాలు, ఆ తర్వాత విడుదలైన సినిమాలు, ఈ ఏడాది సినిమాలు మొత్తంగా ఏదో ఒక రకంగా కరోనా తాకిడితో ఇబ్బంది పడుతున్నవే. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 78 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఘన విజయాలు అందుకున్నవీ ఉన్నాయి. అయినా సరే... వాటిపై కరోనా ప్రభావం పడలేదనడానికి వీల్లేదు. అవే సినిమాలు సాధారణ పరిస్థితుల్లో విడుదలై ఉంటే... వాటి వసూళ్లు మరింత ఎక్కువగా ఉండేవనేది పరిశ్రమ వర్గాల మాట. తొలి దశ కరోనా ఉధృతి తగ్గాక కూడా కుటుంబ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో థియేటర్లకి రాలేదు. వచ్చిన యువతరం ప్రేక్షకులతోనే ఆయా సినిమాలు ఆ మాత్రం ఫలితాల్ని సొంతం చేసుకున్నాయి. ఇక మెల్లమెల్లగా కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకి వస్తారనే నమ్మకంతో ఆయా చిత్రవర్గాలు తమ సినిమా పనుల్లో వేగం పెంచగా... మరోసారి కరోనా విజృంభించింది. అలా రెండు దశల్లోనూ కరోనా కల్లోలంలో చిక్కి బడ్జెట్‌ భారం పెంచుకున్న సినిమాలు తెలుగులో చాలానే. కొన్ని విడుదల వరకు వచ్చి ఆగిపోయాయి. కొన్నేమో అప్పుడూ.. ఇప్పుడూ ఇంకా సెట్స్‌పైనే ఉన్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్‌స్టోరి’, ‘టక్‌ జగదీష్‌’, ‘విరాటపర్వం’ సినిమాలు తొలి దశ కరోనా సమయంలో సెట్స్‌పై ఉన్నవే. కరోనా ఉధృతి తగ్గాక చిత్రీకరణని పూర్తి చేసి ఈ వేసవిలో విడుదల కోసం సిద్ధం చేశాయి. ఇంతలోనే కరోనా ఉధృతి మొదలైంది. అలా చివరి నిమిషంలో రెండోసారి కరోనాతో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందన్నమాట. ‘వకీల్‌సాబ్‌’ విడుదలైనా... వాటి వసూళ్లపై రెండో దశ కరోనా బలమైన ప్రభావం చూపించింది.

పాన్‌ ఇండియా చిత్రాలన్నీ...  
రెండు మూడేళ్లుగా తెలుగులో పాన్‌ ఇండియా సినిమాల నిర్మాణం ఊపందుకుంది. వాటి స్థాయి, పరిధి పెద్దది కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎక్కువ రోజులు చిత్రీకరణ, నిర్మాణానంతర పనులు జరపాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో పూర్తవుతుందనుకున్న సినిమా రెండేళ్లు పట్టొచ్చు, మూడేళ్లు పట్టొచ్చు. విడుదల తేదీలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా అలా పలుమార్లు విడుదల తేదీల్ని మార్చుకుంది. తొలి దశ కరోనా ప్రభావం మొదలయ్యే సమయానికి ఈ చిత్రం దాదాపు 60 శాతం చిత్రీకరణని పూర్తి చేసుకుందని తెలిసింది. మిగిలిన చిత్రీకరణని పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఆ సినిమా చిత్రీకరణకి మరోసారి కరోనా బ్రేకులు వేసింది. ఇప్పుడు విడుదలపై సందిగ్ధం నెలకొంది. మరో పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కూడా వరుసగా రెండోసారి కరోనా తాకిడికి గురికావల్సి వచ్చింది. గతేడాది లాక్‌డౌన్‌ సమయానికి ఈ చిత్రం కూడా 60 శాతంపైనే పూర్తయింది.

ఇప్పుడేమో మరో పది రోజులైతే చిత్రీకరణ పూర్తవుతుంది. కానీ ఇంతలోనే రెండో దశ కరోనా ఉద్ధృతి మొదలైంది. ఈ జులై 30న విడుదల కావడం సందేహమే. అల్లు అర్జున్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. గతేడాది ఈ సినిమా చిత్రీకరణ కోసం కేరళలో అన్ని ఏర్పాట్లు పూర్తయిన దశలోనే కరోనా విజృంభించింది. దాంతో చిత్రీకరణని కొన్ని నెలలపాటు వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ తర్వాత పట్టాలెక్కిన ఈ సినిమా నిర్విరామంగా చిత్రీకరణని జరుపుకుంటూ వచ్చింది. రెండో దశ కరోనా ఉద్ధృతి పెరిగినా... చిత్రబృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేసింది. కానీ అల్లు అర్జున్‌కే కరోనా రావడంతో ఈ సినిమా చిత్రీకరణకి మళ్లీ కొన్నాళ్లపాటు బ్రేకులు పడినట్టే. విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ కూడా రెండుసార్లూ కరోనాతో ఇబ్బంది పడింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో మొదలు పెట్టాల్సి ఉండగా మరోసారి అంతరాయం కలిగింది. అడవి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మేజర్‌’ చిత్రీకరణ పూర్తయినప్పటికీ... అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ కూడా అప్పుడు, ఇప్పుడూ కరోనా ఉధృతితో ఆగిపోయింది.

అవి కూడా...

చిరంజీవి - రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’ గతేడాది కరోనా ఉధృతి మొదలయ్యే సమయానికి దాదాపుగా 60 శాతం చిత్రీకరణని పూర్తి చేసుకుంది. నవంబరులో చిత్రీకరణని పునః ప్రారంభించారు. జనవరిలో రామ్‌చరణ్‌ ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. మే 13గా విడుదల తేదీని కూడా నిర్ణయించారు. మరికొన్ని రోజులైతే చిత్రీకరణ పూర్తయ్యేదే. ఇంతలోనే కరోనా రెండో దశ మొదలు కావడంతో చిత్రీకరణకి విరామం ప్రకటించారు. వెంకటేష్‌ ‘నారప్ప’ని గతేడాది మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనాతో విరామం రావడంతో చిత్రీకరణని ఆపేశారు. ఆ తర్వాత వెంకటేష్‌ ‘దృశ్యం2’తో బిజీ అయ్యారు. ‘నారప్ప’ ఇప్పుడు చివరి దశ చిత్రీకరణలో ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘అఖండ’ గతేడాది కరోనా సమయానికి ఒక చిన్న షెడ్యూల్‌ చిత్రీకరణని మాత్రమే పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. అయినా సరే... ఈ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం మాత్రం అనుమానమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ‘గని’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తదితర చిత్రాలు కూడా గతేడాది కరోనా మొదలైన సమయంలో సెట్స్‌పై ఉన్నాయి. రెండో దశ కరోనాలోనూ అవి చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని