ఆ రైతుల ఖాతాల్లో కౌలు జమచేశాం:బొత్స

తాజా వార్తలు

Updated : 27/08/2020 16:05 IST

ఆ రైతుల ఖాతాల్లో కౌలు జమచేశాం:బొత్స

విజయనగరం: అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే  రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో కొవిడ్‌ ఆసుపత్రుల సహాయార్థం ఆక్సిజన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమంలో గురువారం మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో బొత్స మాట్లాడారు.

అమరావతి రైతుల కౌలు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసినప్పటికీ ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే కౌలు ఇవ్వడం ఆలస్యమైందన్నారు. అమరావతి కౌలు రైతులకు పింఛన్‌ కూడా రూ.ఐదు వేలకు పెంచాలనుకున్నట్లు చెప్పారు. కానీ, కోర్టుకు వెళ్లడంతో సాధ్యపడలేదన్నారు. ఈ కారణంగా కౌలు రూ.2,500 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పేదవారికి లబ్ధి చేకూరుతున్న కార్యక్రమాలకు దయచేసి ఎవరూ అడ్డుపడొద్దని ఈ సందర్భంగా బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఎంతటి వారైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.  

రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో అధికారుల జాప్యం, సరైన సమాధానం చెప్పకపోవడంతో విజయవాడలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బుధవారం రైతులు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని దిగ్భందం చేసి నలువైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం సమీపంలోకి చేరుకునేందుకు రైతులు వచ్చిన వెంటనే వారిని అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ వివిధ రాజకీయ, రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని