close

తాజా వార్తలు

బాబోయ్‌ శివార్లు

రాత్రి వేళల్లో భీతిగొలుపుతున్న బాహ్యవలయం!
రింగురోడ్డు కూడళ్లు.. లారీలకు అక్రమ అడ్డాలు
సర్వీసు రహదారుల్లో చిమ్మచీకట్ల మధ్యే ప్రయాణాలు
ఏమైనా జరిగేందుకు ఆస్కారం.. కానరాని గస్తీ
జాతీయ రహదారులపై వ్యభిచారం.. మద్యపానం
రాత్రయితే చాలు అసాంఘిక కార్యకలాపాలు
హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై దర్జాగా ఆగడాలు
ఆరాంగఢ్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్లాలంటే సాహసమే
మామూళ్ల మత్తులో క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది
ఈనాడు - హైదరాబాద్‌

ఊరు అపురూపం.. అంతర్జాతీయ నగరం.. ఆధునిక సౌకర్యాలు.. అత్యాధునిక జీవన విధానాలు..
నాలుగడుగులు బయటకు వేసి చూస్తే మాత్రం భయంకరమైన శ్మశాన నిశ్శబ్దం..
ఊళలు పెట్టే నక్కల మాదిరి ఈలలు వేసే పోకిరీలు..
భంగు తాగి కరాళ నృత్యాలు చేసే కర్కశుల్లా మద్యం తాగి ఊగుతూ రెచ్చిపోయే అసాంఘిక శక్తులు..
హైదరాబాద్‌ నగరం దాటి కూతవేటు దూరంలోకి చేరగానే శివారు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులివి.
నగరానికి తలమానికంగా నిలిచే రింగురోడ్డు.. సరైన సూచికలు, వీధి దీపాలు లేక.. ప్రమాదాలకు, నేరాలకు, చీకటి కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు దారి తీసే జాతీయ రహదారులు మద్యం అమ్మకాలు, వ్యభిచార ముఠాల ఆగడాల కారణంగా అభద్రతకు మారుపేరుగా మారాయి.
ఈ రోడ్డులో రాత్రి పూట ప్రయాణిస్తే ఎలా ఉంటుంది?
యువ వైద్యురాలు ‘దిశ’పై కిరాతకంగా అత్యాచారం చేసి పెట్రోలు పోసి తగలబెట్టింది రింగురోడ్డుకు సమీపంలోనే. మరి ఆ తర్వాతైనా పరిస్థితి మారిందా? చీకటి అడ్డాలు తొలిగాయా? గస్తీ పెరిగిందా?

రాత్రిపూట ఒకసారి శివారు ప్రాంతాలను చుట్టి చూసి వచ్చే ప్రయత్నం చేసింది ‘ఈనాడు’ బృందం.. 


భద్రత లేదు.. భరోసా లేదు..
గస్తీ లేని బస్తీ దారులు
మందుబాబుల అడ్డాల్లా శివారు ప్రాంతాలు

నగరం దాటాక జాతీయ రహదారులు, బాహ్యవలయ రహదారిపై రాత్రివేళ ప్రయాణం భయానకంగా మారింది. అసలే నిర్మానుష్య ప్రాంతాలతో నిండి ఉండే పరిసరాలు రాత్రయితే చాలు భీతిగొలుపుతుంటాయి. రింగురోడ్డుపై చాలా వరకు వీధిదీపాలే లేకపోగా.. సర్వీసు రహదారుల్లో అయితే అసలు ఎక్కడా వెలుగే ఉండడంలేదు. రింగురోడ్డుపై రాత్రిపూట మహిళలతో కలిసి ప్రయాణించడం ఓ సాహసకృత్యమనే చెప్పాలి. ఎక్కడైనా మృగాళ్లు గనక పొంచి ఉంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద యువ వైద్యురాలు ‘దిశ’ దారుణ హత్యోదంతమే ఇందుకు నిదర్శనం. 24 గంటలూ వాహనాలు సంచరించే ఆ ప్రాంతంలోనే అంతటి దారుణ పరిస్థితులు నెలకొంటే.. చిమ్మచీకట్లతో నిండి ఉండే రహదారి పరిసరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహకందనంత భయంగా మారింది. ఈ నేపథ్యంలో  బాహ్యవలయ రహదారి పరిసరాల్ని ‘ఈనాడు-ఈటీవీ’ బృందం సోమవారం రాత్రి పరిశీలించింది.

చీకటి వలయం
బాహ్యవలయ రహదారి రాజధాని నగరం చుట్టూ దాదాపు 158 కి.మీ.ల మేరకు విస్తరించి ఉంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు గల మార్గంలో మాత్రమే వీధిదీపాలున్నాయి. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఈ మార్గంలో రాకపోకలు సాగుతాయి కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ఇది 23 కి.మీ. మాత్రమే. మిగిలిన 134.7 కి.మీ. మేర దీపాల్లేవు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు అయితే చిమ్మచీకటే. రహదారి చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లే దారులు మినహా మిగిలిన ప్రాంతమంతా చెట్టూచేమలు ఉండటంతో నిశి వాతావరణం భయం గొల్పుతుంది. ఓ వైపు సర్వీసు రోడ్డు నుంచి మరోవైపు సర్వీసు రోడ్డుకు వెళ్లేందుకు వీలుగా ఉన్న అండర్‌బ్రిడ్జిలైతే రాత్రివేళ చీకటి గుహలను తలపిస్తున్నాయి. ఇలాంటి అండర్‌బ్రిడ్జి వద్దే దిశ మృతదేహాన్ని నిందితులు తగలబెట్టారు. దీనికితోడు సర్వీసురోడ్డుపై ఉన్న కూడళ్ల వద్ద వాహనాల అక్రమ అడ్డాలున్నాయి. ఈ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు ఎక్కువగా సాగుతాయనే ఉద్దేశంతో చాలా దుకాణాలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో మద్యం దుకాణాల నిర్వహణకు మినహాయింపు ఉండటాన్ని ఆసరాగా చేసుకొంటున్నారు. నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతూ మందుబాబుల అడ్డాలుగా మార్చేశారు. తుక్కుగూడ, ఘట్‌కేసర్‌ తదితర కూడళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది.

శంషాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు సుమారు 75 కి.మీ. మేర రింగురోడ్డు, సర్వీసు రోడ్లలో ఎక్కడా గస్తీ వాహనాలే కనిపించలేదు.
ఔటర్‌ రింగురోడ్డు మొత్తం పొడవు 158 కి.మీ.

 

రాత్రి 7.35 గంటలు
హైదరాబాద్‌ - బెంగళూరు

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారి మార్గం. శంషాబాద్‌ టోల్‌ప్లాజా ప్రాంతం. ఇక్కడికి అత్యంత సమీపంలోనే యువ వైద్యురాలు ‘దిశ’పై అఘాయిత్యం జరిగింది. ఇక్కడి నుంచి గొల్లపల్లి క్రాస్‌రోడ్డు మార్గంలోకి ప్రవేశించగానే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ప్లాజాను ఆనుకొనే కొన్ని లారీల్ని అక్రమంగా నిలిపి ఉంచారు. ఇక్కడికి సమీపంలోనే వైన్స్‌తోపాటు కల్లు కాంపౌండ్‌ ఉండటంతో లారీడ్రైవర్లు ఇక్కడ లారీలను ఆపుతున్నారు. అక్కడి నుంచి ముందుకు కదలితే బాహ్యవలయం నుంచి శంషాబాద్‌ పట్టణానికి దారితీసే మార్గాల్లో ఇది ప్రధానమైన మార్గం. ఇక్కడి నుంచి పెద్దగోల్కొండ వరకు గల ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులో ఎక్కడా వీధిదీపాలు లేవు.


రాత్రి 7.50 గంటలు
పెద్దగోల్కొండ టోల్‌బూత్‌

పెద్దగోల్కొండ టోల్‌బూత్‌ ప్రాంతం. ఇక్కడ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పెట్రోలింగ్‌ వాహనం కనిపించింది. ఇక్కడ మాత్రమే వీధిదీపాల వెలుగులున్నాయి. ఈ మార్గంలో పలు అండర్‌బ్రిడ్జిలున్నా అంతా చీకటిమయమే. రాత్రిపూట ఒంటరిగా సర్వీసు రహదారిలో ప్రయాణించడం రిస్కుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.


రాత్రి 8.25 గంటలు
మంకాల్‌ అండర్‌బ్రిడ్జి

మంకాల్‌ అండర్‌బ్రిడ్జి ప్రాంతం. సర్వీసు రహదారి మార్గంలోని అండర్‌బ్రిడ్జిల్లో ఈ ఒక్క చోట మాత్రమే దీపాల వెలుగులున్నాయి. ఈ అండర్‌బ్రిడ్జి మార్గంలో ఎనిమిది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి వీధిదీపాల్ని బిగించారు.


రాత్రి 8.30 గంటలు
తుక్కుగూడ జంక్షన్‌

కూడలి నుంచి 50 మీటర్లలోపే మల్లికార్జున్‌ వైన్స్‌ ప్రాంతం మందుబాబుల కార్లతో కళకళలాడుతూ కనిపించింది. చాలా కార్లను సర్వీస్‌ రోడ్డులోనే నిలిపారు. వైన్స్‌ పక్కనే ఉన్న ఖాళీస్థలంలో లారీలు కనిపించాయి. వైన్స్‌ వద్దే ఆహారపదార్థాల్ని వండి మందుబాబులకు సరఫరా చేస్తున్నారు. చాలామంది బయటే నిలబడి, లారీల్లో కూర్చుని మద్యం తాగుతూ కనిపించారు.


రాత్రి 8.50 గంటలు
రావిర్యాల టోల్‌బూత్‌

ఈ బూత్‌ వెనకనే ఉన్న అండర్‌బ్రిడ్జి కింద చీకటిగా ఉంది. పర్యాటక ప్రాంతం వండర్‌లాకు వచ్చిపోయే వందలాది సందర్శకులు, జంటలు ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. చీకటి కారణంగా అసాంఘిక కార్యకలపాలకు నెలవుగా ఉండేందుకు ఆస్కారముంది.


రాత్రి 8.54 గంటలు

రావిర్యాల టోల్‌బూత్‌ నుంచి బాహ్యవలయ రహదారిపైకి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో ఎక్కడా వీధిదీపాలు కనిపించలేదు. సుమారు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే వాహనాల వెలుతురే ఆధారం. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా ఘోర ప్రమాదాలు ఖాయం.


రాత్రి 9.09 గంటలు
రావిర్యాల - బొంగుళూరు గేటు

 

బాహ్యవలయ రహదారిపై రావిర్యాల - బొంగుళూరు గేటు మార్గంలో కొంత దూరం వెళ్లిన వెంటనే రహదారి మరమ్మతుల కోసం చివరి రెండు రెండు వరుసల్లో (40 కి.మీ.లోపు వేగ పరిమితి) ప్రయాణం ఆపేశారు. అందుకోసం రహదారిపై డ్రమ్ములను అడ్డుపెట్టారు. వాటికి కొంతమేరకు రేడియం స్టిక్కర్లు అంటించారు. అయితే బాహ్యవలయ రహదారిపై అసలే చీకటిగా ఉండటంతో అక్కడ తాత్కాలికంగానైనా దీపాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.


రాత్రి 9.12 గంటలు
పెద్దఅంబర్‌పేటలో

పెద్దఅంబర్‌పేటలో బాహ్యవలయ రహదారిపై నుంచి కిందకు దిగి సర్వీసు రోడ్డుకు చేరుకున్నాం. విజయవాడ వైపు దారితీసే జాతీయ రహదారి మార్గంలో రోడ్డుపక్కనే లారీలు నిలిపి కనిపించాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాహ్యవలయ రహదారికి సమీపంలోనే డివైడర్లు తెరిచి ఉంచడం కీలక కారణంగా కనిపిస్తున్నా నివారణ చర్యలు నామమాత్రం.


రాత్రి 9.27 గంటలు
బాచారం టోల్‌ప్లాజా వద్ద

సర్వీసు రోడ్డులో బాచారం టోల్‌ప్లాజా వద్ద భీతిగొలిపేలా ఉంది. ఇక్కడ సిబ్బంది ఒక్కరే కనిపించారు. పరిసరాల్లో వీధిదీపాలే లేవు.


రాత్రి 9.40 గంటలు
హైదరాబాద్‌-వరంగల్‌

హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలో ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా సమీపంలోని వైన్స్‌ ఎదురుగా సర్వీసు రోడ్డులోనే మద్యం కొనుగోలుదారులు వాహనాల్ని నిలిపి ఉంచారు. ఇక్కడ తరచూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని స్థానికులు తెలిపారు.


వ్యభిచారం.. మద్యపానం

అది హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి.. చీకటి పడితే చాలు.. ఆరాంగఢ్‌ చౌరస్తా నుంచి శంషాబాద్‌ వైపు మార్గమధ్యలో ఎక్కడైనా వాహనం ఆపాలంటే సాధారణ వాహనదారులు భయపడుతుంటారు. ఇక్కడ వ్యభిచారం.. మద్యపానం బహిరంగంగా సాగుతుండడమే కారణం. ప్రధాన రహదారి పక్కనే లారీలు, ఇతర సరకు వాహనాలను ఆపి మద్యం తాగుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. స్థానిక పోలీసులకు ఈ అక్రమ దందా విషయం తెలిసినా పట్టించుకోవడంలేదనేది స్థానికుల ఆరోపణ.


గుడి వెనుక నా సామీ..
ఆరాంగఢ్‌ చౌరస్తా నుంచి సుమారు కి.మీ. దూరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఓ గుడి ప్రహారీ వెనుకవైపు ఉన్న ఖాళీ ప్రదేశమే వ్యభిచారానికి అడ్డా. సాయంత్రం 6 దాటిన తర్వాత ఓ నలుగైరుదుగురు బ్రోకర్లు ప్రధాన రహదారిపై నిల్చుంటారు. లారీ డ్రైవర్లు, ఇతర వాహనదారుల వారి దగ్గరికెళ్లి బేరం మాట్లాడుకుంటారు. బేరం కుదిరితే.. గోడ వెనుక కొద్దిగా లోపలకు నిరీక్షిస్తున్న అమ్మాయిల దగ్గరికి పంపిస్తారు. గతంలో బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ పక్కన ఈ అడ్డా ఉండేది. వారాంతపు సెలవుల్లో ఈ ప్రాంతం పూర్తి రద్దీగా ఉంటుంది. ప్రత్యేక విందులు జరుగుతుంటాయన్నారు. శంషాబాద్‌కు వెళ్లేలోపు ఇలాంటి అడ్డాలు మరో ఒకటి, రెండుంటాయి. శంషాబాద్‌ దాటిన తర్వాత 3 కి.మీ. నుంచి 4 కి.మీ. దూరంలో ఉండే గండిగూడ ఆటోనగర్‌ ఈ దందాకు మరో చిరునామా.

మందు కొట్టు.. పత్తాలు పట్టు
ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సరకులను మోసుకొచ్చే భారీ వాహనాలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల్లోపే నగరంలోకి రావాల్సి ఉంటుంది. అంతకంటే ముందు లేదా తర్వాత వచ్చిన వాహనాలను డ్రైవర్లు శివారుల్లోని తొండుపల్లి పరిసరాల్లో అపేస్తారు. జాతీయ రహదారి పక్కనే అక్రమంగా పార్కింగ్‌ చేసుకుంటారు. ఇక పగలంతా లారీల్లోనే మద్యం తాగుతూ పేకాట ఆడుతుంటారు. ఇంకొందరు మధ్యవర్తుల ద్వారా అమ్మాయిలను బుక్‌ చేసుకుంటుంటారు.


మూడు కల్లు దుకాణాలు.. ఓ వైన్స్‌.. లెక్కేలేనన్ని బెల్టు షాపులు

ఈ జాతీయ రహదారి పక్కనే ఘాన్సిమియాగూడ, గండిగూడ, తొండుపల్లి జంక్షన్‌ దగ్గర కల్లు కంపౌండ్లున్నాయి. లారీ డ్రైవర్లు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి ఇవి ఆసరాగా మారుతున్నాయి. సాయంత్రమైతే చాలు.. ఇక్కడంతా రద్దీ నెలకొంటుంది. యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనా స్థలికి 100 మీటర్ల దూరంలోనే కల్లు కంపౌండ్‌ ఉంది. శంషాబాద్‌కు 1.5 కి.మీ. నుంచి 2 కి.మీ. దూరంలో ఉన్న తొండుపల్లిలో జాతీయ రహదారికి సమీపంలోనే ఓ వైన్స్‌ ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఘటనా స్థలికి ఈ వైన్స్‌ 300 మీటర్ల దూరంలో ఉంటుంది. నలుగురు నిందితులు ఇక్కడినుంచే మద్యాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో గొలుసు దుకాణాలకు లెక్క లేదు.


- ఈనాడు ప్రతినిధులు మల్యాల సత్యం, పి.భానుచందర్‌ రెడ్డి

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.