మరో అయిదు ఎకరాల కబ్జాకు ప్రణాళిక!
logo
Published : 23/06/2021 02:29 IST

మరో అయిదు ఎకరాల కబ్జాకు ప్రణాళిక!

‘ఈనాడు’ కథనంతో అడ్డుకట్ట

ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అంతా సక్రమంగా జరిగితే ఇప్పుడు ఆక్రమించిన రెండు ఎకరాలతోపాటు మరో అయిదు ఎకరాల మేర మూసీ నదిని పూడ్చి రియల్‌ వెంచర్‌గా వేసి విక్రయించాలని కబ్జాదారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో కబ్జా బాగోతానికి అడ్డుకట్టపడింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడ రెవెన్యూ పరిధిలో మూసీనది కబ్జాలపై ‘కళ్లు మూసీకున్నారా?’ శీర్షికతో మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి వివిధ శాఖల అధికారులు స్పందించారు. నది అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌నాయక్‌, ఎస్‌ఈ మల్లికార్జున్‌, డిప్యూటీ కలెక్టర్‌ మాలతీ, రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌తోపాటు నీటిపారుదల, రెవన్యూశాఖలకు చెందిన పలువురు అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ మొత్తం రెండు ఎకరాలకంటే ఎక్కువ స్థలం కబ్జాకు గురైనట్లు చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌నాయక్‌ తెలిపారు. నది మధ్య భాగంలో మట్టి లారీల రాకపోకల కోసం వేసిన రోడ్డును వెంటనే జేసీబీల సహాయంతో ధ్వంసం చేశారు. కబ్జాలపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు. కబ్జా చేస్తున్న వారి వివరాలు సేకరించి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ కబ్జాచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలవంటూ రాజేంద్రనగర్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

భారీ ప్రణాళికతో.. రెండు ఎకరాల కబ్జాకు పాల్పడిన వ్యక్తులు దీంతోపాటు మరో అయిదు ఎకరాల మేర కబ్జా చేసి ఏక మొత్తంలో రియల్‌ వెంచర్‌ వేసి అమ్మేయాలని ప్రణాళిక రచించారు. నదిని పూర్తిగా చదును చేసిన తర్వాత రాజకీయ నాయకుల అండ కూడా తీసుకోవాలని భావించారు. ఈ కబ్జా చేసిన చోట నదికి అవతల పక్కన మరికొంత మంది ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు మంగళవారం ఈ ప్రాంతానికి వచ్చిన అధికారులు గుర్తించారు. దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని సీఈ ‘ఈనాడు’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని