చలికాలంలో సాగటంలేదా సన్నద్ధత?

చలికాలంలో వాతావరణం హాయిగా ఉంటుంది. అటు ఎండల్లో మాడాల్సిన అవసరం ఉండదు. ఇటు వర్షంలో తడవాల్సిన పనీ ఉండదు. అయితే వచ్చిన చిక్కల్లా చలి కారణంగా బద్ధకం ఎక్కువవుతుంది.

Published : 14 Nov 2023 01:38 IST

చలికాలంలో వాతావరణం హాయిగా ఉంటుంది. అటు ఎండల్లో మాడాల్సిన అవసరం ఉండదు. ఇటు వర్షంలో తడవాల్సిన పనీ ఉండదు. అయితే వచ్చిన చిక్కల్లా చలి కారణంగా బద్ధకం ఎక్కువవుతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇంకా.. ఇంకా పడుకోవాలనిపిస్తుంది. చదవాల్సిన పాఠాలేమో కొండలా పేరుకుపోతూ ఉంటాయి. మరి మీ పరిస్థితీ ఇలాగే ఉందా?

పొద్దున్నే లేచి చదువుకోవాలని బుద్ధిగా అలారం కూడా పెట్టుకుంటాం. కానీ మోగిన వెంటనే దాన్ని ఆపుచేసి ఐదే ఐదు నిమిషాల్లో లేవాలనుకుంటాం. ఐదు కాస్తా అరగంటా, గంటా కావచ్చు. ఈలోగా సమయం మించిపోవడంతో కాలేజీకీ పరుగులు పెడతాం. పోనీ వచ్చాక ఎక్కువసేపు చదువుదామంటే అలసిపోవడం.. దానికి తోడు చలిగానూ ఉండటం వల్ల త్వరగా నిద్ర ముంచుకొస్తుంది. అంటే.. త్వరగా నిద్రపోతాం.. ఆలస్యంగా నిద్రలేస్తాం. దాంతో చదవాల్సినవి ఎక్కడికక్కడ పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఇలాగే కొనసాగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవేమిటో చూద్దామా...


1. చలి కారణంగా బద్ధకంగా ఉంటుంది. ఏ పనీ ఉత్సాహంగా చేయాలనిపించదు. కాస్త విసుగ్గా.. మరి కొంచెం చిరాగ్గానూ ఉంటుంది. వీటన్నింటినీ వదిలించుకోవాలంటే వీలైనంతవరకూ శరీరానికి ఎండ తగలేలా చూడాలి. అంటే గదికే పరిమితం కాకుండా.. ఎక్కువసేపు ఆరుబయట గడపడానికి ప్రయత్నించాలి. ఒంటికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.


2. విటమిన్‌-డికి దిగులును దూరం చేసే శక్తి ఉంటుంది. అది శరీరానికి అందాలంటే ఎండ తగలాలి. సాధారణంగా ఇంట్లో కూర్చుని చదువుకుంటాం కదా. అలాగే ఆరుబయట ఎండతగిలేలా కూర్చునీ చదవొచ్చు. ఇబ్బందిగా అనిపించకుండా.. ఏకాగ్రత కుదురుతుందీ అనుకుంటే మెల్లగా నడుస్తూ కూడా చదవొచ్చు.


3. తినే ఆహారంలోనూ తగినన్ని మార్పులు చేసుకోవాలి. వాల్‌నట్స్‌, సన్‌ఫ్లవర్‌, గుమ్మడి, చియా విత్తనాలు తరచూ తీసుకోవాలి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఈ కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.


4. ఆహారంలో భాగంగా.. ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్లు ఎక్కువగా ఉండే బీన్స్‌, శనగలు, పప్పుదినుసులు ఉండేలా చూసుకోవాలి.


5. ఈ కాలంలో అందుబాటులో ఉండే పండ్లను.. ముఖ్యంగా విటమిన్‌-సి ఎక్కువగా ఉండే కమలాలు, కివీ, స్ట్రాబెర్రీ.. ఇతర పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి.. చలి కారణంగా తరచూ వచ్చే జలుబు బారిన పడకుండా ఉంటారు.


6. శరీరానికి వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. కసరత్తులు చేయడం విసుగ్గా ఉంటే నచ్చిన క్రీడను ఎంచుకుని ఆడుకోవచ్చు. డాన్స్‌ ఇష్టమైతే నాలుగు స్టెప్‌లు వేయండి. బద్ధకం అందనంత దూరంగా పారిపోతుంది.


7. నిజానికి ఏ కాలంలో ఉండే ఇబ్బందులు ఆ కాలంలో పలకరిస్తూనే ఉంటాయి. కానీ వాటికి చిక్కకుండా చురుగ్గా, ఆనందంగా ఎలా ఉంటామన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మన పనులను మనం సకాలంలో పూర్తిచేయలేకపోవడానికి వాతావరణంలో మార్పులు అనేవి ఒక సాకు కాకూడదు. దృఢ సంకల్పం ఉంటే.. వీటిని అధిగమించడం అసాధ్యంకాదు.


8. టైమ్‌టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అమలు చేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. కాలం ఏదైనా సరే.. దాని ప్రకారమే పనులన్నిటినీ పూర్తిచేయడానికి ప్రయత్నించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని