close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సైన్యాన్ని దించుతా

అమెరికాలో గవర్నర్లను హెచ్చరించిన ట్రంప్‌
హింసాత్మక ఘటనలు దేశీయ ఉగ్రవాదమేనన్న అధ్యక్షుడు

విధ్వంసాలకు పాల్పడుతున్నవారి వెంట పడాలి. వారిని అరెస్టు చేయాలి. పదేళ్లపాటు జైల్లో వేయాలి. అప్పుడు ఇలాంటివి పునరావృతం కావు. వాషింగ్టన్‌ డీసీలో మేం అదే చేస్తున్నాం. ప్రజలు ఇంతవరకు ఎన్నడూ చూడనిది చేసి చూపిస్తున్నాం. చాలామంది గవర్నర్లు మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. అవసరమైనప్పుడూ ఎక్కువ సంఖ్యలో నేషనల్‌ గార్డుల్ని వారు రంగంలో దించడం లేదు.

- డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

 

వాషింగ్టన్‌: హింసాత్మక నిరసనలను తగిన రీతిలో అణచివేయని పక్షంలో సైన్యాన్ని రంగంలో దించుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. రాష్ట్రాల గవర్నర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గట్టి స్వరంతో అల్టిమేటం జారీ చేశారు. అల్లర్లకు దిగడం, దుకాణాలను కొల్లగొట్టడం, భౌతిక దాడులు, ఇతరత్రా విధ్వంసకర చర్యల్ని అడ్డుకునేందుకు లక్షల్లో సైనిక బలగాలను భారీ ఆయుధాలతో పంపిస్తానని ప్రకటించారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఆయన హడావుడిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. మే 25న జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ పౌరుడు పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన అనంతరం అమెరికా అంతటా భగ్గుమంటున్న ఆందోళనలు శ్వేతసౌధం వరకు పాకిన నేపథ్యంలో ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. చాలామంది గవర్నర్లు దుర్బలంగా ఉన్నారని మండిపడ్డారు.
ఇది దైవం పట్ల నేరం
‘‘పౌరులను, వారి హక్కుల్ని రక్షించడంలో చాలా వరకు స్థానిక ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే తగిన సంఖ్యలో నేషనల్‌ గార్డ్‌ బలగాలను రంగంలో దించి, క్షేత్రస్థాయిలో రక్షణ బలగాలదే పైచేయి అయ్యేలా చూడాలని గవర్నర్లు, మేయర్లను ఆదేశించాను. హింస పూర్తిగా తగ్గిపోయేవరకు బలగాలను భారీగా మోహరించాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో తగిన చర్యలు చేపట్టడానికి ఏదైనా నగరం, లేదా రాష్ట్రం నిరాకరిస్తే సైన్యాన్ని పంపించి, సత్వరం ఆ సమస్యను పరిష్కరిస్తా. అరాచకవాదులు, హింసాత్మక మూకలు, దోపిడీదారులు, నేరగాళ్లదే ఈ మధ్య కాలంలో ఇష్టారాజ్యం అవుతోంది. శాంతియుత నిరసనలు వ్యక్తం చేయడానికి ఇవి మార్గాలు కావు. ఇవన్నీ దేశీయ ఉగ్రవాద ఘటనలు. అమాయకుల ప్రాణాలను బలిగొనడం, వారి రక్తం చిందడం.. మానవాళి పట్ల నేరం. దైవంపైనా అది నేరం’’ అని ట్రంప్‌ ఆవేశంగా పేర్కొన్నారు.
అలా చంపడం అమానుషమే
ఫ్లాయిడ్‌ను అమెరికా పోలీసులు పొట్టనపెట్టుకున్న తీరును ట్రంప్‌ ఆక్షేపించారు. ఈ ఘటనపై ప్రజల స్పందన సహేతుకమేనన్నారు. ‘‘దేశ చట్టాలను పరిరక్షిస్తానని అధ్యక్షునిగా నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు అదే నేను చేయబోతున్నాను. జార్జి ఫ్లాయిడ్‌ కుటుంబానికి న్యాయం చేయడానికి మా యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంది. ఆయన మరణం వృథాగా పోకూడదు’’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు. హింసను నిలువరించి, అమెరికాలో భద్రతను పునరుద్ధరించడానికి చర్యలన్నీ చేపడతామని చెప్పారు. లింకన్‌ మెమోరియల్‌ వంటి జాతీయ స్మారకాలను, చారిత్రకమైన చర్చిలను సైతం ధ్వంసం చేశారని గుర్తుచేశారు. శాంతికాముక, పేద వర్గాలే ఎక్కువగా నష్టపోయినట్లు చెప్పారు.
ముప్పు కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోం
‘‘దేశాధ్యక్షునిగా ప్రజల భద్రత కోసం నేను పోరాడుతా. శాంతి భద్రతల పరిరక్షణ నా విధి. శాంతియుత నిరసనలను నేను ఇష్టపడతాను. మనం దేనినైనా నిర్మించాలి గానీ నాశనం చేయకూడదు. సహకరించాలే గానీ ధిక్కరించకూడదు. భద్రతను కోరుకుంటాం గానీ అరాచకత్వాన్ని కాదు. విద్వేషాన్ని కోరుకోం... గాయాలు మానాలని కోరుకుంటాం. ఈ లక్ష్యంలో 100% విజయం సాధిస్తాం. మన దేశం ఎప్పుడూ నెగ్గుతూనే ఉంటుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని, అమాయకుల ప్రాణాలకు-ఆస్తులకు ముప్పు కలిగించాలని చూసేవారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనల్లో పాక్షికంగా కాలిపోయిన సెయింట్‌ జాన్‌ చర్చిని ట్రంప్‌ సందర్శించారు. బైబిల్‌ చేతబట్టి చర్చి ముందు నిల్చొన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత శ్వేతసౌధం నుంచి నడుచుకుంటూ ఆయన ఈ చర్చి వద్దకు వచ్చారు. అక్కడకు సమీపంలోని పార్కులోనే రెండ్రోజులుగా తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనల నేపథ్యంలో 9/11 దాడుల తర్వాత అంతటి అప్రమత్తతతో బలగాలు శ్వేతసౌధానికి భద్రత కల్పించాయి. అమెరికా మార్షల్స్‌ సర్వీస్‌ సభ్యులనూ రంగంలో దించారు. తన భద్రత గురించి కలవరంగా ఉందని సలహాదారుల వద్ద ట్రంప్‌ అన్నారు. సీక్రెట్‌ సర్వీస్‌ బలగాల పనితీరును మాత్రం ఆయన మెచ్చుకున్నారు. 


ఈ బాధను అందరూ గుర్తించాలి

అమెరికా పౌరుల బాధ, దానికి కారణమైన జాతి వివక్షను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. న్యాయం కోసం పోరాడుతున్నవారికి మద్దతుగా నిలవాలి.

- ఇంద్రానూయి, పెప్సీకో మాజీ సీఈవో

విద్వేషానికి, జాతి వివక్షకు తావులేదు. జరిగిన ఘటనపై సహానుభూతి చూపడం, బాధను పంచుకోవడం ఆరంభం మాత్రమే.  నల్లజాతీయులకు సంఘీభావం ప్రకటిస్తున్నా.

- సత్య నాదెళ్ల, సీఈవో, మైక్రోసాఫ్ట్‌

ట్రంప్‌ నోర్మూసుకోవడం మంచిది
అమెరికాలోని పోలీసు చీఫ్‌లందరి తరఫునా  ట్రంప్‌నకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. నిర్మాణాత్మకంగా ఏమైనా ఆయన చెప్పవచ్చు. లేదంటే నోర్మూసుకోవడం మంచిది.

-ఆర్ట్‌ ఏస్‌వెడో, హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌

 


భారతీయ అమెరికన్‌ వైద్యుల ఆవేదన

ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపేసిన తీరుపై భారతీయ అమెరికన్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న జాతిపరమైన వివక్ష రోజురోజుకీ ఎక్కువవుతోందని ఆందోళన వెలిబుచ్చారు. జాతి వివక్ష, అల్పసంఖ్యాల వర్గాలవారిపై హింసను ఖండిస్తున్నామని ‘భారత సంతతి అమెరికా ఫిజీషియన్ల సంఘం’ (ఏఏపీఐ) అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అందరినీ సమానంగా చూడాలని సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సుధాకర్‌ జొన్నలగడ్డ చెప్పారు.


ఈయూ దిగ్భ్రాంతి

బ్రసెల్స్‌: అమెరికాలో పోలీసు కస్టడీలో వ్యక్తి మరణంపై ఐరోపా సమాఖ్య (ఈయూ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని ఈయూ విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ విలేకరులతో వ్యాఖ్యానించారు.
* ఆస్ట్రేలియా నుంచి ఐరోపా వరకు అనేక దేశాలు అమెరికా పౌరులకు సంఘీభావం ప్రకటించాయి. వివక్ష, పోలీసుల హింసకు వ్యతిరేకంగా నినదించాయి. ఆమ్‌స్టెర్‌డాంలో వేలమంది ప్రజలు కదం తొక్కారు. బార్సెలోనోలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. ఆఫ్రికాలోని పలు దేశాల నేతలు అమెరికా ఘటనల్ని ఖండించారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.