ఇంగ్లిష్‌ నేర్చుకోండి.. ఎంతో సులభంగా!
close

Updated : 27/11/2020 12:55 IST

ఇంగ్లిష్‌ నేర్చుకోండి.. ఎంతో సులభంగా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పై అధికారులకు నివేదికలు పంపించాలన్నా.. ప్రజెంటేషన్లు ఇవ్వాలన్నా.. బహుళజాతి సంస్థల్లో ఇంగ్లిష్‌ తప్పనిసరి! సాధారణంగా గ్రామీణ, ఆంగ్లంపై పట్టు లేని వారు ఇప్పటికీ స్పష్టంగా మాట్లాడేందుకు జంకుతుంటారు. ఇప్పుడా సమస్యను అధిగమించేందుకు ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ఉచితంగా, మరికొన్ని స్వల్పంగా రుసుములు వసూలు చేస్తూ దన్నుగా నిలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
గ్రామర్లీ..


ఉపయోగించడానికి చాలా సులువుగా ఉండటంతో ఎక్కువమంది యూజర్లు దీనినే వాడుతున్నారు. ఇందులో మనం చెప్పాలనుకున్న విషయం మొత్తం టైప్‌ చేయాలి. తర్వాత అందులో వ్యాకరణ పరంగా తప్పులుంటే దాని కింద నీలిరంగు గీత వస్తుంది. అక్షర దోషాలుంటే ఎరుపురంగు గీత కనిపిస్తుంది. అనవసర పదాలున్నా మనకు ఈ యాప్‌ తెలియజేస్తుంది. అంతే కాకుండా మనం రాస్తున్న విషయాన్ని బట్టి అది ఏ విధంగా ప్రజెంట్‌ చేస్తే బావుంటుందో కూడా సూచిస్తుంది. దీనిలో ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే దీని మాక్‌ వెర్షన్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాడ్‌-ఇన్‌తో రావట్లేదు. మాక్‌ వినియోగదారులు రాసిన పదాలను మొత్తం కట్‌ చేసి పేస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం రాసిన మొత్తానికి ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇస్తుందీ యాప్‌.

ప్రో రైటింగ్‌ ఎయిడ్‌..


ఇది కూడా గ్రామర్లీ లాగే పనిచేస్తుంది. బేసిక్‌ లెవల్‌ వరకు ఉచితంగానూ లభిస్తుంది. స్థాయి‌ పెంచుకోవాలనుకుంటే మనం కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది. దీనిలో కేవలం అక్షర దోషాలు, వ్యాకరణ తప్పుల్ని చూపించడమే కాక పునరుత్తి పదాలు, తప్పుడు అన్వయాలు, అస్పష్టంగా ఉన్న వాక్యాలు, వాక్య నిర్మాణ లోపాలు కూడా సరిచేస్తుంది. ఎంత స్పష్టంగా, సూటిగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా ఇది మనం రాసినదాన్ని మారుస్తుంది.

హెమింగ్‌వే..


గ్రామర్‌, స్పెల్లింగ్‌లు తప్పుగా ఉంటే చూపించేందుకు ఇన్ని యాప్‌లు అవసరం లేదు కదా. అందుకే హెమింగ్‌వే పైన చెప్పిన రెండింటి కన్నా కొంచెం విభిన్నంగా ఉంటుంది. కేవలం వ్యాకరణం, తప్పులు సరిచేయడమే కాకుండా మీరు రాసిన ఉద్దేశాన్ని సాధ్యమైనంత స్పష్టంగా, సంక్షిప్తంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. పెద్ద వాక్యాలను చిన్నగా మార్చడం, చిన్న పదాలను వాడటం వంటివి వాడటం ద్వారా మనం రాసినదాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.  ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. టెక్నాలజీని పూర్తిగా అర్థం చేసుకుంటే అది మనకు ఎంత శ్రమను తగ్గిస్తుందో తెలుస్తుంది. మనతో పాటు అవి కూడా పనిని పంచుకుంటాయి. ఎంతో సహాయం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలోనూ సహకరిస్తాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న