Brian Lara: నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా

టీమ్‌ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు. 

Updated : 09 May 2024 09:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ విండీస్‌కు చెందిన బ్రియాన్ లారా (Brian Lara). ఇంగ్లాండ్‌పై 2004లో ఏకంగా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ రికార్డును అధిగిమించే క్రికెటర్ ఇప్పటివరకు కనిపించలేదు. ఈక్రమంలో తన వ్యక్తిగత ఘనతను మరిపించే ప్రదర్శన చేయగల సత్తా భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్‌కు (Yashavi Jaiswal) ఉందని బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. కేవలం టెస్టు రికార్డు మాత్రమే కాకుండా చాలావాటిని కొట్టగల సామర్థ్యం అతడికి ఉందని పేర్కొన్నాడు. గతేడాది లారా హైదరాబాద్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. పోయిన సంవత్సరం నుంచి యశస్వి ఆటను గమనిస్తే చాలా మార్పులు వచ్చాయని మెరుగ్గా ఆడుతున్నాడని అభినందించాడు. 

‘‘నా రికార్డులకు ముప్పు ఉందని భావిస్తున్నా. యశస్వి జైస్వాల్‌కు మంచి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు డబుల్ సెంచరీలు బాదాడు. గతేడాది ఓ మ్యాచ్‌ సందర్భంగా నాతో యశస్వి మాట్లాడాడు. మా మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అదే తొలిసారి సంభాషణ. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. నేను చాలా త్వరగా అతడితో కలిసిపోయా. హైదరాబాద్ - రాజస్థాన్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత నా స్నేహితుడితో కలిసి హోటల్‌ రూమ్‌కు వెళ్లా. అప్పటికే అర్ధరాత్రి అయింది. జైస్వాల్‌ నా దగ్గరకు వచ్చాడు. వేకువజామున 4 గంటల వరకు మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం చెప్పినా వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 

యశస్విలో నేర్చుకోవాలనే ఆత్రుత ఎక్కువ. మా సంభాషణ తర్వాత అతడు కొద్దిగా మెరుగవుతాడని అనుకున్నాం. కానీ, అతడి ఆటతీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతస్థాయికి ఎదిగాడు. నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడం అభినందనీయం. క్రికెట్‌కు సంబంధించిన ఏ అవసరం ఉన్నా కాంటాక్ట్‌ కావాలని నా నంబర్ ఇచ్చా. ఎడమ చేతివాటం బ్యాటర్లను చూడగానే కాస్త పక్షపాతం చూపిస్తా. అభిషేక్ శర్మను చూసినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కుర్రాళ్లు ఎంతో గౌరవంగా ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరతారు. టెస్టుల్లో 400 మైలురాయిని అందుకొనే ఆటగాళ్లు ఉన్నారని అనుకుంటున్నా. అందులో యశస్వికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రిస్‌ గేల్, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి 300+ మార్క్‌ను తాకి సవాల్ విసిరారు. గతంలో సనత్‌ జయసూర్య, ఇంజిమామ్‌ ఉల్ హక్, మ్యాథ్యూ హేడెన్ తదితరులు బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. రికార్డులు అనేవి ఎప్పటికైనా బద్దలు కొట్టడం సహజమే’’ అని లారా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని