Hardik Pandya: ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య

ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్‌.. సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. 

Updated : 07 May 2024 12:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ప్లేఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలున్నాయి. ఆ జట్టు సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరుకుంది. సూర్యకుమార్‌ యాదవ్ (102*) శతకం బాది ముంబయిని గెలిపించాడు. సన్‌రైజర్స్‌పై మూడు వికెట్లు పడగొట్టిన హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు. ప్రజెంటేషన్ వేడుకలో ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాల గురించి హార్దిక్‌ను భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించాడు. ముంబయి ప్లేఆఫ్స్‌ చేరడానికి ఎలాంటి గణాంకాలు అవసరమో (సమీకరణాలు) తనకు తెలియదన్నాడు.  

‘‘మేం ప్లేఆఫ్స్‌ చేరడానికి ఎలాంటి సమీకరణాలు అవసరమో నాకు తెలీదు. కానీ, మిగిలిన మ్యాచ్‌ల్లో మంచి క్రికెట్ ఆడటంపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు ఆడిన తీరు అద్భుతం. మేం కనీసం 10-15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. నా బౌలింగ్ విషయానికొస్తే.. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించాలని భావించా. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేశా. అది ఈ రోజు వర్కౌట్‌ అయింది. సూర్యకుమార్ ఆట నమ్మశక్యంగా లేదు. అతడు బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు.  సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. అత్యుత్తమ బ్యాటర్లలో స్కై ఒకడు. సూర్యకుమార్ మా జట్టులో ఉండటం అదృష్టం’’ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు. 

టీ20ల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం: కమిన్స్‌ 

‘‘మేం కొన్ని పరుగులు తక్కువ చేశాం. వాంఖడేలో వీలైనన్ని ఎక్కువ రన్స్‌ చేయాలి. అప్పుడే మనం మ్యాచ్‌లో ఉన్నామనే భావన కలుగుతుంది. పిచ్‌ కొంచెం బౌలింగ్‌కు అనుకూలించడంతో మేం రేసులో నిలిచాం.  సన్వీర్ సింగ్ సాయంతో 170 పరుగులు చేశాం. వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలర్‌ను ఆడించాలనుకున్నాం. టీ20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. మాకు హోం గ్రౌండ్‌లో ఆడినట్లు అనిపించింది. తదుపరి మ్యాచ్‌ల కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతాం’’ అని కమిన్స్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని