Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/10/2021 21:00 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. యాదాద్రిలో మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు.

2. రేపు రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపు

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో సీఎం, పోలీసులు లాలూచీ పడ్డారు. డీజీపీ కార్యాలయం పక్కనే  తెదేపా కార్యాలయం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడుతారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ పాటించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

3. దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారు: రేవంత్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులపై ఫిర్యాదు చేశారు. నిరోష అనే యువతితో కలిసి ఫిర్యాదు చేసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులు నిరోషపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి సభలో అడిగినందుకు దూషించి దాడి చేశారని మండిపడ్డారు.

4. అదో ఎన్నికల డ్రామానే.. కాంగ్రెస్‌ చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తామని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించడంపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. అదంతా కేవలం ఎన్నికల డ్రామా మాత్రమేనని విమర్శించారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్‌ పార్టీకి మహిళలు, దళితులు, వెనుకబడినవారు గుర్తొస్తారంటూ ట్విటర్‌లో చురకలంటించారు.

5. 100కోట్లకు చేరువైనా.. 30శాతం మందికే రెండు డోసులు!

తాజాగా భారత్‌ 100కోట్ల డోసుల పంపిణీకి చేరువయ్యింది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. సింగిల్‌ డోసు, పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ తీసుకున్న వారి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 30శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకోగా.. 70శాతానికిపైగా అర్హులు కేవలం ఒక్క డోసు మాత్రమే తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

6. జపాన్‌ సముద్రంలోకి ఉ.కొరియా క్షిపణి..!

జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్న ఓ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని ‘పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో’ నుంచి దీనిని ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్‌ సముద్రంలో పడింది.

7. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోండి: బంగ్లాదేశ్‌ ప్రధాని

బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా మైనార్టీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొమిల్లా జిల్లాలో దుర్గామాత పూజల వేళ మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. ఆయా ప్రాంతాలకు పాకాయి. దీంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేబినెట్‌ సమావేశంలో ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. ఆయా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

8. అదుపులోనే కొవిడ్‌ విస్తృతి.. ఊరట కలిగిస్తోన్న ఆర్‌-విలువ!

కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోయిన భారత్‌కు మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివరి మూడు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇదే సమయంలో వైరస్‌ విస్తృతిని తెలియజేసే ఆర్‌-విలువ (R Factor) 1 కంటే తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా సెప్టెంబర్‌ నెల నుంచీ ఈ విలువ ఇదేస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలిపింది. 

9. షెర్లిన్‌ చోప్రాపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా

మోడల్‌, నటి షెర్లిన్‌ చోప్రాపై శిల్పాశెట్టి,  రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై షెర్లీ చేసిన ఆరోపణలు నిరాధారమని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్‌ లైంగికంగా, మానసికంగా తనని వేధిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి ఎఫ్.ఐ.ఆర్‌. నమోదు చేయించింది. 

10. టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదు : సెహ్వాగ్

పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని మాజీ క్రికెటర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. ‘ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నాం’ అని పాకిస్థాన్‌కి చెందిన ఓ యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్‌ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని