Delta Plus: 11 రాష్ట్రాలు.. 48 కేసులు!
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 20:00 IST

Delta Plus: 11 రాష్ట్రాలు.. 48 కేసులు!

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త రకం వైరస్‌ 11 రాష్ట్రాలకు వ్యాపించినట్టు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఇది వెలుగు చూడగా.. మన దేశంలోని 18 జిల్లాల్లో ఈ రకం కేసులు ప్రస్తుతం 48 ఉన్నాయని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ తెలిపారు. ఆల్ఫా వేరియంట్‌ (బ్రిటన్‌ రకం) కన్నా ఈ డెల్టా రకం వైరస్‌ ఎంతో బలమైనదని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో అత్యధికంగా 20 డెల్టా ప్లస్‌ కేసులు ఉండగా.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌ 7, కేరళ 3, పంజాబ్‌ 2, గుజరాత్‌ 2, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. దేశంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. ఇంకా 75 జిల్లాల్లో 10శాతం కన్నా ఎక్కువ వైరస్‌ ప్రభావం ఉండగా.. 92 జిల్లాల్లో 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు వివరించారు. 

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు మన దేశంలోని బీటా వేరియంట్‌తో పాటు ఆల్ఫా, బీటా, గామా రకం వైరస్‌లపైనా పని చేస్తున్నాయన్నారు. గర్భిణులు కూడా వ్యాక్సిన్లు వేయించుకోవచ్చని బలరాం భార్గవ సూచించారు. ఇప్పటివరకు మన దేశంలో 45వేల శాంపిల్స్‌ను సీక్వెన్సింగ్‌ చేయగా ప్రస్తుతం 48 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు బయటపడినట్టు వివరించారు. అయితే, గత నెలలో మధ్యప్రదేశ్‌లో ఒకరు డెల్టా ప్లస్‌ లక్షణాలతో మృతిచెందగా.. తాజాగా మహారాష్ట్రలో కూడా ఒకరు మరణించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ‘డెల్టా ప్లస్‌’ రకాన్ని ఆందోళనకర రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారమే వెల్లడించింది. దీనిలో సంక్రమణ పెరగడం, ఊపరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచుకోవడం, మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జీనోమిక్స్‌ తెలిపింది. భారత్‌లో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వయిజరీలు జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని