వారాంతపు Lockdownను పరిశీలించండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారాంతపు Lockdownను పరిశీలించండి

ప్రైవేటు ఆస్పత్రులకు కళ్లెం వేయండి
అన్నిచోట్లా ఒకే ధరలు ఉండేలా చర్యలు తీసుకోండి
పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో రద్దీ తగ్గాలి
మాస్క్‌ సక్రమంగా ధరించనివారి వాహనాల జప్తుపై ఆలోచించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్సలకు రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయని... అన్ని చోట్లా ఒకే ధరలుండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీటీస్కాన్‌, రెమ్‌డెసివిర్‌ మందుకు భారీగా వసూలు చేస్తున్నారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నందున వారాంతపు లాక్‌డౌన్‌పై పరిశీలించాలని సూచించింది. కరోనాకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్‌ ఇవ్వడానికి తమిళనాడు నిరాకరిస్తోందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ కోర్టు దృష్టికి తేగా...చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆక్సిజన్‌ వినియోగంపై ఆడిట్‌ జరగాలని చెప్పింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రోజూ 20 వేలు అవసరమైతే 430 మాత్రమే కేంద్రం కేటాయిస్తోందని డైరెక్టర్‌ చెప్పారు. తెలంగాణలో 86,000 వయల్స్‌ ఉత్పత్తి అవుతున్నా ఇక్కడ అవసరాలు తీరడంలేదన్నారు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వైద్యసేవలకు వచ్చేవారు 35 శాతం మంది ఉన్నారని, దీంతో ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అలా అంటే తెలంగాణవారు ముంబయి వంటి నగరాలకు వెళ్తుంటారుగా అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి స్పందిస్తూ 11 లక్షల రెమ్‌డెసివిర్‌లు ఉత్పత్తి అయితే ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు తెలంగాణకు 25 వేలు అందించామని, తరువాత 16 లక్షలు ఉత్పత్తి అయితే 35 వేలు కేటాయించామని చెప్పారు. అదనంగా కావాలని విజ్ఞప్తి రాలేదని చెప్పారు.
నిబంధనల అమలుకు ప్రత్యేక బృందాలు: డీజీపీ
కొవిడ్‌ నిబంధనల అమలుకు ప్రత్యేకంగా 20 బృందాలు, జిల్లాల్లో మరో 10 ఏర్పాటు చేసినట్లు కోర్టుకు హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 300 మందిని ఉంచామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద సాయం కోసం పలువురు ఇబ్బందులు పడుతున్నారన్న ధర్మాసనం వాఖ్యం పై స్పందిస్తూ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు. మాస్క్‌ సరిగా ధరించని వారి నుంచి రూ.1000 చొప్పున జరిమానా వసూలు చేస్తున్నామని, బ్లాక్‌లో మందుల విక్రయాలపై 39 కేసులు నమోదు చేశామని, ఇవి ఆస్పత్రి సిబ్బందే చేస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకునేవారిని ఉపేక్షించవద్దని ధర్మాసనం పేర్కొంది. మాస్క్‌ను సక్రమంగా ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలనగా.. ఆ అధికారం తమకు లేదని డీజీపీ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ సిటీ పోలీసు చట్టంతో పాటు విపత్తుల నిర్వహణ చట్టం కింద వాహనాలను కొంత కాలం జప్తు చేసేలా జీవో జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఏపీ నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్నందున వైరస్‌ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై నివేదికలు సమర్పించాలంటూ డీజీపీ, జైళ్ల శాఖ డీజీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లను ఆదేశిస్తూ విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.

రెండ్రోజుల్లో సలహా కమిటీని నియమించాలి
నిపుణుల కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైందని నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం దాని తీర్మానాలు చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు అంది. అలాంటపుడు నిపుణుల కమిటీ ఉన్నట్లు, సమావేశం జరిగినట్లు గుర్తించలేమంది. విపత్తుల నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 17 కింద సలహా కమిటీని రెండ్రోజుల్లో నియమించాలి. తరువాత రెండ్రోజుల్లో ఇది సమావేశమై తీర్మానాలు సమర్పించాలంది.
వివాహాలు హాల్‌లో నిర్వహిస్తే.. దాని సామర్థ్యంలో 50 శాతం.. మైదానాల్లో అయితే 200 మందికి మించకుండా అనుమతులివ్వాలి. అంత్యక్రియలకు హాజరయ్యే వారిని 50 మందికి పరిమితం చేస్తూ 24 గంటల్లో జీవో తేవాలి.
కొవిడ్‌ పరీక్షలు లక్షకు తగ్గకుండా చేయడానికి బదులు తగ్గిస్తున్నారు. ప్రజలు రావడంలేదని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ చెప్పడాన్ని అంగీకరించబోం.
పడకల ఖాళీల వివరాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో వెల్లడించాలి.
హితం యాప్‌ ద్వారా డాక్టర్ల సహకారంతో అవసరమైనవారికి సలహాలు, కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్‌ఎంసీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. వారంలోగా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలి.
కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ చాలని భావిస్తోంది. ఈనెల 8వ తేదీతో గడువు ముగిసేలోగా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోవాలి. సమయాన్ని పెంచడంతో పాటు వారాంతపు లాక్‌డౌన్‌ను పరిశీలించాలి.
వృద్ధాశ్రమాలు, వికలాంగుల వసతి గృహాలకు వ్యాక్సినేషన్‌కు రవాణా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సీనియర్‌ సీటిజన్‌ల సంగతి ఏమిటి? వారితోపాటు అనాథలు, నైట్‌షెల్టర్లలో ఉన్నవారు, జైళ్లలో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్ల వివరాలివ్వాలి. 3.5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరం ఉండగా కేంద్రం కేవలం 3.9 లక్షల డోసులు ఇచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటుకు ఎంత కేటాయిస్తున్నారో తెలియదనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాక్సిన్‌ కేటాయింపులు పెంచాలని రాష్ట్రం లేఖ రాసిందని, దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రైవేటుఆధ్వర్యంలోని 230 వ్యాక్సిన్‌ కేంద్రాలకు ఎన్ని డోసులు వెళ్లాయో చెప్పాలంది.
విద్యుత్తు శ్మశానవాటికలు ఎన్ని పనిచేస్తున్నాయి. ఎన్ని మృత దేహాలను కాలుస్తున్నారన్న వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని