close

తాజా వార్తలు

మా బిడ్డ ఆచూకీ కనిపెట్టండయ్యా!

 కలెక్టరేట్‌ వద్ద ఆరుష్‌రెడ్డి తల్లిదండ్రుల ఆవేదన

 అధికారుల అనుగ్రహం కోసం పడిగాపులు

  
కలెక్టరేట్‌ వద్ద ఆరుష్‌రెడ్డి తల్లిండ్రులు జ్యోతి, అశోక్‌ రెడ్డి

ఒంగోలు నేరవిభాగం: ఆ కళ్లలో జీవం లేదు.. ముఖాల్లో ఆనందం జాడలేదు.. వాళ్లు కడుపారా తిని ఎన్ని రోజులైందో, కంటినిండా నిద్రపోయి ఎన్ని దినాలైందో.. అన్నం ముద్ద ముట్టుకుంటే, కన్నబిడ్డే గుర్తొస్తాడు.. తన బిడ్డ ఎక్కడున్నాడో, ఏం తిన్నాడోనని ఆ తల్లి ఆవేదన.. ఇక ముద్ద మింగుడు పడేదెలా? కలత చెందిన కనులకు విశ్రాంతి కోసం... కాసేపు కునుకు తీసినా, అమ్మా.. అమ్మా.. అనే పిలుపు విని దిగ్గున లేచి కూర్చునే తల్లి, కన్నబిడ్డ కానరాక... అది కలేనని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించిన రోజులెన్నో.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వారి బిడ్డ అదృశ్యమై... నెల రోజులు దాటిపోయింది. ఇక ఆ తల్లితండ్రులకు నిద్రెలా పడుతుంది! దుఃఖమెలా ఆగుతుంది?

ఆ తల్లిదండ్రులెవరంటే..

వాళ్లు ముండ్లమూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి మేడం ఆరుష్‌రెడ్డి తల్లిదండ్రులు జ్యోతి, అశోక్‌రెడ్ఢి. భుజాన చెరో బ్యాగు, చంకన చిన్న బిడ్డతో గురువారం ఒంగోలు వచ్చి కలెక్టరేట్‌ తలుపు తట్టారా దంపతులు. వారి కుమారుడైన ఆరుష్‌రెడ్డి జూన్‌ 24వ తేదీ సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరంతా గాలించినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో అదే రోజు సాయంత్రం ముండ్లమూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు. ఇప్పటికి 33 రోజులు గడిచిపోయినా ఆరుష్‌ గురించి కనీస ఆనవాళ్లు కూడా లభించలేదు. ఈ దంపతులిద్దరూ పోలీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం. తమ బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. బిడ్డ అదృశ్యమైనప్పటి నుంచీ వారు చెయ్యని పూజలు లేవు, ఎక్కని గుడిమెట్లు లేవు. ఆరుష్‌ రెడ్డి అదృశ్యమైన సమయంలో అతడి తండ్రి అశోక్‌రెడ్డి పశువుల మేత కోసం పొలం వెళ్లారు. ఇంటికి వచ్చిన వెంటనే బిడ్డ కనిపించలేదనే విషయం తెలిసి ఆ తండ్రి గుండెలదిరిపోయాయి. అది మొదలు భార్యాభర్తలిద్దరికీ మనశ్శాంతి కరువైంది.

కుమారుడి కోసం ఆరాటం

ఆరుష్‌ అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజులు హడావిడి చేసి ఊరుకున్నారు. కేసు దర్యాప్తులో వేగం తగ్గిపోయింది. పోలీసుశాఖలో భారీ స్థాయిలో జరిగిన బదిలీలూ దర్యాప్తు మందగించడానికి కారణమయ్యాయి. చిన్నారి అదృశ్యమైన నాలుగు రోజుల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా ఎస్సైల బదిలీలు జరిగాయి. అప్పటి వరకూ ఈ కేసు దర్యాప్తు బృందంలో ఉన్న దర్శి సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు బదిలీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విచారణలో వేగం తగ్గింది. దర్శి సీఐ నియామకం విషయంలో నడిచిన దుమారం అంతా ఇంతా కాదు. ఇప్పటికి ముగ్గురు సీఐలు మారారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు సీఐలూ బాలుడి అదృశ్యం కేసు దర్యాప్తును పర్యవేక్షించిన వారే.. తాజాగా పాత డీఎస్పీ బదిలీ అయ్యారు. నూతన అధికారి బాధ్యతలు తీసుకున్నారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నుంచి డీఎస్పీ దాకా మార్పులు జరగటం, బాధ్యతల స్వీకరణలో మార్పులు, చేర్పులు వెరసి ఆ కేసు దర్యాప్తు దాదాపు అటకెక్కింది. గతంలో ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు పోలీసు యంత్రాంగం ఆగమేఘాల మీద స్పందించేది. కిడ్నాపర్లు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడేంత వ్యవధి ఇవ్వకుండా పోలీసులు అన్ని మార్గాల్లోనూ వేగంగా స్పందించేవారు. జిల్లావ్యాప్తంగా యంత్రాగాన్ని అప్రమత్తం చేసి అష్టదిగ్బంధనం చేసేవారు. వాహనాల తనిఖీలు చేపట్టేవారు. ఆరుష్‌రెడ్డి అపహరణ విషయంలో మాత్రం కేవలం రెడ్డిపాలెంతో పాటు సమీప గ్రామాల్లో గాలింపులు చేపట్టి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఆ అపరిచితులెవరు?

ఆరుష్‌ రెడ్డి ఆదృశ్యం కావటానికి ఒక రోజు ముందు.. జూన్‌ 23వ తేదీన గ్రామంలో ఒక జంట సంచరించినట్లు చెబుతున్నారు. వారు చేతిలో పెళ్లికార్డు పట్టుకుని, సహాయం కావాలంటూ ప్రజల నుంచి డబ్బులు అర్థించారనీ, వారి వద్ద ఖరీదైన సెల్‌ఫోన్లు ఉన్నాయని ఆరుష్‌ తండ్రి చెబుతున్నారు. అదేరోజు ఒక అపరిచిత మహిళ గ్రామంలో సంచరిస్తుండగా స్థానికులు ఆమెను విచారించి బయటకు పంపారని చెప్పారు. ఎవరో ఒక అక్క ఆరుష్‌రెడ్డిని తీసుకెళ్తుంటే తాను చూశానని ఒక బాలిక చెబుతున్నా, పోలీసులు మాత్రం అపరిచితులెవరో కనిపెట్టలేకపోయారని అశోక్‌రెడ్డి వాపోతున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు ఒంగోలు వచ్చి ప్రకాశం భవన్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

జషిత్‌లా తిరిగొస్తే...

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జషిత్‌ అనే బాలుడు మూడు రోజుల క్రితం అపహరణకు గురయ్యాడు. పోలీసులు 17 ప్రత్యేక బృందాలను నియమించి ఆ బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. దీనిపై అన్ని మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో బాలుడిని అపహరించిన వ్యక్తులు గురువారం తెల్లవారుజామున అతడిని సురక్షితంగా వేరొక గ్రామంలో వదిలి వెళ్లారు. అక్కడి పోలీసుల తక్షణ స్పందనతో కిడ్నాపర్లు జంకినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది. మన జిల్లాలోనూ 33 రోజుల కిందట ఒక బాలుడు అదృశ్యమయ్యాడు. కానీ దీనిపై ఇక్కడి పోలీసుల స్పందన నామమాత్రం. ఆ బిడ్డ ఆచూకీ తెలియక తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు. జషిత్‌లా తమ బిడ్డ కూడా తిరిగి రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.