Donald Trump: ‘ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం

అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్‌ వాంగ్మూలం ఇచ్చారు.

Updated : 08 May 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌(Donald Trump)తో ‘ఏకాంతంగా’ గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె  వాంగ్మూలం ఇచ్చారు.

‘2006లో జరిగిన ఓ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో ట్రంప్‌ను తొలిసారి కలిశా. ఆ తర్వాత ఓ బాడీగార్డ్‌ ద్వారా నన్ను డిన్నర్‌కు ఆహ్వానించారు. అనంతరం హోటల్‌ సూట్‌కు తీసుకెళ్లారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైంది. అక్కడ ఇద్దరం ఏకాంతంగా గడిపాం. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదు. మా సంబంధం గురించి ఎంతోమందికి తెలుసు’ అని డేనియల్‌ వివరించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ vs పోర్న్‌ స్టార్‌.. ఓ ‘టోర్నమెంట్‌’ కథ..!

2011లో ఓ బ్లాగ్‌ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి స్వీకరించానని శృంగార తార తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. ఆమె చేసిన ఆరోపణలను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. ఇలా సుదీర్ఘ సమయం ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి.

హష్‌ మనీకి సంబంధించిన కేసుపై న్యూయార్క్‌ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ చేస్తోంది. 13వ రోజు వాదనలు కొనసాగాయి. ఇందులోభాగంగా ట్రంప్‌పై ఆరోపణలు చేసిన శృంగార తార స్టార్మీ డేనియల్‌.. సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో మాజీ అధ్యక్షుడు కూడా కోర్టు రూమ్‌లోనే ఉన్నారు. వాదనల సమయంలో తన న్యాయవాదులతో గుసగుసలు ఆడుతున్నట్లు కనిపించిన ఆయన.. ఆమె సాక్ష్యం చెబుతున్న సమయంలో ట్రంప్‌ తన తలను ఊపుతున్నట్లు కనిపించారు. అది సాక్షులను బెదిరించడమే అవుతుందని ట్రంప్‌ న్యాయవాదులకు జ్యూరీ సభ్యులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని