యంత్రాలున్నా... ఉదాసీనతే

ప్రధానాంశాలు

యంత్రాలున్నా... ఉదాసీనతే

కార్మికులతో మురుగు కాలువల శుభ్రత పనులు
అధికారికంగా నిషేధం.. అనధికారికంగా యథాతథం

ఈనాడు, హైదరాబాద్‌: మిర్యాలగూడలో నాలుగు నెలల క్రితం మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌ సాహెబ్‌నగర్‌ వద్ద మురుగు కాలువలో పూడిక తీయడానికి వెళ్లిన కార్మికుల్లో ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. కార్మికులతో మురుగును శుభ్రం చేయించే విధానాన్ని ఎనిమిదేళ్ల క్రితం రద్దు చేశారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఖర్చు తగ్గుతుందని గుత్తేదారులు కార్మికులతోనే పనులు చేయిస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినప్పుడు ప్రమాణాలను నిర్దేశించకపోవడం, దుర్ఘటనలు జరిగిన తర్వాత సరైన చర్యలు లేకపోవడం వంటి ఉదాసీనతల కారణంగా సమస్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థను పర్యవేక్షిస్తున్న జలమండలి కొన్ని నెలల కిందట కాలువల శుద్ధి కోసం 70 జెట్టింగ్‌ యంత్రాలను సమకూర్చుకుంది. అయినా శివారు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లపై ఆధారపడుతుండటతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌ చుట్టుపక్కలతో పాటు రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంస్థలు, ఫార్మా కంపెనీలున్న ప్రాంతాల్లో భూగర్భ కాలువలను శుద్ధి చేయడానికి అనధికారికంగా కార్మికులనే ఉపయోగిస్తున్నారు. వారితో ప్రాణాంతకమైన పనులు చేయిస్తున్నారు. మాన్యువల్‌ స్కావెంజర్‌ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం 2013లో చట్టం తీసుకువచ్చింది. దీన్ని ఉల్లంఘిస్తే, బాధ్యులకు జరిమానా, జైలుశిక్షకు చట్టం అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. నిజామాబాద్‌, కరీంనగర్‌ నగరాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది. మిర్యాలగూడ పట్టణంలో ఇంకా పూర్తి కావాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని