close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించాలి

 
మాట్లాడుతున్న పాలనాధికారి ఎంఆర్‌ఎం.రావు

ప్రగతిభవన్‌, న్యూస్‌టడే: అధికారులు నిబంధనల మేరకు పుర ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పురపాలక సంఘాల ఆర్వోలు, ఏఆర్వోలకు కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రిటర్నింగ్‌ అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. నోటిఫికేషన్‌ను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఫలితాలు వెల్లడి వరకు ఆర్వోలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. నగర పాలక సంస్థలో నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, పురపాలక సంఘాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన పీవో, ఏపీవోలకు ఈ నెల 17న శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు చెందిన వారికి రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో, బోధన్‌లో ఉర్దూ ఘర్‌ సమావేశ మందిరంలో, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ వారికి ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళాక్షేత్రంలో శిక్షణ తరగతుల నిర్వహణ కోసం కావల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ సమావేశంలో బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్లు స్వామి, శైలజ, గంగాధర్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌ ఎంపీడీవో సంజీవ్‌కుమార్‌ ఆర్వోలు, ఏఆఆర్వోలకు శిక్షణ ఇచ్చారు.

జలసంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి

ఆర్మూర్‌: జలసంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం.రావు సూచించారు. రుద్రూరు కృషివిజ్ఞాన కేంద్రం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్‌లోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం జలశక్తి అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ తరాల కోసం జలసంపదను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. జిల్లాలోని 21 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైతే ఆర్మూర్‌ మండలంలోనే ఇది ఎక్కువగా ఉందన్నారు. ప్రతి వర్షపు బొట్టు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో ప్రధానంగా ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నామన్నారు. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డా.రవి బాలాజీనాయక్‌ జలసంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. అంతకుముందు జలసంరక్షణకు సంబంధించిన వివిద స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జేడీఏ గోవింద్‌, డీఆర్‌డీవో రమేష్‌, భూగర్భజలశాఖ డీడీఆర్‌డీ ప్రసాద్‌, ఉద్యానవనశాఖ డీడీ నర్సింగ్‌దాస్‌, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు మెట్టు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.