నవోదయల్లో.. లేటరల్‌ ఎంట్రీ

అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది.

Published : 27 Sep 2023 00:08 IST

అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది. ఈ తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాసమితి నడుస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఈ సంస్థల్లో బాలబాలికలు కలిసి చదువుకుంటారు. వసతి విడిగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు బోధనతో పాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారం అన్నీ ఉచితంగానే అందిస్తారు. అధిక వేతనం ఉన్న ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ఇందుకోసం ప్రతి నెలా రూ.1500 చొప్పున చెల్లించాలి. మిగిలినవారు నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కల్పిస్తారు. సంస్కృతి, విలువలు పెంపొందేలా చేస్తారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ప్రతి విద్యార్థీ మూడు భాషల్లో రాణించేలా కృషి చేస్తారు. ఇందుకోసం హిందీ రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు, అలాగే ఇతరులను హిందీ రాష్ట్రాలకు పంపుతారు. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఐఐటీ-జేఈఈ, నీట్‌, క్లాట్‌, ఎన్‌డీఏ ... తదితర పరీక్షల్లో రాణించడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష రాయాలి. అందులో ప్రతిభ చూపినవారిని చేర్చుకుంటారు.

ప్రశ్నపత్రం ఇలా...

వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఇంగ్లిష్‌ 15, హిందీ 15, మ్యాథ్స్‌ 35, సైన్స్‌ 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ / హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.


ఖాళీలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌లో: అనంతపురం 14, చిత్తూరు 19,  తూర్పు గోదావరి-1లో 10, గుంటూరు 11, అన్నమయ్య(కడప) 9, కృష్ణా 12, కర్నూలు 6, నెల్లూరు 13, ప్రకాశం 1, 2 ఒక్కోదాంట్లో 14, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 11, విజయనగరం 8, పశ్చిమ గోదావరి 8, అల్లూరి సీతారామరాజు(తూర్పు గోదావరి 2) 2

తెలంగాణలో: ఆదిలాబాద్‌ 9, కరీంనగర్‌ 5, ఖమ్మం 6, మహబూబ్‌నగర్‌ 9, మెదక్‌ 8, నల్గొండ 7, నిజామాబాద్‌ 16, రంగారెడ్డి 9, వరంగల్‌ 4 ఉన్నాయి.


ఎవరు అర్హులు?

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం (2023-24)లో ఎనిమిదో తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలి. ప్రవేశం ఆశించే నవోదయ పరిధిలోని పాఠశాలకు చెందినవారై ఉండాలి. ఉన్న ఖాళీలకు ఆయా జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులకే అవకాశం ఉంటుంది. పరీక్ష సైతం ఆ కేంద్రంలోనే రాయాలి.
వయసు: మే 1, 2009 - జులై 31, 2011 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 10
పరీక్ష కేంద్రాలు: సంబంధిత నవోదయ విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు