వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ.. ఏంటా కథ..?
close

Updated : 24/02/2021 12:39 IST
వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ.. ఏంటా కథ..?

ఇంటర్నెట్‌డెస్క్‌: యాప్‌లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సదరు యాప్‌ నిర్వాహకులపై ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్‌ స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలామందిలో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అసలేంటి ఈ పాలసీ, ఎప్పటిలోగా అంగీకరించాల్సి ఉంది.. అంగీకరించకపోతే ఏం జరుగుతోంది.. వివాదం ఎందుకు వచ్చిందో ఓ సారి తెలుసుకుందాం.. 

అసలు ఏంటీ పాలసీ..?

గత నెలలో వాట్సాప్‌ తన యూజర్లకు ప్రైవసీ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇచ్చింది. తమ యూజర్ల భద్రతకు, ప్రైవసీకి, సమాచార గోప్యత పాటించడమే తమ లక్ష్యమని వాట్సాప్‌ చెప్పింది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని ఆందోళనలు రేగాయి. వాటన్నింటినీ అప్పట్లో వాట్సాప్‌ కొట్టిపడేసింది. కొందరి యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం జరిగిందని వాట్సాప్‌ ఎట్టకేలకు అంగీకరించింది. అంతేకాకుండా యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేసింది. ఎక్కువగా బిజినెస్‌ యూజర్ల కోసమే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. వ్యక్తిగతంగా చేసుకునే మెసేజ్‌లు, కాల్స్‌కు సంబంధించిన వివరాలను ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌డ్‌ సాంకేతికతను వినియోగించడంతో వాట్సాప్‌ చూడలేదని తెలిపింది.


మరి ఎందుకీ చర్చ...?

ఓ పక్క యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ఆటంకాలు ఉండవని వాట్సాప్‌ చెబుతుండగా.. తమ సమాచారాన్ని, ఐపీ అడ్రస్‌లను ఇతర సోర్స్‌లకు ఇస్తున్నారని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 8 నుంచే ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకురావాలని వాట్సాప్‌ భావించినా.. దానిని మే 15వ తేదీకి వాయిదా వేసింది. డేటా షేరింగ్‌కు సంబంధించినదే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే అంశం. అయితే దీనిపై వాట్సాప్‌ స్పష్టమైన వివరణ ఇచ్చినట్లుగానే ఉంది. యూజర్ల భద్రతకు సంబంధించి విఘాతం కలగకుండా ఎవరి అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌కు డేటాను షేర్‌ చేయమని వాట్సాప్‌ వెల్లడించింది. కేవలం యూజర్‌ అనుమతి ఉంటేనే షేర్‌ చేసేందుకు.. అది కూడా వాట్సాప్ యూజర్‌ ఎంపిక మీదే ఆధారపడి ఉంటుందని తెలిపింది.


గడువు ఎప్పటి వరకు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

ఫిబ్రవరి నుంచే కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని మే నెలకు పెంచింది. అప్‌డేటెడ్‌ ప్రైవసీ పాలసీకి అనుమతి తెలిపేందుకు మే 15వ తేదీని తుది గడువుగా విధించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే ఏమవుతుంది..? వాట్సాప్‌ మొదట తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం.. అంగీకారం ఇవ్వకపోతే వాట్సాప్‌ ఖాతాను వినియోగించే అవకాశం కోల్పోతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత నేపథ్యంలో కొత్తగా అప్‌డేట్‌ చేసిన ప్రైవసీ పాలసీలో దానిని తొలగించింది. అప్‌డేటెడ్‌ ప్రైవసీ పాలసీని తెలుసుకోవడం ఎలాగో గత వారం వాట్సాప్‌ వివరణ ఇచ్చింది. వాట్సాప్‌ అప్‌డేట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలో ఇస్తామని వెల్లడించింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ లేదా టర్మ్స్ ఆఫ్‌ సర్వీసెస్‌ (టీవోఎస్‌)కు సంబంధించి ఇప్పటికే భారత్‌లో కొంతమంది యూజర్లకు అలర్ట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. మిగతావారికి కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వాట్సాప్‌ తెలిపింది. అప్‌డేటెడ్‌ చేసిన ప్రైవసీ పాలసీని యూజర్లకు తెలియజెప్పడమే తమ ప్రధాన ఉద్దేశమని వాట్సాప్‌ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న