శ్రద్ధపెడితే.. గుహలకు మెరుగులే
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

శ్రద్ధపెడితే.. గుహలకు మెరుగులే

కరోనాతో తగ్గిన ఆదాయం

మరిన్ని వసతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి

బెలుం గుహ లోపలి అందాలు

బనగానపల్లి, బనగానపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పర్యాటక కేంద్రాలపై సర్కారు దృష్టి పెట్టకపోవడంతో ‘ఎక్కగ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా అభివృద్ధి పడకేసింది. ప్రభుత్వం ఆయా కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నా ఆ దిశగా అభివృద్ధి చేయడం లేదు. రాష్ట్రంలోనే పేరొందిన బెలుం గుహలు బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. అవుకు రిజర్వాయర్‌ వద్ద పర్యాటకులకు బోటు సౌకర్యం కల్పించినా.. సౌకర్యాలు అంతంతమాత్రమే. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బెలుం గుహలు, అవుకు జలాశయం వద్ద పరిస్థితులపై కథనం.

బెలుం గుహలు

బెలుం గుహలు ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గాలుగా పేరొందాయి. కొన్నేళ్ల కిందట ఐరోపాకు చెందిన రాబర్ట్‌ బ్రూస్‌ పూటే తొలిసారిగా 1884లో బెలుం గుహలను సందర్శించి తన రచనల్లో పదిలపరిచారు. 1982-84 మధ్య హెచ్‌.డి.గేబర్‌ తన బృందంతో గుహలు చూసి 3.225 కిలోమీటర్లు లోపలికి వెళ్లి అక్కడ చిత్రం గీశారు. 1989లో ఏపీ పురావస్తుశాఖ ఈ గుహల ప్రాధాన్యం గుర్తించి స్వాధీనం చేసుకొంది. 2000లో ఏపీ టూరిజం శాఖ ఒకింత అభివృద్ధి చేసి.. అనంతరం 2003లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అవుకు జలాశయం వద్ద బోట్లు

అవుకు జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇటీవల బోటు సౌకర్యం కల్పించారు. రిజర్వాయర్‌ వద్ద అతిథి గృహం నిర్మించారు. ఇందులో రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఐదేళ్లుగా అధికారులు కృషిచేస్తున్నా.. ఇంతవరకూ కొలిక్కి రాలేదనే చెప్పాలి. బెలుం గుహలకు సమీపంలో అవుకు రిజర్వాయర్‌ ఉండడంతో పర్యాటకులకు అనువుగా ఉండేందుకు బోటు సౌకర్యం కల్పించారే గానీ, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. రిజర్వాయర్‌లో సుమారు మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. అయినా బోట్‌ నడవడం లేదు. ప్రధాన రహదారిలో ఉన్నందున అభివృద్ధి చేస్తే పర్యటకులకు ఉల్లాసాన్నివ్వడమేగాక ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఇప్పుడిప్పుడే..

సాధారణంగా ఏటా పర్యాటకుల నుంచి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రతి ఆది వారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. సుమారు 50 వేల మంది వస్తుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే కరోనాతో ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో ఆదివారం రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చేది. కరోనాతో పర్యాటక రంగం దెబ్బతింది. ఇప్పుడిప్పుడే పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదాయం పుంజుకుంటోంది. గుహల వద్ద మరిన్ని వసతులు కల్పించాల్సి ఉంది.

నిర్లక్ష్యం చేస్తున్నారు

- రఘురామిరెడ్డి, న్యాయవాది

బెలుం గుహలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద సొరంగ మార్గంగా బెలుంగుహలకు పేరుంది. అలాంటి గుహలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇరవై ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. అవుకు రిజర్వాయర్‌ వద్ద బోట్లను విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

ఆదాయం తగ్గింది

- కుమార్‌, బెలుం గుహల మేనేజరు

కరోనా నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో ఆదాయం భారీగా పడిపోయింది. సాధారణ రోజుల్లో ప్రతి ఆదివారం రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చేది. నేడు కేవలం రూ.15-20 వేల మధ్య వస్తోంది. గుహల్లో మౌలిక వసతులకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పర్యటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని