close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/05/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక స్వేచ్ఛకు.. సూత్రాలివీ...

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న మాట.. కరోనా.. ఈ మహమ్మారి దెబ్బకు పేద-ధనిక తేడా లేకుండా అందరికీ ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్పుతోంది. దేశాలు, సంస్థలు, వ్యక్తులకు ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. సంక్షోభ సమయంలోనే కాకుండా.. అన్ని సందర్భాల్లోనూ.. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని మనం గుర్తించాలి. ఒక నెల ఆదాయం తగ్గినా లేదా ఆగిపోయినా.. ఆందోళన చెందకుండా ఉండే పరిస్థితులు రావాలి. అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆపదలో రక్ష..

అనుకోని సంఘటనల వల్ల మనిషి మనుగడకు, కష్టార్జితానికీ రాగల నష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. దీనికోసం తప్పనిసరిగా బీమా పాలసీలు తీసుకోవాల్సిందే. బీమా అనేది అవసరం రాకముందే తీసుకోవాల్సింది. ‘జీవిత విలువ’కు సరిపడా జీవిత బీమా, కుటుంబమంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే.. ఆదుకునేలా వ్యక్తిగత ప్రమాద బీమా, పదవీ విరమణ అనంతరం తోడుండేలా పింఛను బీమా.. ఇలా కీలకమైన పాలసీలు చాలా ఉన్నాయి. ఇవి మీ దగ్గర ఇప్పటికే ఉంటే.. మరోసారి వాటిని సమీక్షించుకోండి. లేకపోతే వెంటనే తీసుకోవడం మేలు. చిన్న వయసులోనే తీసుకుంటే.. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలూ ఉండవు కాబట్టి, పాలసీ పొందడమూ సులువవుతుంది.

ఆదాయం ఆగినా..

అనుకోని కారణాల వల్ల ఆదాయం కోల్పోయినా.. అనిశ్చితి నేపథ్యంలో తగ్గినా.. ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకూడదు. అందుకోసం కనీసం 6-12 నెలల ఆదాయాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తంలో కొంత భాగం వెంటనే వాడుకునే నగదు రూపంలో ఉండాలి. మిగిలినదాన్ని అవసరమైన వెంటనే నగదుగా మార్చుకునే పథకాల్లో పెట్టుబడి పెట్టాలి.

అవసరాలకు ప్రాధాన్యం..

అవసరం.. కోరిక.. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఈ సమయంలో దాన్ని గుర్తించాలి. అవసరాల కోసం జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కోరికలను సాధ్యమైనంత అదుపు చేసి, వాటికోసం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. వీలైనంత కాలం వాయిదా వేయాలి. ఇతరుల ప్రేరణతో.. పదిమందిలో గొప్ప కోసం చేసే వ్యయాలపై నియంత్రణ పాటించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆరోగ్య రక్షణకు భౌతిక దూరం పాటించడం ఎంత అవసరమో.. ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దుబారాను తగ్గించడమూ అంతే ముఖ్యం. అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉంటూ.. పొదుపు, పెట్టుబడులను పెంచడమే ఇప్పుడు మన లక్ష్యం కావాలి.

లక్ష్యం ఏమిటి?

మీకున్న ఆర్థిక లక్ష్యాలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలాలకు విభజించాలి. ఏ ఆర్థిక గమ్యస్థానాన్ని చేరేందుకు ఎలాంటి పథకాన్ని ఉపయోగించుకోవాలి అనే అవగాహన పెంచుకోవాలి. సరైన స్పష్టతతో తీసుకునే నిర్ణయాలతోనే భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ఉంటుందని మర్చిపోవద్ధు.

కష్టార్జితం కరిగిపోవద్ధు.

కాలంతో పాటు కొన్నింటి విలువ తగ్గుతుంది. మరికొన్నింటివి వృద్ధి చెందుతుంది. మన కష్టార్జితం ఎప్పుడూ విలువ పెరిగే పథకాలు, ఆస్తుల్లోనే ఉండాలి. తరుగుదల ఉండే వాటి విషయంలో అవసరమైన మేరకే పెట్టుబడులు పెట్టాలి. ఖరీదైన వస్తువులు, ఉత్పత్తులు, సేవల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఆయా మొత్తాలను వృద్ధి ఆధారిత పొదుపు, పెట్టుబడి పథకాలకు మళ్లించాలి. గుర్తు పెట్టుకోండి. రూపాయి ఆదా చేస్తే.. రూపాయిని సంపాదించినట్లే..

చిన్న మొత్తంతోనూ..

సంప్రదాయ పొదుపు పథకాలతోపాటు, వృద్ధి ఆధారిత పెట్టుబడి పథకాల్లోనూ నెలకు రూ.1,000తో పొదుపు, మదుపులను ప్రారంభించేందుకు వీలుంది. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎన్‌పీఎస్‌, బాండ్లు, బంగారం, షేర్లు మ్యూచువల్‌ ఫండ్లు తదితర పథకాల్లో నాలుగైదు ఎంపిక చేసుకోవాలి. నెలనెలా క్రమం తప్పకుండా దీర్ఘకాలిక లక్ష్యంతో కొనసాగాలి. అప్పుడు చక్రవడ్డీతో మన పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.1,000 చొప్పున 30 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 8శాతం రాబడితో రూ.15లక్షలు చేతికందుతాయి. అదే.. 12 శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే.. రూ.35 లక్షలు పొందవచ్ఛు కాబట్టి, మీ కోసం మీరు కొంత మొత్తాన్ని ఇలా మదుపు చేయడం మర్చిపోవద్ధు వయసు, ఆదాయ వ్యయాలు, కాల వ్యవధి, లాభనష్టాలను బట్టి మీ పెట్టుబడి పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి.

మంచి అప్పులు చేయండి..

సొంతిల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, కొత్త వ్యాపారం ప్రారంభించడం, వ్యాపారాన్ని విస్తరించడం.. ఇవన్నీ వ్యక్తి ఉన్నతికి ఉపకరిస్తాయి. కాబట్టి, అవసరమైన మేరకు ఈ రుణాలు మంచివే. కానీ, అంతగా అవసరం లేని, ఆడంబరాలకు చేసే అప్పులు ఎప్పుడూ ప్రమాదమే. అధిక వడ్డీతో వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డుపై అప్పు తీసుకొని, అనుత్పాదకత కోసం వాడటం ఏమాత్రం సరికాదు. సొంతిల్లు, వ్యాపారం కోసం రుణ వాయిదాలు చెల్లిస్తూనే.. వీలైతే.. వీటికి అదనంగా కొంత మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి. దీనివల్ల తొందరగా రుణ విముక్తితోపాటు, ఎంతోకొంత ఆదాయాన్ని సంపాదించేందుకూ వీలవుతుంది.

ఓపిక ఉండాలి..

అత్యాశ, భయం వంటి భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా సందర్భాల్లో సత్ఫలితాలు ఇవ్వవు. మంచి వ్యూహం, దానిని ఆచరించేందుకు ఆసక్తి.. కాస్త క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే.. ఆర్థిక విజయం సాధ్యమవుతుంది. ఈ క్రమంలో నేర్పుతో పాటు, ఓర్పూ ముఖ్యమే.

ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గాయి. దీన్ని ఆసరాగా తీసుకొని, కొంతమంది అధిక వడ్డీ ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తుంటారు. ఇలాంటి గొలుసుకట్టు పథకాలతో జాగ్రత్తగా ఉండాలి. వీటిలో మదుపు చేసి, కష్టార్జితాన్ని కోల్పోవద్ధు నియంత్రణ సంస్థల ఆధీనంలో ఉండే పథకాల్లోనే మీ డబ్భు. మీ కోసం డబ్బును సంపాదించేలా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం.


వైవిధ్యమే ప్రాణం..

క్కువ నష్టం ఉండి, రాబడికి ఎంతో కొంత హమీనిచ్చేవి సురక్షిత పథకాలు. వీటినే పొదుపు పథకాలని చెప్పొచ్ఛు ఎక్కువ నష్టభయం ఉండి, అధిక రాబడికి ఆస్కారం ఉండేవి పెట్టుబడులు. ఒక్కో పథకం ఒక్కో సమయంలో మంచి పనితీరును చూపిస్తుంటాయి. మీ ఆర్థిక స్థితిగతులు, కాల వ్యవధి, లాభనష్టాలను లెక్కలోకి తీసుకోవాలి. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేలా మీ పొదుపు, పెట్టుబడుల మేళవింపు ఉండాలి. అవసరమైనంత మేర వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టడమే ఇప్పుడూ, ఎప్పుడూ పాటించాల్సిన నియమం.


కుటుంబానికి  చెప్పండి..

పొదుపు, పెట్టుబడులు మీ పేరుతో ఉన్నా.. అవి కుటుంబ ఆర్థిక శ్రేయస్సు కోసమే. వాటి గురించి కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండాలి. మీరు చేస్తున్న పొదుపు, పెట్టుబడులు, తీసుకున్న బీమా పాలసీలు, ఆర్థిక బరువు బాధ్యతలు అన్నీ వారికి తెలియాలి. ప్రస్తుతం అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, ఒక రోజును దీని కోసం కేటాయించండి. జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఖాతాను నిర్వహించండి. ఆయా పథకాలకు నామినీ పేరు ఉందా లేదా చూసుకోండి. అన్ని వివరాలనూ ఒక చోట రాసి పెట్టడం ఎంతో అవసరం.

- జె.వేణుగోపాల్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌, జెన్‌ మనీ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.