అభాగ్యులకు మనోధైర్యమేదీ?
eenadu telugu news
Updated : 04/08/2021 11:50 IST

అభాగ్యులకు మనోధైర్యమేదీ?

మానసిక రోగులకు భరోసా కరవు

మొక్కుబడిగా మెంటల్‌ హెల్త్‌ కేర్‌ చట్టం అమలు

ఈటీవీ, గుంటూరు

ఓ అంచనా ప్రకారం ప్రతి వంద మందిలో ఒకరు ఇలా మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారు. తమలో తామే గొణుక్కుంటూ ఒంటరిగా ఉంటూ డిప్రెషన్‌కు గురవుతారు. ఎక్కువగా ఒంటిరిగా ఉండడానికి ఇష్టపడే ఈ బాధితులు క్రమంగా ఇంటికి దూరమవుతారు. అసలు జిల్లాల వారీగా ఎంత మంది ఇలాంటి వారున్నారో సమగ్రమైన సర్వే, అంచనా ఇప్పటివరకు జరగలేదు. వీరిని చూసి తోటి సమాజం భయపడడం. వారిని గాయపర్చడం... వారు తిరిగబడటం... రాళ్లు విసరడం వంటివి మనం చూస్తున్నాం. ఇలాంటి మానసిక రోగుల్ని అక్కున చేర్చుకుని వైద్య చికిత్సలు, కౌన్సెలింగ్‌, జీవనోపాధి కల్పించే వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో ఉంది. ఎటొచ్చి మనదగ్గర మాత్రం వారి ఆలనాపాలనను ప్రభుత్వంతో పాటు ప్రజలు గాలికొదిలేస్తున్నారు. మనలాగే పుట్టిన మనిషి.. అలా దయనీయ పరిస్థితుల్లో అల్లాడుతుంటే పట్టించుకునేవారు, సంరక్షించేవారు అరుదుగా అక్కడక్కడా కన్పిస్తున్నారు. కరోనా సమయంలో ఎంత మంది వైరస్‌ బారినబారినపడ్డారో.. ఎంతమంది చనిపోయారో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో విశాఖపట్నం కేజీహెచ్‌లో మానసిక రోగులకు ప్రత్యేక ఆస్పత్రి ఉండగా మిగతాచోట్ల ప్రత్యేక విభాగాలున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అమలైతేనే మానసిక రోగులకు సాంత్వన లభించేది.


చిరిగిన దుస్తులు... చెదిరిన కలలు... ఎక్కడి వారో తెలియదు.... తిన్నారో, ఎలా ఉన్నారో ఎవరూ పట్టించుకోరు. వీధుల్లో, రహదారుల పక్కనే మానసిక రోగులు పడేపాట్లు వర్ణనాతీతం. ఆకలని అడగరు. కష్టమొస్తే కన్నీరు కార్చరు. భావోద్వేగాలకు అతీతమైన స్థితిలో ఉంటారు. ఎవరూ అండగా లేని వారి జీవితాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసాగా నిలవాలి. దురదృష్ణవశాత్తూ ఉన్న చట్టాలు, హక్కులేవీ వారికి భరోసా ఇవ్వడం లేదు.  


చిక్కి శల్యమై.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఇబ్బందులు పడే మానసిక రోగులు.. బస్సులు, రైళ్లల్లో మనం వెళ్తున్నప్పుడో.. వీధుల్లో, రహదార్లపైన ఎక్కడచూసినా తారసపడతారు. సంరక్షణ లేక.. తినీ తినక చిక్కి శల్యమైన వారి శరీరాలు కంటతడి పెట్టిస్తాయి. కనికరించి ఎవరో ఒకరు ఓ ముద్ద అన్నం పెడతారే తప్ప... వారు తమకు ఆకలేస్తుందని కూడా చెప్పుకోలేని దైన్యస్థితి. వారసత్వంగా కొందరిలో... తీవ్ర ఒత్తిడిలో మరికొందరు.... స్కీజోఫ్రీనియా బాధితులుగా మారుతున్నారు.


సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే

పౌరులుగా వీరిని సంరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇదే లక్ష్యంతో 1987లో నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ యాక్టు అమల్లోకి రాగా.. 2017లో మానసిక రోగులకు మరిన్ని హక్కులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని బాధ్యతలు కల్పిస్తూ నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్టును రూపొందించారు. పోలీసులు, వైద్యులు, స్థానిక సంస్థలు.. ఇలా అందరూ మానసిక రోగుల సంరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలి. రాష్ట్ర, జిల్లా, డివిజవ్‌ స్థాయిలో రిఫరల్‌ కమిటీలున్నప్పటికీ ఇవి క్రియాశీలంగా పని చేయడం లేదు. ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని వీరి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. కొవిడ్‌ సమయంలో వీరి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయమై న్యాయస్థానాలు పలుమార్లు ప్రభుత్వాల్ని ఆరా తీశాయి. మానసిక రోగుల సంరక్షణపై యంత్రాంగం మరింత జవాబుదారీతనంతో వ్యవహరించి, వారిని సంరక్షించాలన్న వాదన బలంగా విన్పిస్తోంది. వైద్య చికిత్సలతో కోలుకుంటారు మానసిక రోగులు తప్పక కోలుకుంటారు. వారి లక్షణాల తీవ్రతను బట్టి నియమానుసారం చికిత్స ఉంటుంది.

వారిని గుర్తించడం, సంరక్షించడం కీలకం

గుంటూరు జీజీహెచ్‌ వంటి ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి రోగులకు సమగ్రమైన చికిత్సలు అందిస్తున్నాం. వీరికి చికిత్స సమయంలో డే కేర్‌ సెంటర్లు లాంటివి ఏర్పాటు చేస్తే త్వరగా కోలుకోవడంతో పాటు కొంత ఉపాధిని పొందేందుకు అవకాశముంది.

-లోకేశ్వరరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, జీజీహెచ్‌, గుంటూరు 

ప్రభుత్వాలు మానవత్వంతో స్పందించాలి

జాతీయ మానసిక రోగుల సంరక్షణ చట్టం ప్రకారం వివిధ శాఖలు వారి సంరక్షణ స్వీకరించాలి. క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావడం లేదు. ఇప్పటికైనా తోటి సమాజం వారికి అండగా నిలవాలి. వివిధ కోర్టుల్లో తీర్పుల సారాంశాన్ని అధికారులు తూచ తప్పకుండా అమలు చేయాలి.

-నర్రా శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని