అర్బన్‌ ప్లానింగ్‌ కోర్సులు ఎక్కడున్నాయి?

అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక సంవత్సరం వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమాను ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ దూరవిద్యలో అందిస్తోంది.

Published : 19 Jan 2022 11:02 IST

అర్బన్‌ ప్లానింగ్‌/డెవలప్‌మెంట్‌ లేదా టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ కోర్సులు దూరవిద్యలో ఉన్నాయా? ఈ కోర్సులను ఏయే విద్యాసంస్థలు అందిస్తున్నాయి?

- డి.వి. రఘురామ్‌

అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక సంవత్సరం వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమాను ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ దూరవిద్యలో అందిస్తోంది. అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు ఈ కోర్సులను దూరవిద్యలో అందిస్తున్నాయి. అలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకొనేముందు వాటి విశ్వసనీయతను పరీక్షించుకోండి. అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టౌన్‌ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్‌ లాంటి కోర్సులను రెగ్యులర్‌గా చదవడమే  మేలు. ఈ కోర్సులను  ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సాంకేతిక విశ్వవిద్యాలయాలు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్‌ కాలేజీలు రెగ్యులర్‌ విధానంలో అందిస్తున్నాయి.  


ఆ మూడు అంశాలతో బీఎస్‌సీ..

ఇంటర్‌ బైపీసీ చదివాను. కార్డియాలజీ, న్యూరాలజీ, రేడియాలజీ సబ్జెక్టులతో బీఎస్‌సీ కోర్సు ఎక్కడుంది?

  - నానాజీ

బీఎస్సీ కార్డియాక్‌ పల్మనరీ పర్‌ఫ్యూజన్, బీఎస్సీ ఈసీజీ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, కోర్సులు నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో  శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో అతి తక్కువ సీట్లతో అందుబాటులో ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో మొదటి మూడు సంవత్సరాలు కోర్స్‌ వర్క్‌ , చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. పైన చెప్పిన అన్ని కోర్సులకూ  ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఇంటర్‌ వొకేషనల్‌ అండ్‌  బ్రిడ్జ్‌ కోర్సు చదివివుండాలి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుకు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర రాష్ట్రాల్లో, అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల/కళాశాలల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే కోర్సులో ప్రవేశం పొందండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని