భారత్‌లో 7వేలు దాటిన కరోనా మరణాలు!

తాజా వార్తలు

Published : 08/06/2020 10:06 IST

భారత్‌లో 7వేలు దాటిన కరోనా మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ నానాటికీ తీవ్రమవుతోంది. దేశంలో రోజురోజుకు రికార్డుస్థాయిలో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన ఐదు రోజులుగా నిత్యం 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 9983 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. భారత్‌లో 24గంటల్లో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,56,611కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24గంటల్లో 206మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7135కి చేరింది. భారత్‌లో కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 1,24,094 మంది కోలుకోగా మరో 1,25,381 మంది చికిత్స పొందుతున్నారు.

కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే తొలి నాలుగు స్థానంలో ఉండగా భారత్‌ 5 స్థానంలో కొనసాగుతోంది. దాదాపు 2లక్షల 87వేల కేసులతో బ్రిటన్‌ నాలుగో స్థానంలో ఉండగా.. 2లక్షల 41వేల కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానంలో ఉన్నాయి. కరోనా మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో 12స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడా 7700 మరణాలతో 11స్థానంలో ఉండగా.. 6013 మరణాలతో నెదర్లాండ్‌ 13స్థానంలో కొనసాగుతోంది.

చైనాను దాటిన మహారాష్ట్ర..

కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్ర తాజా కేసులతో చైనాలో నమోదైన కేసుల సంఖ్యను దాటేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 85,975 పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో ఇప్పటివరకు 3060 మంది మృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటివరకు 84వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. అక్కడ మరణాల సంఖ్య కూడా 4638 వద్దే ఆగిపోవడం గమనార్హం. ఇక మహారాష్ట్ర అనంతరం తమిళనాడులో వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 15వందల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడిన వారి సంఖ్య 31,667కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 269మంది చనిపోయారు. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న దిల్లీలోనూ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ వైరస్‌ సోకి 761మంది ప్రాణాలు కోల్పోయారు.  కరోనా మరణాల్లో దేశంలో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. కేసుల సంఖ్య 20వేలు దాటగా వీరిలో ఇప్పటి వరకు 1249మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 412 మంది మృత్యువాతపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో 396, ఉత్తర్‌ప్రదేశ్‌లో 275మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని