close
పేరు మారింది.. రాత?

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టేదంటే ఠక్కున గుర్తొచ్చేది దిల్లీ డేర్‌డెవిల్సే. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత మంది కోచ్‌లను మార్చినా ఆ జట్టు ఆట ఏటా మరింత తీసికట్టుగా మారుతుందే తప్ప మెరుగుపడట్లేదు. ఇక లాభం లేదనుకుని ఈసారి ఏకంగా పేరునే మార్చుకుంది. ‘దిల్లీ క్యాపిటల్స్‌’గా 2019లో రంగంలో దూకబోతోంది. పేరునైతే మార్చుకుంది కానీ.. రాతను మార్చుకోగలదా?


ఐపీఎల్‌ మరో  8  రోజుల్లో
పద పద పన్నెండుకు..

క్రికెట్‌ అభిమానులకిక ప్రతి రోజూ పండగే. ధనాధన్‌ బ్యాటింగ్‌తో.. అబ్బురపరిచే బౌలింగ్‌, ఆహా అనిపించే ఫీల్డింగ్‌ విన్యాసాలతో మైదానాల్లో మంటలు పుట్టించేందుకు, రెండు నెలల పాటు వీక్షకులను ఉర్రూతలూగించేందుకు వస్తోంది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌.. వరుసగా  12వ ఏడాది. ఈ నెల 23 నుంచే సమరం. కోహ్లి, రోహిత్‌, ధోని, పంత్‌ వంటి భారత స్టార్లు.. వార్నర్‌, గేల్‌ వంటి విదేశీ వీరులతో గరిష్ట వినోదం గ్యారంటీ. ఎప్పటిలాగే అన్ని జట్లలోనూ కొన్ని మార్పులు, చేర్పులు. అసలు పోరాటానికి ముందు ట్రోఫీ కోసం పోటీపడే ఆ జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం..    ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా..!

ఈనాడు క్రీడావిభాగం

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించని ఏకైక జట్టు దిల్లీనే. సెహ్వాగ్‌, వార్నర్‌, గంభీర్‌ వంటి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించినా దిల్లీ ఎప్పుడూ గెలిచే జట్టులా కనిపించలేదు. ఆరంభ సీజన్‌ (2008), ఆ తర్వాతి సీజన్లో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా బలమైన జట్లలో ఒకటిగా నిలిచిన దిల్లీ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది. దారుణ ప్రదర్శనలతో ఆకర్షణ కోల్పోయింది. 2010 నుంచి కేవలం ఒకే ఒక్కసారి ప్లేఆఫ్‌ దశకు చేరుకుంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు స్థానాన్ని చూడాలంటే కింది నుంచి చూడాల్సిందే. ఐతే దిల్లీ క్యాపిటల్స్‌గా సరికొత్తగా ముస్తాబైన దిల్లీ ఫ్రాంఛైజీ ఈసారి ఎప్పుడూ లేనంత పట్టుదలను ప్రదర్శిస్తోంది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వం వహిస్తున్న జట్టుకు మాజీ కెప్టెన్‌ గంగూలీని సలహాదారుగా నియమించుకుంది. శ్రేయస్‌తో పాటు పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌ యువ స్టార్లు దిల్లీకి గొప్ప బలం. ఈ సీజన్‌కు కొత్తగా శిఖర్‌ ధావన్‌ను కూడా తీసుకుని బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసుకుంది. అనుభవజ్ఞుడైన ధావన్‌ రాక కుర్ర జట్టు ఉత్సాహాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్‌ కోలిన్‌ ఇంగ్రామ్‌ను భారీ మొత్తానికి కొనుక్కోవడం బ్యాటింగ్‌పై దిల్లీ ప్రత్యేక శ్రద్ధను సూచిస్తోంది. కోలిన్‌ మన్రో రూపంలో మరో హిట్టర్‌ కూడా దిల్లీకి ఉన్నాడు. దిల్లీ బౌలింగ్‌లో కూడా బలంగానే ఉంది. మోరిస్‌, రబాడ, బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మలతో పేస్‌లతో ఈ టోర్నీలోనే అత్యంత పదునైన పేస్‌ దళాల్లో ఒకటి దిల్లీకి ఉంది. అమిత్‌ మిశ్రా, అక్షర్‌, సందీప్‌ లమిచానె (నేపాల్‌) స్పిన్‌ బాధ్యతలు చూసుకుంటారు.

అత్యుత్తమ ప్రదర్శన

ఐపీఎల్‌లో అత్యుత్తమంగా 2009, 2012లో మూడో స్థానం సాధించింది. 2013 నుంచి లీగ్‌ దశ దాటలేదు. నిరుడు అట్టడుగున నిలిచింది. మొత్తంగా నాలుగుసార్లు ఆఖరి స్థానంలో, మరో మూడు సార్లు చివరి మూడు స్థానాల్లో నిలిచింది.

1

పోటీపడుతున్న జట్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ఫైనల్‌ చేరని ఏకైక జట్టు దిల్లీ

అన్నీ బాగున్నా..

దిల్లీ క్యాపిటల్స్‌ కాగితంపై బాగానే కనిపిస్తోంది. విజేతగా నిలవడానికి అవసరమైన వనరులు ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ స్థాయికి తగినట్లుగా, సమష్టిగా ఆడలేకపోవడమే ఆ జట్టు సమస్య. ఈ బలహీనత దిల్లీని మొదటి నుంచీ వెంటాడుతోంది. ఈసారైనా ఈ బలహీనతను అధిగమిస్తుందో లేదో చూడాలి. సరైన స్పిన్నర్లు లేకపోవడం కూడా దిల్లీకి ప్రతికూలాంశమే. మిశ్రా ఐపీఎల్‌లో విశేష అనుభవజ్ఞుడే అయినా గత కొన్ని సీజన్లలో అతడు పెద్దగా రాణించలేదు. అక్షర్‌ పటేల్‌లో నిలకడ లేదు. 18 ఏళ్ల లమిచానె ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగుల్లో ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐపీఎల్‌లోనూ ప్రభావం చూపించగలడా అన్నది చూడాలి. ఈ నెల 24 ముంబయితో మ్యాచ్‌తో దిల్లీ టైటిల్‌ వేట ఆరంభమవుతుంది.

జట్టు

ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కోలిన్‌ ఇంగ్రామ్‌, మన్‌జోత్‌ కల్రా, హనుమ విహారి, పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, అంకుశ్‌ బైన్స్‌, రాహుల్‌ తెవాతియా, కోలిన్‌ మున్రో, అక్షర్‌ పటేల్‌, కీమో పాల్‌, జలజ్‌ సక్సేనా, హర్షల్‌ పటేల్‌, క్రిస్‌ మోరిస్‌, షెర్ఫాన్‌ రూథర్డ్‌ఫర్డ్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేష్‌ ఖాన్‌, నాథూ సింగ్‌, రబాడ, బండారు అయ్యప్ప, సందీప్‌ లచిమానె.
కెప్టెన్‌: శ్రేయస్‌ అయ్యర్‌
కోచ్‌: రికీ పాంటింగ్‌
సహాయ కోచ్‌: మహ్మద్‌ కైఫ్‌
సలహాదారు: సౌరభ్‌ గంగూలీ

ఐపీఎల్‌లో దిల్లీ

మ్యాచ్‌లు: 162
విజయాలు: 67

ప్లేఆఫ్స్‌ 2012
సెమీఫైనల్స్‌ 
2008, 2009

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.