కరోనా ‘డైవర్స్‌’ వద్దు..మా వద్దకు రండి
close

తాజా వార్తలు

Published : 16/04/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘డైవర్స్‌’ వద్దు..మా వద్దకు రండి


టోక్యో: కరోనా వైరస్‌ విలయతాండవంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. దాంతో చిన్నాపెద్దా, ఆడామగా అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో పిల్లల అల్లరి, పెరిగిన ఇంటి పని, గృహ హింస, ఆర్థిక సమస్యలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా, రష్యా వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లెకెక్కినట్లు పత్రికలు రాశాయి. ముఖ్యంగా మహిళలకు శారీరక శ్రమ పెరిగినట్లు కూడా చెప్పుకొచ్చాయి. అయితే ఆ వార్తలను తమ వ్యాపార ఆలోచనగా మలుచుకుంది జపాన్‌ రాజధాని టోక్యోకు చెందిన కుసోకు కంపెనీ. మీకు మీ భాగస్వామి, కుటుంబం నుంచి ప్రశాంతత, ఇంటి పని నుంచి కాస్త విశ్రాంతి కావాలంటే మా వద్దకు రండి.. విడాకులు తీసుకోకండి అంటూ ప్రచారం మొదలు పెట్టింది. షార్ట్ టర్మ్ రెంటల్ సంస్థ అయిన కుసోకు ఖాళీగా ఉన్న తన అపార్ట్‌మెంట్లను కొద్దికాలం ఉండటానికి అద్దెకు తీసుకోమని సలహా ఇస్తుంది. వాటిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్లు చెబుతుంది. అలాగే న్యాయనిపుణుడితో విడాకుల వరకు వెళ్లిన దంపతులకు 30 నిమిషాల పాటు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తుంది. 
దీనిపై ఆ కంపెనీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ..ఏప్రిల్ 3 నుంచి మేము ప్రచారం మొదలు పెట్టగా, ఇప్పటికి 20 మంది ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు. వారిలోని ఓ మహిళ గురించి చెప్తూ..‘ఆమె భర్తతో గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చింది. ఆమె తన కోసం సమయం కావాలనుకుంది. పాఠశాలలు మూయడంతో ఇంట్లో పిల్లల అల్లరిని భరించలేకపోయింది. భర్త ఇవేమీ పట్టించుకోకుండా ఉంటాడని చెప్పింది’ అని చెప్పుకొచ్చారు. వైరస్‌ ఉద్ధృతి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉండటం వల్ల విడాకులు పెరుగుతున్నాయా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ..దానిపై మా వద్ద పూర్తి సమాచారమైతే లేదు కానీ, లాక్‌డౌన్‌ సమయంలో చైనా, రష్యాలో విడాకులు పెరిగాయని మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తెలిసిందన్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌లో ‘కరోనా-డైవర్స్‌’ హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. అక్కడి జాతీయ మీడియా సంస్థ దంపతుల మధ్య కలహాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. 
జపాన్‌ సంప్రదాయంలో భాగంగా మహిళలే ఇంటిపని, పిల్లల బాగోగులు చూడటం వంటివి చేస్తుంటారు. ఓ వైపు ఆ బాధ్యతలను చక్కబెడుతూ ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మహిళల మీద గృహ హింస, పని ఒత్తిడి పెరిగిందని మన దగ్గరా వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే కరోనా వైద్య, ఆర్థిక వ్యవస్థలే మీదే కాకుండా కుటుంబ బంధాల మీద దెబ్బకొడుతుందేమో అనిపిస్తుంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని