Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

భూ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే

 రెవెన్యూ పునర్‌వ్యవస్థీకరణతో అనేక మార్పులు
భవిష్యత్తు అవసరాల  ప్రాతిపదికన విధానాలు
 ముసాయిదా రూపకల్పనకు  సిద్ధమవుతున్న రెవెన్యూశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం అదే తడవుగా భూ సంబంధిత వ్యవహారాలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తయ్యే విధానాలు తీసుకురావాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితమే రెవెన్యూ శాఖలో ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. దిద్దుబాట్లు, పెన్ను గీతలు పడని తీరులో పూర్తిస్థాయిలో డిజిటల్‌ పాసుపుస్తకాలను ప్రవేశపెట్టింది. భూముల రిజిస్ట్రేషన్లు, భూ యాజమాన్య హక్కు బదిలీ (మ్యుటేషన్లు) ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా పూర్తయ్యేలా చర్యలు ప్రారంభించింది. రెవెన్యూశాఖ ద్వారా ప్రజలకు అందే ఏ సేవ అయినా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే అందించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.

రిజిస్ట్రేషన్‌ సమయంలోనే వివరాలు
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ విధానాన్ని సమూలంగా మార్చనున్నారు. రాష్ట్రంలో 443 తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం గతేడాదే నిర్ణయించింది. కొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక ముందు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే భూమికి సంబంధించిన డిజిటల్‌ పటాన్ని (సర్వే) సమర్పించేలా విధానాలు తీసుకురానున్నారు. భూమికి సంబంధించిన పాసు పుస్తకంతో పాటు సర్వే నంబర్లు, నక్షను చూపే డిజిటల్‌ పటం సమర్పిస్తే వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు. డిజిటల్‌ పటం ఆధారంగానే క్షేత్రస్థాయిలో భూమి సరిహద్దులను బేరీజు వేసుకుని వెంటనే తహసీల్దారు లేదా ఆర్డీవో మ్యుటేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన జియో ట్యాగింగ్‌ విధానాన్ని భూ సర్వేకు జోడించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో భూముల వివరాలు, హద్దులు ఇష్టారీతిన మార్చడానికి అవకాశం లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పాసుపుస్తకాల జారీలో వేగం
భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం ప్రభుత్వం గతేడాది కొత్త పాసుపుస్తకాల జారీని ప్రారంభించింది. మొత్తం 72 లక్షల వ్యవసాయ ఖాతాల్లో 61.13 లక్షల ఖాతాలకు సంబంధించి పుస్తకాలు జారీ చేసేందుకు నిర్ణయించగా ఇప్పటి వరకు 58 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. వివాదాస్పద భూముల జాబితాలో ఉన్న ఖాతాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని తాజాగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం జిల్లాల యంత్రాంగానికి సూచించింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చే నాటికి ఆన్‌లైన్‌లో భూ దస్త్రాల సమాచారం స్పష్టంగా, సమగ్రంగా అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో ప్రభుత్వం రెండు రోజుల పాటు కార్యశాలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. వారు ఇచ్చిన సూచనలను క్రోడీకరించి వాటి ఆధారంగా రెండు మూడు రోజుల్లో విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.