close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఆయువు తీసే వాయువు 

● గాలి, నీరూ కలుషితమే

● కాలుష్య కారకంగా కర్నూలు

● పరోక్షంగా ఓజోన్‌ పొరపై ప్రభావం

● నేడు ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం

అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ప్రకృతికి తీరని నష్టం కలిగిస్తోంది. పెరుగుతున్న జనాభా, అందుకు తగ్గట్లుగా వస్తున్న అవసరాలన్నీ ప్రకృతిని దెబ్బతీస్తున్నాయి. వాయి, జల కాలుష్యాలకు ఓజోన్‌ పొర పలుచబడగా, ఆ దెబ్బకు మనషుల నుంచి పశుపక్ష్యాదులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. యూవీ కిరణాలు నేరుగా భూమిని తాకకుండా అతినీలలోహిత కిరణాలను అడ్డుకుని సూర్యుని నుంచి వెలుతురు, వేడిమిని మాత్రమే భూమి మీదకు పంపే ‘ఓజోన్‌’ పొరను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సెప్టెంబరు 16న ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: జిల్లాలో  ప్రతి చదరపు కి.మీ.కు 229 మంది జన సాంద్రత ఉంది. 10 లక్షల కుటుంబాలున్న జిల్లాలో 10 భారీ పరిశ్రమలు ఉండగా వందలాది మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం పరిశ్రమల కాలుష్యం కంటే ప్రజా కాలుష్యమే ఎక్కువగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో వేలాది ఆటోలు రోడ్ల పైకి వచ్చి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. సరైన చర్యలు లేకపోవడం, విజన్‌ లేక పట్టణాల్లోని 3 లక్షల కుటుంబాలు, గ్రామాల్లోని 7 లక్షల కుటుంబాల్లో నుంచి వస్తున్న మురుగు నదుల్లోకి చేరి జల కాలుష్యానికి దారి తీస్తున్నాయి. చెత్తను ఎరువుగా మార్చాలనే ఆలోచన లేక మరింత కాలుష్యానికి కారణమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాధాన్యాన్ని గుర్తించక అభివృద్ధి పేరిట విధ్వంసానికి ఒడిగట్టడంతో సమతుల్యం దెబ్బతింటోంది. జిల్లా వ్యాప్తంగా అడవులు అంతరించగా, అవసరాల దృష్ట్యా విలాస వస్తువులు, వాహనాల వినియోగంతో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్‌ భూమిలో కరుగక ప్రమాద కారకాలవుతున్నాయి.

వెలువడుతున్న విష వాయువులు

జిల్లాలో 6.25 లక్షల ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వాహనాలతోపాటు భారీ వాహనాలు నడుస్తున్నాయి. ఇందులో సగానికి సగం వాహనాల సగటు వయస్సు 15 ఏళ్లుగా ఉంది. వీటి ద్వారా రోజుకు ఒక లీటర్‌ డీజిల్‌గాని, పెట్రోల్‌గాని వాడితే 6.25 లక్షల లీటర్ల ఇంధనం వినియోగం జరుగుతుంది. వీటి ద్వారా రోజుకు 3 కిలోల విష వాయువు వెలువడుతుండగా, జిల్లాలోని 40 లక్షల మందికిపైగా దానినే పీలుస్తుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 60 వేల వరకు ఆటోలు ఉన్నాయి. ఇందులో 30 వేలకుపైగా ఒక్క కర్నూలు నగరంలోనే ఉండగా, 10 వేల వరకు నంద్యాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ పురపాలక సంఘాల పరిధిలో మరో 10 వేలకుపైగా ఆటోలు ఉండగా, మిగతావి జిల్లా అంతటా ఉన్నాయి. కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని పురపాలక సంఘాల పరిధిలో రవాణా సౌకర్యం అంటే ఆటోలే. ఇవి పాత వాహనాలు కావడంతో వీటి నుంచి పెద్ద ఎత్తున విష వాయువులు వెలువడుతున్నాయి. జిల్లాలో రోజుకు 120 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతోందని ఒక అంచనా. ఈ లెక్కన నెలకు 3,600 మెట్రిక్‌ టన్నుల వినియోగం ఉంది. ఏడాదికి 40 వేల మెట్రిక్‌ టన్నుల వాడకం ఉంది. ఐదు సంచుల ప్లాస్టిక్‌ వల్ల ఒక కిలో, రెండు సీసాల వల్ల మరో కిలో విష వాయువులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లెక్కన 40 వేల టన్నుల ప్లాస్టిక్‌తో ఉత్పన్నమయ్యే విష వాయువులను ఊహించడమే కష్టం. వీటన్నింటికీ కారణం మనమేనన్న విషయాన్ని గుర్తించాలి. జిల్లాలోని 9 పురపాలక సంఘాలు, 44 మండల కేంద్రాలతోపాటు మిగతా అన్ని ప్రాంతాల నుంచి రోజుకు 584 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఎరువుగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇందులో నుంచి వచ్చే 120 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించి జిల్లాలోని మూడు సిమెంట్‌ పరిశ్రమలకు సరఫరా చేయవచ్ఛు కానీ ఇదేమీ జరుగడం లేదు. నంద్యాల డంప్‌ యార్డులోనైతే చెత్తను బహిరంగంగా తగులబెడుతూ కాలుష్యానికి మున్సిపాలిటీనే కారణమవుతుండటం శోచనీయం.

నది కాలుష్యం ఎక్కువే..

జిల్లా వ్యాప్తంగా నది కాలుష్యం కూడా ఎక్కువగానే ఉంది. 8 లక్షల జనాభా ఉన్న కర్నూలు కార్పొరేషన్‌ మురికి నీటిని శుద్ధి చేయకుండానే తుంగభద్ర, హంద్రీ నదుల్లో కలుపుతున్నారు. ఈ కార్పొరేషన్‌ నుంచి రోజుకు 60 మిలియన్‌ లీటర్ల మురుగు వెలువడుతోంది. అలాగే నంద్యాల పట్టణం నుంచి కూడా మురుగును శుద్ధి చేయకుండానే కుందూలోకి వదులుతున్నారు. ఇక్కడ రోజుకు 12 మిలియన్‌ లీటర్లు వచ్చి చేరుతుంది. నిబంధనల ప్రకారం నదుల్లోకి మురుగును కలిపేచోట శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఆ ఊసేలేదు. ఇది కూడా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్నూలు, నంద్యాల వంటి కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడే మురుగును నేరుగా నదుల్లో కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో శ్రీశైలంలోని లింగాలగట్టు, హంద్రీ నది సమీపంలోని లక్ష్మీపురం, తుంగభద్ర సమీపంలోని భావపురం, మంత్రాలయంలలో కూడా ఇదే పరిస్థితి.

ప్రమాదకరంగా కర్నూలు

కర్నూలు నగరంలోని ఐదు ప్రదేశాల్లో పీఎం 10 (సూక్ష్మ ధూళి కణాలు) పరిమితికిమించి నమోదవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో వెల్లడైంది. గాల్లోకి వెలువడే 40 రకాల వాయు కాలుష్య ఉద్గారాల్లో పీఎం 10, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, అమ్మోనియా, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ప్రమాణికాలను ఆధారంగా చేసుకుని గాలి నాణ్యతను నిర్ధరిస్తారు. కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల ప్రకారం పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు ఒక ఘనపు మీటర్‌ గాలిలో 60 మైక్రోగ్రాములకుమించి ఉండకూడదు. కానీ కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా, సీ క్యాంపు, పూలబజార్‌, రాజ్‌విహార్‌, కృష్ణానగర్‌లో ప్రమాదకర స్థాయిలో పీఎం 10 నమోదైంది. కల్లూరు పారిశ్రామికవాడ ప్రాంతంలో ఇదే పరిస్థితి. పీఎం 2.5 పరిమితికిమించి ఉంటే నేరుగా గుండె, మెదడుకు ఆక్సిజన్‌ అందే ప్రక్రియపై ప్రభావం పడి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

తరుగుతున్న అడవులు

జిల్లాలో అడవులు క్రమంగా రూపుకోల్పోతున్నాయి. స్మగ్లర్ల రంపపు కోతకుతోడు అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం ఇందుకు తోడవుతున్నాయి. జిల్లాలో 3.14 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. పర్యావరణ సమతుల్యం కోసం అడవులు ఉండాలి. అటవీ శాఖ లెక్కల ప్రకారమే జిల్లాలో అడవుల విస్తీర్ణం తగ్గుతున్నట్లు చెబుతున్నాయి. 2009 లెక్కల ప్రకారం జిల్లాలో అటవీ శాతం 12.07 శాతం ఉండగా, 2011కు 11.94 శాతానికి చేరింది. సాధారణ అడవి 2009లో 740 చదరపు కి.మీ. కాగా 2011 నాటికి 549 చదరపు కి.మీ.లకు తగ్గింది. సాధారణంగా ఒక చెట్టు 12 కి.గ్రా. కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుని నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుంది. 33 శాతం ఉండాల్సిన అడవుల విస్తీర్ణం జిల్లాలో ప్రస్తుతం 19 శాతం మాత్రమే ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.