close

తాజా వార్తలు

సానపెడుతూ.. సాయపడుతూ..!

కెరియర్‌ గైడెన్స్‌ - స్పోర్ట్స్‌ కోచింగ్‌

అందరూ పనుల్లోనే మునిగిపోకుండా అప్పుడప్పుడూ ఆటల్లాంటివి పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటుంటారు. కానీ ఆటలే ఉద్యోగమైతే ఆనందంతోపాటు ఆదాయమూ ఉంటుంది కదా. ఒక మ్యాచ్‌ జరుగుతుంటే ప్రేక్షకుల్లో జట్ల జయాపజయాలపై ఉత్కంఠ, ఉద్వేగం కనిపిస్తుంటాయి. కానీ అంతమందిలోనూ కొందరు మాత్రం ఆటగాళ్ల బలాబలాలను అంచనా వేస్తుంటారు.
గెలుపోటములకు కారణాలను విశ్లేషిస్తుంటారు. వాళ్లే శిక్షకులు (కోచ్‌లు). ఆటగాళ్లకు సానపెడుతూ.. సమర్థంగా ఆడేందుకు సాయడేది వీళ్లే. క్రీడాకారులను విజయం వైపు నడిపించే బాధ్యతాయుతమైన కోచ్‌లుగా కెరియర్‌ కొనసాగించాలంటే కొన్ని కోర్సులు చేయాలి. వాటిని పూర్తి చేస్తే ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు.

దైనా ఆటను చూస్తున్నప్పుడు చూసేవారికి గెలుపు, ఓటమి మాత్రమే కనిపిస్తాయి. చూసేకొద్దీ ఒకరకమైన ఆత్రుత, ఉద్వేగం చోటు చేసుకుంటాయి. ఫలితం మాత్రం మళ్లీ గెలుపూ, ఓటములే! ఇది సాధారణ వ్యక్తుల తీరు. ఆ ఆటలో నిపుణులైతే దీనిపై కొంత విశ్లేషణ చేస్తారు. ఆటగాళ్ల బలాలు, బలహీనతలను అంచనా వేస్తారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఇంకాస్త లోతుగా పరిశోధన చేసి, తమవారిని గెలుపు దిశగా నడిపించే ప్రయత్నం చేసేవారు కోచ్‌లు. అందుకే ప్రతి ఆటగాడి జీవితంలో వీరి పాత్ర కీలకం. అలాంటి కోచ్‌గా కెరియర్‌ను మలచుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారికి కొన్ని కోర్సులున్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలూ కొన్ని వెలువడ్డాయి.

ఆటగాళ్లు తమ శక్తిని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలన్న అంశాలపై దృష్టిపెట్టేది కోచ్‌లే! తమ క్రీడాకారులను సరిగా సన్నద్ధం చేయడంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. వారిలో దాగివున్న ప్రతిభకు సానపెడతారు. మనదేశంలో ఆటగాళ్లకు ఆదరణ ఎక్కువ. వారిని దేవుళ్లుగా చూసేవాళ్లూ లేకపోలేదు. అందుకే వీళ్లు తమ క్రీడా సామర్థ్యాన్ని కొనసాగించడానికీ, ఆటల్లో మంచి ప్రదర్శనకూ ట్యూటర్లు, కోచ్‌లపై ఆధార పడుతుంటారు.

కోచ్‌లు ఎంచుకున్న విభాగంలో తమ శిష్యులు ఆటపరంగానే కాకుండా ఇంకా ఎన్నోవిధాలుగా అభివృద్ధి చెందేలా చూస్తారు. వారి జీవన విధానం, ఆరోగ్యం, కెరియర్‌, వ్యాపార అంశాలూ వీటిలో భాగంగా ఉంటాయి. కొన్నేళ్లుగా దేశంలో ఆటలపై ఆసక్తి పెరుగుతుండటంతో కోచింగ్‌ కెరియర్‌కూ ఆదరణ పెరుగుతోంది. ఈరోజుల్లో ఆటగాళ్లకూ స్టార్‌, సెలబ్రిటీ హోదా దక్కుతుండటంతో వారిని ముందుకు నడిపించే కోచ్‌లు, ఫిజికల్‌ ట్రెయినర్లకూ ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఇది ప్రధానమైన హోదాగానే కాకుండా మంచి ఆదాయాన్ని సమకూర్చే వనరుగానూ తోడ్పడుతోంది. అయితే ఇవన్నీ సాధ్యం కావాలంటే ఎంచుకున్న విభాగంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి.

కావాల్సిన లక్షణాలివీ!

ఎంచుకున్న ఆట పట్ల ఆసక్తి, అభిమానం ఉండాలి. * మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి. ఇతరుల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలిగించగలగాలి. * సమస్యలను గుర్తించి, అంచనావేసి వాటికి పరిష్కార మార్గాలు చూపించగల నైపుణ్యం ఉండాలి. * పట్టుదల, ఓపిక ఉండాలి. సున్నితమైన, తోడ్పాటు అందించగల మనస్తత్వం ఉండాలి. * శారీరక దృఢత్వం తప్పనిసరి. అలాగే ఆట పట్ల నిబద్ధత ఉండాలి. * ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, బృందాన్ని ఏర్పరచగల నైపుణ్యాలు ఉండాలి. * ఎలాంటి సమయంలోనైనా క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌, పాటియాలా, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం * లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, గ్వాలియర్‌, గువాహటి * నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, ఇంఫాల్‌, మణిపూర్‌ * తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, చెన్నై * స్వర్ణిమ్‌ గుజరాత్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గుజరాత్‌ * లక్ష్మీబాయి నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, తిరువనంతపురం * ఎస్‌జీటీ యూనివర్సిటీ, గుఢ్‌గావ్‌, హరియాణ * బెంగళూరు యూనివర్సిటీ, కర్ణాటక * ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌, న్యూదిల్లీ * పంజాబ్‌ యూనివర్సిటీ, చండీగఢ్‌

కెరియర్‌ అవకాశాలు

నిగూఢంగా ఉన్న ప్రతిభకు సానబెట్టి, చాంపియన్లుగా తీర్చిదిద్దడం వీరి విధి. కోచ్‌ లేకుండా ఆటగాడి అభివృద్ధిని ఊహించలేం. ఆటగాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను అంచనావేస్తూ, వాటి నుంచి బయటపడటానికి తగిన ప్రణాళికలను సూచిస్తారు. వాటిని అందుకోవడంలో సాయపడతారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సొంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక సంసిద్ధతనూ అందిస్తారు.

స్పోర్ట్స్‌ కోచ్‌లకు ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలూ వీరిని ఎంచుకుంటున్నాయి. స్పోర్ట్స్‌ సంస్థలు, క్లబ్‌లు, స్కూళ్లు, కళాశాలల్లో వీరికి ఉద్యోగాలుంటాయి. అనుభవంతోపాటు కీర్తి గడించినవారికి జాతీయ, అంతర్జాతీయ టీంలు, క్లబ్‌లు, ఆటగాళ్ల బృందాలకు శిక్షణనిచ్చే అవకాశాన్ని కల్పిస్తారు.  ఇలాంటి వారు సొంతంగా అకాడమీలను ఏర్పాటు చేసుకోడానికి కార్పొరేట్‌ సంస్థలు, వివిధ రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సాయపడుతున్నాయి.

కెరియర్‌ ప్రారంభంలో అనుభవమున్న శిక్షకుడి దగ్గర వాలంటీర్‌ కోచ్‌, సహాయకుడిగా చేరి, అనుభవాన్ని సాధించొచ్చు. ఆపై కోచ్‌ స్థాయికి ఎదగొచ్చు. మంచి నైపుణ్యాలు ఉన్నవారికి విదేశాల్లోనూ మంచి జీతంతో కూడిన అవకాశాలున్నాయి.

ఎంపికైన సంస్థ, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి వేతనాల్లో మార్పులుంటాయి. సాధారణంగా విద్యాపరమైన అర్హతలున్నవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.20,000 నుంచి రూ.25,000 పైగా ఉంటుంది. అనుభవం సాధించేకొద్దీ వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.

ప్రస్తుతం కొన్నింటిలోకి ప్రవేశాలు

సాధారణంగా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మే నుంచే ప్రారంభమవుతాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు ప్రవేశాలను నిర్వహిస్తున్నాయి.
* భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన లక్ష్మీభాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అందించే స్పోర్ట్స్‌ కోచింగ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ కొన్నింటికి ముగిసింది. మరికొన్నింటికి జులై 7, 12 వరకు ఉన్నాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ‌* గుజరాత్‌కు చెందిన స్వర్ణిమ్‌ గుజరాత్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలోనూ ప్రవేశాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 4లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష జులై 7న నిర్వహించనున్నారు. * పంజాబ్‌ యూనివర్సిటీ అందించే కోర్సులకు జులై 3లోగా దరఖాస్తు చేసుకోవాలి.
(వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న రకరకాల కోర్సుల వివరాలకు www.eenadupratibha.net చూడవచ్చు.)

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.