close

తాజా వార్తలు

సేనకు అందని ద్రాక్ష!

 మహారాష్ట్రలో రసకందాయంగా రాజకీయం
 శివసేనకు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా
  మద్దతుపై ఎటూ తేల్చని కాంగ్రెస్‌
  మరింత గడువు కోరిన ఆదిత్య ఠాక్రే
  కుదరదన్న గవర్నర్‌
  పవార్‌ పార్టీకి పిలుపు
  రోజంతా ఎడతెగని చర్చలు

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, అనూహ్య పరిణామాలు ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలిపిస్తున్నాయి. అధికార పీఠం.. వివిధ పార్టీల మధ్య దోబూచులాడుతోంది. భాజపా మద్దతు లేకుండా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల తోడ్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఎన్‌సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెస్‌ చల్లగా చెప్పడంతో అయోమయం మరింత పెరిగింది. దీంతో ఈసారి అవకాశం ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఎన్‌సీపీకి లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తంచేయాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆ పార్టీకి సూచించారు. కేంద్రంలో శివసేన మంత్రి కూడా రాజీనామా చేశారు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 56 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధతను తెలియజేయాలంటూ గవర్నర్‌ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం 7.30 గంటల లోపు స్పందన తెలియజేయాలని ఆయన కోరారు. ఎన్నికల్లో 105 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. సర్కారును ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు చెప్పడంతో సేనకు ఆహ్వానం అందింది. దీంతో శివసేన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కోరింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిస్తే 154 మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూరినట్లవుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మూడు పార్టీల మధ్య జోరుగా సమావేశాలు, ఫోన్‌ సంభాషణలు జరిగాయి. సేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమ్మతి తెలిపారని, ఈ మేరకు ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు స్పష్టంచేశారని వార్తలు వచ్చాయి. ఇక మూడు పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు లాంఛనమేనని అందరూ భావించారు. అయితే శివసేనకు గవర్నర్‌ ఇచ్చిన గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు.. మహారాష్ట్రలో పరిస్థితులపై ఎన్‌సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందంటూ కాంగ్రెస్‌ చేసిన ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ‘‘ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో సోనియా మాట్లాడారు. ఆ పార్టీతో మరిన్ని చర్చలు జరుపుతాం’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం శివసేన నేతలు ఏక్‌నాథ్‌ శిందే, ఆదిత్య ఠాక్రేలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమేనని ప్రకటించారు. సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి మూడు రోజుల గడువును కోరారు. దీనికి గవర్నర్‌ తిరస్కరించారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి ఎన్‌సీపీకి పిలుపు వచ్చింది.

ఎన్‌డీఏతో తెగదెంపులు?
మహారాష్ట్రలో సేన ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటే ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకోవాలని ఎన్‌సీపీ షరతు విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలో సేనకు చెందిన ఏకైక మంత్రి అరవింద్‌ సావంత్‌ సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో రెండు పార్టీల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఎన్‌సీపీ అగ్రనేతలు ముంబయిలో సమావేశమయ్యారు. దిల్లీలో సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ జరిగింది.

జోరుగా మంతనాలు
సేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయానికి రావడానికి ముందు మహారాష్ట్రలో పార్టీ నేతల వాదన వినాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. రాష్ట్ర నేతలతో సంప్రదింపుల అనంతరం సీడబ్ల్యూసీ మరోసారి సమావేశమై, చర్చలు జరిపింది. మరోపక్క శరద్‌ పవార్‌ ముంబయిలోని ఒక హోటల్‌లో ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఉద్ధవ్‌ సోనియాతోనూ ఫోన్లో మాట్లాడారు. అయితే ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో తాను ఇంకా మాట్లాడాల్సి ఉందని సోనియా పేర్కొన్నట్లు తెలిసింది. సైద్ధాంతికంగా వ్యతిరేకంగా ఉన్న శివసేనకు మద్దతు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనను కాంగ్రెస్‌లోని ఒక వర్గం వాదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రెండు పార్టీలూ అంగీకరించాయి: ఆదిత్య
కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వనప్పటికీ శివసేన నేత ఆదిత్య ఠాక్రే మాత్రం రెండు పార్టీలు (కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు) తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయని చెప్పారు. సోమవారం ఇక్కడ గవర్నర్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమని అయితే కావాల్సినంత సంఖ్యా బలాన్ని సమకూర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే అదనంగా గడువు ఇవ్వడానికి ఆయన నిరాకరించారని చెప్పారు. సర్కారు ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొనే లేఖను శివసేన ఇవ్వలేదని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

జైపుర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మకాం: మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీ అధిష్ఠానం రాజస్థాన్‌లోని జైపుర్‌కు తరలించి ఒక రిసార్టులో వారికి వసతి కల్పించింది.

సేన నేత రౌత్‌కు అస్వస్థత:  శివసేన ముఖ్య నేతల్లో ఒకరైన సంజయ్‌ రౌత్‌ (57)కు సోమవారం రాత్రి ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేశారు. ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఆయన చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు.

నాటకీయ పరిణామాలు

శివసేన ఏం చేసింది?: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమేనంది. తమకు మద్దతునిచ్చేవారితో లేఖను మాత్రం 24 గంటల వ్యవధిలో సమర్పించలేకపోయింది. మరో రెండ్రోజులు సమయం ఇవ్వాలని కోరింది. సోనియాగాంధీతో ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్లో మాట్లాడారు.

గవర్నర్‌ స్పందన ఏమిటి?: సేనకు గడువు పెంచేందుకు నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి సూచించారు. మంగళవారం వరకు సమయం ఇచ్చారు.

ఎన్సీపీ ఏమంది?: మిత్రపక్షాలతో చర్చించుకుని సాధ్యమైనంత త్వరగా వస్తామని చెప్పింది.

గడువు ఎంత?: మంగళవారం రాత్రి 8.30

కాంగ్రెస్‌ స్పందనేమిటి?: మహారాష్ట్రలోని పార్టీ నేతల అభిప్రాయాన్నీ తెలుసుకుంది. మంగళవారం సోనియా నివాసంలో మరోసారి కీలక సమావేశం నిర్వహించనుంది.

రాష్ట్రపతి పాలన దిశగా పరిస్థితులు?

ఈనాడు, దిల్లీ మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రపతి పాలన దిశగా సాగే సూచనలు కనిపిస్తున్నట్లు రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీ భాజపా నిరాకరించడం, మరింత సమయం కావాలని శివసేన చేసిన వినతిని గవర్నర్‌ తిరస్కరించడంతో... పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభం దిశగానే సాగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచినప్పటికీ, కాంగ్రెస్‌-ఎన్‌సీపీ ద్వయానికి తగినంత సంఖ్యా బలం ఉండదు. తమ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌-ఎన్‌సీపీ కూటమికి మద్దతు దొరకడం కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం మినహా గవర్నర్‌కు మరో అవకాశంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.‘

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.