లాక్‌డౌన్‌లో సైకిల్‌పై కూరలు అమ్ముతుంటే..

తాజా వార్తలు

Published : 12/05/2020 21:12 IST

లాక్‌డౌన్‌లో సైకిల్‌పై కూరలు అమ్ముతుంటే..

గువహటి: కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఎంతోమంది జీవితాలపై ప్రభావం చూపింది. చిన్న చిన్న వ్యాపారులు, వలస కూలీలకు రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ జ్యువెలరీ షాపు యజమాని తన దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా అస్సాంలో ఓ బాలిక  సైకిల్‌పై కూరగాయలు అమ్ముతుంటే స్పందించిన పోలీసులు ఆమెకు ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

జన్మోని గొగొయ్‌ అనే బాలిక దిబ్రూగఢ్‌‌ జిల్లా బోగిబిల్‌  ప్రభుత్వ బాలిక పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా జన్మోని కుటుంబం ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ఆమె తండ్రి గత ఎనిమిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యాడు.  ఈ నేపథ్యంలో కూరగాయలు అమ్మి తన కుటుంబానికి అండగా నిలవాలని జన్మోని భావించింది. దీంతో సైకిల్‌పై కూరలు పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మడం ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వైరల్‌ అయింది. కుటుంబం కోసం బాలిక పడుతున్న కష్టాన్ని చూసి అస్సాం పోలీసులు స్పందించారు. ఆమెకు ఓ ద్విచక్రవాహనాన్ని బహుమతిగా ఇచ్చారు.

బాలిక పడుతున్న కష్టాన్ని గమనించిన  జిల్లా డీఎస్పీ పల్లవి మజుందార్‌, జన్మోని గొగొయ్‌ నివాసానికి వెళ్లి ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, కూరగాయలు విక్రయించేందుకు ఆమెకు ఒక మోపెడ్‌ను బహుమతిగా అందించారు.  పోలీసులు ఆ ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని