రాకోయి అతిథి!
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

రాకోయి అతిథి!

మూడేళ్లుగా ఆగిపోయిన భవన నిర్మాణం

న్యూస్‌టుడే, తాండూరు: పట్టణంలో చాలా ఏళ్ల కిందటే అప్పటి పాలకులు అతిథి గృహాన్ని నిర్మించారు. తాండూరు పర్యటనకు అధికారికంగా ఎవరు వచ్చినా ఇక్కడే విడిది చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన ఎన్టీ రామారావు, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, మంత్రులు, పాలనాధికారులు, గవర్నర్లు ఇక్కడే ఉండేవారు. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో భవనం శిథిల స్థితికి చేరింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారు. పట్టణానికి వచ్చిపోయే అతిథులు, ప్రముఖులకు విడిది విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పాత భవనాన్ని 2016లో కూల్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.85 కోట్లతో అదే ఏడాది జులైలో టెండరు పొందిన గుత్తేదారు ఆధునిక పద్ధతిలో భవన నిర్మాణం పనులను ప్రారంభించారు. సకల హంగులతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా పనులు చేపట్టాల్సి ఉంది. అంతా సవ్యంగా జరిగితే 2018 జనవరిలోనే అందుబాటులోకి రావాలి. అయితే ఆ మేరకు పనులు వేగంగా జరగలేదు. గుత్తేదారు మరణించడంతో, మరొకరికి అప్పగించకపోవడంతో మూడేళ్ల నుంచి పనులు ఆగిపోయాయి. కొత్త భవనం పాతబడింది. ప్రస్తుతం పట్టణానికి వచ్చిపోయే ప్రముఖులకు విడిది చేయడానికి అతిథి గృహం లేక ఇబ్బందులు పడుతున్నారు.


కొత్తగా టెండరు పిలవాలి

సుందర్‌, జిల్లా నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు

అతిథి గృహం నిర్మాణానికి కొత్తగా టెండరు పిలవాలి. మిగిలిపోయిన పనులకు తాజా ధరల ప్రకారం ఎన్ని నిధులు అవసరమవుతాయనే విషయంలో అంచనాలను రూపొందించాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారినుంచి ఆదేశాలు రాగానే అర్హులైన గుత్తేదారుకు పనులను అప్పగిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని