pak: గిల్లి మరీ తిట్టించుకున్న పాక్‌..! 
close

తాజా వార్తలు

Published : 22/07/2021 11:06 IST

pak: గిల్లి మరీ తిట్టించుకున్న పాక్‌..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ ప్రభుత్వం తాలిబన్‌ ఉగ్ర మూకలకు మద్దతు ఇస్తుండగా.. ఆ దేశ ప్రజలు అఫ్గాన్‌ పౌర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీంతో సహనం నశించిన అఫ్గాన్‌ పౌర ప్రభుత్వ పెద్దలు ఒక్క ఫొటోతో పాక్‌ ట్రోలర్ల పరువు తీశారు. ఆ ఫొటో కూడా భారత్‌కు చెందిన ఒక విజయానికి సంబంధించింది కావడం విశేషం. 

మంగళవారం రోజు ఈద్‌ అల్‌ అదా పర్వదినం సందర్భంగా అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలో సామూహిక ప్రార్థనలు జరిగాయి. దీనిలో అధ్యక్షుడు ఘనీతో పాటు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గొన్నారు. ప్రార్థనలు మొదలు కాగానే తాలిబన్లు అధ్యక్ష భవనానికి సమీపంలోకి ఒక రాకెట్‌ను ప్రయోగించారు. ఆ చప్పుడుకు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత తమాయించుకొని దాడిని లెక్కచేయకుండా ప్రార్థనలు చేసుకొన్నారు. పాకిస్థాన్‌ ట్రోలర్లు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెక్కిరించడం మొదలుపెట్టారు. అప్పుడే ఖతార్లో తాలిబన్లతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన అమ్రుల్లా సలేకు ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. 

1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ ఓడిపోయిన తర్వాత ఢాకాలోని రేస్‌కోర్స్‌లో తీసిన చిత్రాన్ని ఆయన పోస్టు చేశారు. ఈ చిత్రంలో పాక్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ తన సేనలు భారత్‌కు లొంగిపోతున్నట్లు సంతకం చేస్తున్నట్లుంది. పక్కనే భారత్‌కు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్‌జీత్‌ సింగ్‌ అరోరా కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన అమ్రుల్లా..‘‘ మా దేశ చరిత్రలో ఇలాంటి ఫొటో లేదు.. ఇక ముందు కూడా రాదు. నిన్న నేను కొన్ని క్షణాలు ఉలిక్కిపడిన మాట వాస్తవమే. డియర్‌ పాక్‌ ట్విటర్‌ అటాకర్స్‌.. ఈ ఒక్క చిత్రంతో మీలో పుట్టే భయం నుంచి తాలిబన్‌, ఉగ్రవాదం మిమ్మల్ని బయటపడేయలేవు’’ అని పేర్కొన్నారు.  ఇప్పుడాయన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని