
ప్రధానాంశాలు
హమ్మయ్య.. గెలిచాం!
చివరి వన్డేలో భారత్ విజయం
మెరిసిన హార్దిక్, జడేజా
రాణించిన శార్దూల్, బుమ్రా
2-1తో సిరీస్ ఆసీస్ వశం
కాన్బెరా
ఈ మ్యాచ్ నామమాత్రమే. కానీ అందులో ఓడిపోతే అంతే సంగతులు! ఇంకా టీ20లాడాలి. టెస్టు సిరీస్‌లో తలపడాలి. ఈలోపు ఆడిన తొలి సిరీస్‌లోనే వైట్‌వాష్‌కు గురైతే జట్టుకది గట్టి ఎదురుదెబ్బే! ఇలాంటి స్థితిలో కోహ్లీసేన పట్టుదల ప్రదర్శించింది. తుది జట్టుతో పాటు ఆటనూ మార్చుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో గట్టి పోరాటమూ చేసింది. చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఉపశమనం పొందింది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో బోల్తాకొట్టిన భారత్.. ఆఖరి సమరంలో పైచేయి సాధించింది. హార్దిక్ పాండ్య, జడేజా పోరాడిన వేళ.. కంగారూలను ఓడించి గౌరవంగా వన్డే సిరీస్‌ను ముగించింది. టీ20లు, ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడనున్న కోహ్లీసేనకు ఈ విజయం స్థైర్యాన్ని పెంచేదే.
భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి విజయం! నామమాత్రమే అయినా ఆసక్తికరంగా సాగిన చివరిదైన మూడో వన్డేలో టీమ్ఇండియా 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. హార్దిక్ పాండ్య (92 నాటౌట్; 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్; 50 బంతుల్లో 5×4, 3×6) అద్భుత భాగస్వామ్యంతో మొదట భారత్ 5 వికెట్లకు 302 పరుగులు చేసింది. కోహ్లి (63; 78 బంతుల్లో 5×4) రాణించాడు. బుమ్రా (2/43)తో పాటు శార్దూల్ ఠాకూర్ (3/51), అరంగేట్ర పేసర్ నటరాజన్ (2/70), కుల్దీప్ (1/57), జడేజా (1/62) రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఫించ్ (75; 82 బంతుల్లో 7×4, 3×6), మ్యాక్స్‌వెల్ (59; 38 బంతుల్లో 3×4, 4×6) మరోసారి సత్తా చాటినా ఫలితం లేకపోయింది. హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్మిత్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ శుక్రవారం ఆరంభమవుతుంది.
పోరాడిన మ్యాక్స్‌వెల్: పిచ్ నుంచి బౌలర్లకు కాస్త సహకారం లభిస్తున్నా.. ఆస్ట్రేలియాకు అది మరీ కష్టమైన లక్ష్యమేమీ కాదు. కానీ బుమ్రాతో కలిసి దాడిని ఆరంభించిన నటరాజన్ ఆరో ఓవర్లో లబుషేన్ (7)ను ఔట్ చేసి ఆసీస్‌ను తొలి దెబ్బతీశాడు. 10 ఓవర్లకు స్కోరు 51/1. భీకర ఫామ్‌లో ఉన్న స్మిత్ (7)ను శార్దూల్ 12వ ఓవర్లో ఔట్ చేశాడు. ఆ తర్వాత హెన్రిక్స్ (22)ను సైతం శార్దూల్ వెనక్కి పంపాడు. అప్పటికి స్కోరు 117. కాసేపటికే జడేజా బౌలింగ్‌లో ఫించ్.. ధావన్‌కు చిక్కాడు. మధ్య ఓవర్లలో కుల్దీప్ నియంత్రణతో బౌలింగ్ చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూనే ఉన్నా మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉండడంతో ఆసీస్ రేసులోనే ఉంది.మ్యాక్స్‌వెల్... కేరీ (38) ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. ఆ తర్వాత అగర్ (28) సహకారంతో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ఆసీస్ 44 ఓవర్లలో 264/6తో నిలవడంతో భారత్‌కు కలవరం తప్పలేదు. కానీ బుమ్రా ఓ చక్కని బంతితో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నటరాజన్, శార్దూల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు చేసిన ఆసీస్.. రెండు వికెట్లు చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లో జంపాను ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు బుమ్రా తెరదించాడు.
నిలిపింది వాళ్లే..: 32 ఓవర్లలో 152/5. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పరిస్థితిది. మరో వికెట్ పడుంటే భారత్ పనైపోయేదే. కానీ హార్దిక్, జడేజా జోడీ ఆదుకుంది. ఒత్తిడిలో గొప్పగా పోరాడిన ఈ జంట అత్యంత విలువైన భాగస్వామ్యంతో తమ బౌలర్లకు పోరాడేందుకు అవకాశమిచ్చింది. 250 దాటినా గొప్పే అనుకున్న స్థితిలో నిలిచిన జట్టును ఈ ఆల్‌రౌండర్ల జోడీ మూడొందలు దాటించిన తీరు అమోఘం. పాండ్య, జడేజా స్ట్రైక్‌రొటేట్ చేసుకుంటూ, ఎప్పుడో ఓసారి బౌండరీ బాదడంతో భారత్ 44 ఓవర్లలో 216/5తో నిలిచింది. 270 చేయగలదేమో అనిపించింది. కానీ పాండ్య-జడేజా విరుచుకుపడడంతో 3 ఓవర్లలో 53 పరుగులొచ్చాయి. చివరి అయిదు ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టింది. జడేజా-పాండ్య భాగస్వామ్యానికి ముందు కెప్టెన్ కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ (16) త్వరగానే నిష్క్రమించగా.. కోహ్లి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. శుభ్‌మన్ గిల్ (33; 39 బంతుల్లో 3×4, 1×6)తో రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. ఓ దశలో 114/2తో ఉన్న భారత్.. శ్రేయస్ (19), రాహుల్ (5)లను కొద్ది వ్యవధిలో కోల్పోయింది. తర్వాత కోహ్లి కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది.
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) అగర్ (బి) అబాట్ 16; శుభ్‌మన్ గిల్ ఎల్బీ (బి) అగర్ 33; కోహ్లి (సి) కేరీ (బి) హేజిల్‌వుడ్ 63; శ్రేయస్ (సి) లబుషేన్ (బి) జంపా 19; రాహుల్ ఎల్బీ (బి) అగర్ 5; హార్దిక్ పాండ్య నాటౌట్ 92; జడేజా నాటౌట్ 66; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302; వికెట్ల పతనం: 1-26, 2-82, 3-114, 4-123, 5-152; బౌలింగ్: హేజిల్‌వుడ్ 10-1-66-1; మ్యాక్స్‌వెల్ 5-0-27-0; అబాట్ 10-0-84-1; గ్రీన్ 4-0-27-0; అగర్ 10-0-44-2; జంపా 10-0-45-1; హెన్రిక్స్ 1-0-7-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: లబుషేన్ (బి) నటరాజన్ 7; ఫించ్ (సి) ధావన్ (బి) జడేజా 75; స్మిత్ (సి) రాహుల్ (బి) శార్దూల్ 7; హెన్రిక్స్ (సి) ధావన్ (బి) శార్దూల్ 22; గ్రీన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 21; కేరీ రనౌట్ 38; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 59; అగర్ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 28; అబాట్ (సి) రాహుల్ (బి) శార్దూల్ 4; జంపా ఎల్బీ (బి) బుమ్రా 4; హేజిల్‌వుడ్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్) 289; వికెట్ల పతనం: 1-25, 2-56, 3-117, 4-123, 5-158, 6-210, 7-268, 8-278, 9-278; బౌలింగ్: బుమ్రా 9.3-0-43-2; నటరాజన్ 10-1-70-2; శార్దూల్ ఠాకూర్ 10-1-51-3; కుల్దీప్ యాదవ్ 10-0-57-1; జడేజా 10-0-62-1
ప్రధానాంశాలు
సినిమా
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
- పంజాబ్, హరియాణాల్లో హై అలర్ట్
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- అందుకు పశ్చాత్తాప పడుతున్నా
- అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
- తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
- మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!
- ప్లాన్లేమీ లేవ్..బయటికొచ్చి బాదడమే: శార్దూల్
- దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె
ఎక్కువ మంది చదివినవి (Most Read)
