అన్ని గ్రూపులకూ సరిపోయే లా!

న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ న్యాయమే గీటురాయిగాసాగే ఈ వృత్తికి ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఉంటోంది. సమాజంలో గౌరవం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలవడం, మంచి ఆదాయం ప్రధాన ఆకర్షణగా ఉండటంతో యువత న్యాయవిద్య వైపు నడుస్తోంది. అలాంటి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ తర్వాత నుంచే తమ కెరియర్‌ను ఈ దిశగా కొనసాగించవచ్చు. అన్ని గ్రూప్‌లవారికీ ఆ అవకాశం ఉంది.

Published : 21 Apr 2020 01:07 IST

న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ న్యాయమే గీటురాయిగాసాగే ఈ వృత్తికి ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఉంటోంది. సమాజంలో గౌరవం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలవడం, మంచి ఆదాయం ప్రధాన ఆకర్షణగా ఉండటంతో యువత న్యాయవిద్య వైపు నడుస్తోంది. అలాంటి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ తర్వాత నుంచే తమ కెరియర్‌ను ఈ దిశగా కొనసాగించవచ్చు. అన్ని గ్రూప్‌లవారికీ ఆ అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయి మానవ వనరులు లేకపోవడం అనేది ఇందుకు ఒక ప్రధాన కారణం. వాటిని సిద్ధం చేయడానికి ఎప్పటికప్పుడు ఆధునిక అవసరాలకు అనుగుణంగా న్యాయవిద్యలో కోర్సులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. న్యాయవిభాగంలో కెరియర్‌ కోరుకునే వాళ్లు ఇంటర్మీడియట్‌ నుంచే ఆ దిశగా అడుగులు వేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో లాసెట్‌ రాసి అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరవచ్చు. జాతీయస్థాయిలో క్లాట్‌కు హాజరై మంచి స్కోరు సంపాదిస్తే  డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ కలిపి చదువుకోవచ్చు. ఇదీ అయిదేళ్లకే పూర్తవుతుంది. సాధారణంగా ఇంటర్‌ తర్వాత డిగ్రీ మూడేళ్లు, మళ్లీ ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు మొత్తం ఆరేళ్ల సమయం పడుతుంది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరితే ఒక సంవత్సరం ఆదా అవుతుంది. సబ్జెక్టుపై పట్టు సాధించడానికి అవకాశం దక్కుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు సంస్థలు డిగ్రీతో కలిపి ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందిస్తున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైంది కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్టు (క్లాట్‌). భారత్‌లో కొన్ని సంస్థలతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి ఎల్‌శాట్‌ రాయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాసెట్‌ నిర్వహిస్తున్నారు.
ఈ స్కోరుతో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు న్యాయవిద్యా సంస్థల్లో చేరవచ్చు. ఇవి ఎల్‌ఎల్‌బీ డిగ్రీని మాత్రమే అందిస్తాయి.

కోరుకున్న డిగ్రీతో!
బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో కోరుకున్న కాంబినేషన్‌తో ఎల్‌ఎల్‌బీ చదువుకోవచ్చు. ఎక్కువ సంస్థల్లో బీఎ-ఎల్‌ఎల్‌బీ అందుబాటులో ఉంది. కొన్నిచోట్ల బీకామ్‌-ఎల్‌ఎల్‌బీ, బీబీఏ-ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ-ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యూ-ఎల్‌ఎల్‌బీ కోర్సులున్నాయి. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ వీటిలో లా సిలబస్‌ ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. బీబీఏలో మేనేజ్‌మెంట్‌, బీఏలో సోషల్‌ సైన్సెస్‌, బీఎస్సీలో సైన్స్‌ అంశాలు, బీఎస్‌డబ్ల్యూలో సోషల్‌ వర్కుకు ప్రాధాన్యం కల్పిస్తారు. అయిదేళ్లలో పది సెమిస్టర్లతో డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య (ఎల్‌ఎల్‌ఎం) దిశగా అడుగులేయవచ్చు.
ఉన్నత విద్య
సాధారణంగా ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్‌ లాంటి పీజీ కోర్సులు రెండేళ్లు చదవాలి. కానీ క్లాట్‌ ఆధారంగా కొన్ని సంస్థల్లో న్యాయవిద్యలో పీజీ కోర్సు (ఎల్‌ఎల్‌ఎం) ఏడాదికే పూర్తవుతుంది. ఇందులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. బిజినెస్‌ లాస్‌, హ్యూమన్‌ రైట్స్‌ లాస్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అండ్‌ బిజినెస్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా, బిజినెస్‌ లా అండ్‌ క్రిమినల్‌ లా, కార్పొరేట్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, ఫ్యామిలీ లా, పాలసీ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ మొదలైన స్పెషలైజేషన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌ఎం కాలవ్యవధి రెండేళ్లు. వీటిల్లో పీజీలాసెట్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. అనంతరం ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో చేరవచ్చు. బోధన రంగంలో రాణించడానికి ఈ పట్టా ఉపయోగపడుతుంది. 

బార్‌ పరీక్ష
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్న లా గ్రాడ్యుయేట్లు కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేయాలంటే ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో అర్హత పొందినవారు మాత్రమే అడ్వకేట్‌గా సేవలు అందించడానికి అర్హులు. ఈ పరీక్ష ఓపెన్‌ బుక్‌ విధానంలో ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ వంద మార్కులకు నిర్వహిస్తుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తెలుగులోనూ ప్రశ్నపత్రం ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. కొద్దిగా కష్టపడితే సులువుగానే ఉత్తీర్ణులు కావచ్చు.
అవసరమైన నైపుణ్యాలు
క్లిష్టమైన, విస్తృతంగా ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకునే నైపుణ్యం లా గ్రాడ్యుయేట్లకు ఉండాలి. అలాగే తార్కిక పరిజ్ఞానం తప్పనిసరి. విశ్లేషణ, రాత నైపుణ్యాలు బాగుండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, తెలివిగా మాట్లాడడం తప్పనిసరి. అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచాలి.  
పేరున్న సంస్థలు
దేశంలో న్యాయవిద్యకు నేషనల్‌ లా యూనివర్సిటీలతోపాటు మరికొన్ని సంస్థలు ప్రసిద్ధి పొందాయి. వాటిలో ముఖ్యమైనవి దిల్లీ యూనివర్సిటీ - ఫ్యాకల్టీ ఆఫ్‌ లా; బెనారస్‌ యూనివర్సిటీ - వారణాసి; గవర్నమెంట్‌ లా కాలేజ్‌, ముంబయి; ఐఎల్‌ఎస్‌ లా కాలేజ్‌, పుణె; సింబయాసిస్‌, పుణె; ఐఐటీ ఖరగ్‌పూర్‌. వీటిలో ప్రవేశాల కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి.


ఉద్యోగాలు

జాతీయ స్థాయి సంస్థల్లో న్యాయవిద్య కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. అన్ని కార్పొరేట్‌ కంపెనీలతోపాటు ఒక మోస్తరు సంస్థల్లోనూ లీగల్‌ విభాగం ఉంటుంది. అందువల్ల వీరికి అవకాశాలు అన్ని రకాల సంస్థల్లోనూ దక్కుతున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్‌ సంస్థలూ, అకౌంటింగ్‌ కంపెనీల్లోనూ ఉపాధి లభిస్తోంది. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్‌ క్లర్క్‌లగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యతో బోధన రంగంలోనూ రాణించవచ్చు. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ఇవన్నీ కొలువుల వేదికలే. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ సంస్థలూ ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ స్థాయుల్లో సుమారు 3 కోట్ల కేసులు, అయిదు వేల జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సైబర్‌ క్రైమ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు పెరుగుతున్నాయి. సాంకేతిక వృద్ధి లీగల్‌ పట్టభద్రులకు అవకాశాలను పెంచుతోంది. సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌), లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులకూ లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుల్లో సేవలు అందించవచ్చు. ఆర్మీలో జడ్జ్‌ అడ్వకేట్‌ జనరల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టుల్లో సొంతంగా ప్రాక్టీస్‌ చేయవచ్చు. లీగల్‌ ఎనలిస్ట్‌గానూ చేరవచ్చు.


క్లాట్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నల్సార్‌-హైదరాబాద్‌; దామోదరం సంజీవయ్య జాతీయ లా కళాశాల-విశాఖపట్నం క్లాట్‌లో సాధించిన మెరిట్‌తోనే సీట్లు కేటాయిస్తున్నాయి.


స్పెషలైజేషన్లు

సివిల్‌ లా: సాధారణ గొడవలు, ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, హక్కుల ఉల్లంఘన మొదలైన కేసులను సివిల్‌ లా నిపుణులు చూసుకుంటారు.
క్రిమినల్‌ లా: హత్య వెనుక పరిణామాలు, అందుకు దోహదం చేసిన పరిస్థితులను వీరు గమనిస్తారు. క్లయింట్లు, పోలీసులు, సాక్షులు అందించిన సమాచారంతో తమ క్లయింట్‌కు అనుగుణంగా కోర్టులో వాదనలు వినిపిస్తారు.
టాక్స్‌ లా: దేశంలో ఉన్న పలు రకాల పన్నులపై వీరు అధ్యయనం చేస్తారు. ఇన్‌కంటాక్స్‌, ఎస్టేట్‌టాక్స్‌, సర్వీస్‌టాక్స్‌...ఇలా అన్ని టాక్స్‌లపైనా వీరికి పట్టు ఉంటుంది. తమ క్లయింట్లు, వారి సంస్థలకు చెందిన టాక్స్‌ కేసులపై కోర్టులో వాదిస్తారు.
ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా: వీరు మేథోహక్కులకు కాపలాదారుగా ఉంటారు. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక పనులు, కళాత్మక ఆకృతులు, లోగో, సంస్థ పేరు, ప్రత్యేక చిత్రాలు...ఇవన్నీ ఎవరివి వారికి ప్రత్యేకం. ఒక సంస్థ లేదా వ్యక్తికి చెందినవి మరొకరు దొంగిలించడం, దాన్నే అనుసరించడం, స్వల్ప మార్పులతో వినియోగించడం లాంటివి చేస్తే వీరు తమ క్లయింట్ల తరఫున సంబంధిత కేసుల్లో వాదనలు వినిపిస్తారు. ఇంకా కార్పొరేట్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా వంటి స్పెషలైజేషన్లూ ఉన్నాయి.


ఆరేళ్ల వ్యవధితో బీటెక్‌ తోపాటు ఎల్‌ఎల్‌బీ చదువుకునే అవకాశమూ ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌) బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తోంది. దీనికి ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు మాత్రమే అర్హులు.


ముఖ్యమైన తేదీలు

క్లాట్‌

క్లాట్‌ ప్రకటన వెలువడింది. దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్‌ 25లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. పరీక్షను గతంలో ప్రకటించిన మే 10న కాకుండా 24న నిర్వహిస్తారు.
అర్హత: ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులకు 40% మార్కులు సరిపోతాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: 
https://consortiumofnlus.ac.in/


ఏపీ, తెలంగాణ

తెలుగు రాష్ట్రాలు నిర్వహించే లాసెట్లకూ ప్రకటనలు వెలువడ్డాయి. ఏపీలాసెట్‌ కోసం మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. టీఎస్‌ లాసెట్‌ దరఖాస్తులు మే 5 వరకు స్వీకరిస్తారు. పరీక్ష మే 27న నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు:

తెలంగాణ  https://lawcet.tsche.ac.in,     
ఏపీ 
https://sche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx


ఎల్‌ఎల్‌బీని దూరవిద్యలో చదవడానికి వీలు లేదు. ఎల్‌ఎల్‌ఎంను కొన్ని యూనివర్సిటీలు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అందిస్తున్నాయి. న్యాయవిద్యకు అనుబంధంగా ఉన్న పలు రకాల డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను దూరవిద్యలో పూర్తి చేయవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని