తీరు మార్చుకుంటే.. తీర్మానాలు హిట్టే!

కొత్త సంవత్సరం వస్తోందంటే మనందరికీ సంతోషమే. సరదాగా సాగిపోయే పార్టీలు.. నూతన క్యాలెండర్లూ, డైరీలు.. వీటితోపాటుగా మరో ముఖ్యమైన విషయం గురించీ ఆలోచిస్తాం.

Updated : 27 Dec 2023 06:04 IST

కొత్త సంవత్సరం వస్తోందంటే మనందరికీ సంతోషమే. సరదాగా సాగిపోయే పార్టీలు.. నూతన క్యాలెండర్లూ, డైరీలు.. వీటితోపాటుగా మరో ముఖ్యమైన విషయం గురించీ ఆలోచిస్తాం. అవే... కొత్త సంవత్సరపు తీర్మానాలు. కొందరు విద్యార్థులు ఏడాది మొదట్లో హడావుడిగా కొన్ని తీర్మానాలు చేసేసుకుని కొన్ని రోజులపాటు శ్రద్ధాసక్తులతో అమలుచేస్తారు కూడా. ఆ తర్వాత మెల్లగా వాయిదాలు వేయడం మొదలుపెడతారు. ఆపై మొత్తానికే వదిలేస్తారు. అలాకాకుండా ఉండాలంటే...?

ఏ పని చేసినా ఫొటో తీయడం, దాన్ని వాట్సాప్‌ గ్రూపుల్లోనో, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ల్లోనో అప్‌లోడ్‌ చేసి ఎన్ని లైకులు వచ్చాయో చూసుకోవడం కొంతమందికి దాదాపు దినచర్యగా మారిపోయింది. ఎక్కువ లైకులు వస్తే ఆనందించడం, తక్కువ వస్తే ఇతరులతో పోల్చుకుని బాధపడిపోవడం చేస్తుంటారు. శుభాకాంక్షల నుంచి ఓదార్పుల వరకూ అన్నింటికీ సోషల్‌ మీడియానే వేదికైపోయింది. దీని మోజులో పడి అమూల్యమైన కాలమెంతో వృథా అవుతుందనేది మర్చిపోతుంటారు. కాబట్టి సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనే తీర్మానం చేసుకోవడం ఎంతో అవసరం.

  •  సోషల్‌ మీడియా వాడకాన్ని నిర్దిష్ట సమయానికే పరిమితం చేసుకోవాలి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్న     పిల్లలకైతే పెద్దవాళ్లు తమను గమనిస్తారనే భయం ఉంటుంది. కళాశాల స్థాయికి వచ్చిన తర్వాత మన మంచీ చెడుల గురించి మనమే ఆలోచించుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నామని తెలిసీ అదే పనిని పదే పదే చేస్తున్నామంటే అర్థం.. మన మీద మనకు నియంత్రణ లేదనే కదా? కాబట్టి ముందుగా మన ఆలోచనల్నీ, చర్యల్నీ అదుపు తప్పకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • కొన్నిసార్లు బాగా విసుగ్గా ఉండి చదవాలనిపించకపోవచ్చు. కానీ పరీక్షలు దగ్గర్లోనే ఉండొచ్చు. అలాంటప్పుడు అనుకున్న సమయంలోగా చదవడం పూర్తిచేస్తే.. కాసేపు సోషల్‌ మీడియాలో రిలాక్స్‌ కావచ్చనే నియమం పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ముందుగా పని పూర్తిచేయాలి. ఆ తర్వాతే వినోదం. ప్రశ్నించేవాళ్లు ఎవరూ  లేకపోయినా పెట్టుకున్న నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు.

    వాయిదాలు వద్దు

ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి.. రేపు చేయాల్సిన దాన్ని ఆ తర్వాత ఎప్పటికో వాయిదాలు వేయడం చాలామందికి అలవాటే. ఈలోగా కాలం మంచులా కరిగిపోయి పరీక్షలూ ముంచుకొస్తాయి. అప్పుడు మేల్కొని కంగారుపడినా ఫలితం ఉండదు. అందుకే ఎప్పటి పనిని అప్పుడే పూర్తిచేయడం అలవాటు చేసుకోవాలి.

  • అవసరాన్ని బట్టి పనులను ముందుగా విభజించుకోవాలి. ఇప్పుడే ఈ క్షణమే చేయాల్సిన పనులు, నిర్ణీత సమయంలోగా చేయాల్సినవి, మీ తరపున ఎవరైనా చేయగలిగేవీ, అసలు అవసరమే లేని పనులూ కొన్ని ఉంటాయి. ఇలా విభజించుకుని ప్రాముఖ్యాన్ని బట్టి చేస్తూవుంటే ఒత్తిడి కి దూరంగా ఉండొచ్చు. అలాగే పనులూ వాయిదా
  • పడకుండా ఉంటాయి.  
  •  చదవడానికి కూర్చున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేయడమే మంచిది. లేకపోతే ఫోన్‌ చూస్తూ చదవాల్సిన వాటిని వాయిదా వేసే అవకాశం ఉంటుంది.
  •  ఎలాంటి శబ్దాలూ రాని, అవాంతరాలూ లేని ప్రదేశాన్ని ఎంచుకుని చదవాలి. కుటుంబసభ్యుల సంభాషణలు వినిపిస్తే.. చదివేదాన్ని పక్కన పెట్టి మీరూ మాట్లాడటం మొదలుపెడతారు. టీవీ శబ్దం పెద్దగా వినిపించినా మీ ఆలోచనలు దాని చుట్టూ తిరగొచ్చు. దాంతో రాయాల్సినవీ, చదవాల్సినవీ రేపటికి వాయిదా పడొచ్చు.
  •  చదువు విషయంలోనే కాదు, దరఖాస్తులు నింపి.. సమర్పించే విషయంలోనూ గడువు తేదీ వరకూ వాయిదా వేస్తుంటారు కొందరు. చివరి నిమిషంలో నింపేటప్పుడు తప్పులు దొర్లొచ్చు. సర్వర్‌ పనిచేయక దరఖాస్తు చేయటం కుదరకపోనూవచ్చు. దీనివల్ల ఎంతో మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా? సకాలంలో దరఖాస్తు చేయకపోతే.. ఒక్కోసారి సుదూర ప్రాంతంలోని పరీక్ష కేంద్రాన్ని కేటాయించే ప్రమాదమూ ఉంటుంది.

తొందరపాటు తగదు

ఒకోసారి తీర్మానాల అమలు విఫలం కావడానికి త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆరాటం కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు బరువు తగ్గాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకుందాం. ఒకపక్క డైటింగ్‌ చేస్తూ.. మరోపక్క కఠిన వ్యాయామాలూ మొదలుపెడితే వెంటనే నీరసించి పోతారు. కొద్ది రోజుల తర్వాత నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చి లక్ష్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. అలాకాకుండా డైటింగ్‌తోపాటు తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టాలి. వీటికి అలవాటు పడిన కొంతకాలం తర్వాత కష్టమైన వ్యాయామాలూ చేయొచ్చు.


ఎన్నో లక్ష్యాలు 

కొంతమంది ఒకేసారి ఎక్కువ తీర్మానాలు చేసుకుంటారు. మంచి ర్యాంకు సాధించాలి, బరువు తగ్గాలి, రోజూ వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, కొత్త కోర్సులు ఆన్‌లైన్లో చేయాలి, నైపుణ్యాలు పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకుని ఆదాయ మార్గాలు పెంచుకోవాలి.. ఇలా ఒకేసారి అనేక రకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల దేనిమీదా ప్రత్యేకంగా దృష్టిని నిలపలేరు. ప్రాధాన్యక్రమంలో వీటిని సాధించే ప్రయత్నాలు చేయాలి.


స్పష్టంగా కనిపించేలా...

ఏ పని చేయాలన్నా దాన్ని ఎలా చేయాలనే దాని గురించి ముందుగా ఆలోచిస్తాం. అంటే ముందుగా మన మనసులోనే కార్యాచరణ పథకాన్ని రచించుకుంటాం కదా. దాన్నే ఇప్పుడు పేపర్‌ మీద పెట్టండి. అంటే పని పూర్తిచేయడానికి ఒక ప్రణాళిక వేసుకుంటారన్నమాట. దాన్ని ఇంట్లో కంటికి ఎదురుగా స్పష్టంగా కనిపించేలా పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటారు. ఇలా చేయకపోతే ఏ అవాంతరం వచ్చినా లక్ష్యాన్నీ, దాని సాధననూ మర్చిపోవచ్చు.


విఫలమైనవాటి సంగతి?

గత ఏడాది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని విఫలమయ్యారు. అది ఆచరణ సాధ్యమైనదైతే.. అదే లక్ష్యాన్ని కొత్త సంవత్సరంలోనూ పెట్టుకోవడం, దాన్ని సాధించటం కోసం కృషి చేయడం తప్పేమీ కాదు. కాకపోతే అమలు చేయడంలో ఏమేం పొరపాట్లు దొర్లాయో పరిశీలించుకుని, వాటిని సవరించుకుంటే సరిపోతుంది.  

చివరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ‘కొత్త సంవత్సరం వస్తుందీ.. పోతుంది. నా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు..’ ఇలా ప్రతికూలంగా ఆలోచిస్తే మాత్రం నిజంగానే ఎలాంటి మార్పూ ఉండదు. ఎందుకంటే ఇప్పటి మన ఆలోచనలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ‘గత ఏడాది తెలియక కొన్ని పొరపాట్లు చేశాను. ఈ సంవత్సరం అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటాను. నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకుంటాను..’ ఇలా సానుకూలంగా ఆలోచిస్తూ.. ఆచరణ కొనసాగిస్తే అనుకున్నది సాధించగలుగుతాం!  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని