close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

కుటుంబ కలహాలతోనే కార్తీక్‌ ఆత్మహత్య

గ్రామీణ డీఎస్పీ రాఘవ రెడ్డి

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతోనే దగదర్తి గ్రామానికి చెందిన గండికోట కార్తీక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని నెల్లూరు గ్రామీణ డీఎస్పీ కె.రాఘవ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు పార్టీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని గ్రామీణ డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న రాత్రి 8 గంటలకు దగదర్తిలోని శ్రీబాల మారుతీ హోటల్‌లో ఉన్న ఇనుప దూలానికి కరెంటు వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్‌కు ఏడాది క్రితం బిట్రగుంట మండలం నాగులవరం గ్రామానికి చెందిన లతతో పెళ్లి జరిగింది. తన తల్లి మాధవి, భార్యతో కలిసి దగదర్తిలో ఉంటూ బాల మారుతీ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. అయిదు సంవత్సరాల క్రితం కార్తీక్‌ తండ్రి వెంకటరాజు మాధవ అనే వ్యక్తితో కలిసి హోటల్‌ను నిర్వహించేవారు. ఇదే క్రమంలో మాధవ వల్ల వెంకటరాజు తన భార్య మధ్య మనస్పర్థలు రావడంతో వెంకటరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఈ నెల మొదటి వారంలో వెంకటరాజు దగదర్తిలో భార్యాభర్తలను చూసేందుకు ఇంటికి రాగా, అక్కడ వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయంపై వెంకటరాజు దగదర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్సై కుటుంబ సభ్యులను ఈ నెల 6న పోలీసు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి విచారించారు. అయినా కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగడంతో కార్తీక్‌ హోటల్‌ మూసివేసి తన తల్లి, భార్యతో కలిసి రాజుపాళెంలోని చెల్లెలు ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కార్తీక్‌ భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం, తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో మనస్తాపానికి గురై ఈ నెల 12న రాత్రి 8 గంటలకు దగదర్తిలోని హోటల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో దగదర్తి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును బుచ్చిరెడ్డిపాలెం సీఐకి అందజేశారు. దగదర్తి తహసీల్దారు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీడియో కవరేజీ ద్వారా పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు, ఆస్తి విషయాల కారణంతో భార్య వదిలి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు ఇన్‌స్పెక్టరు స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.