Oral Hygiene: నోరు మంచిదైతే.. ఆరోగ్యమూ మంచిదవుతుంది... ఎలా అంటే?

importance of Oral hygiene: నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. ఆ విషయమేమో కానీ.. నోరు మంచిదైతే కచ్చితంగా మన ఆరోగ్యమూ మంచిదవుతుంది అంటున్నారు వైద్యులు. 

Updated : 04 Feb 2024 15:53 IST

నోరు మంచిదైతే ఆరోగ్యమూ మంచిదవుతుంది! నోరు మన ఆరోగ్యానికి వాకిలి మరి. శరీర ఆరోగ్యం, నోటి ఆరోగ్యం.. రెండూ ఒక దాంతో మరోటి ముడిపడి ఉంటాయి. నోట్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. కొన్ని దంతాలను క్షీణింపజేస్తే, మరికొన్ని చిగుళ్లవాపు తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవటం (Oral Hygiene) కీలకం. ఇది మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.

ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది

పుచ్చిపోయిన పళ్లు, చిగుళ్లు వాయటం నోటి అందాన్ని దెబ్బతీయటమే కాదు.. దుర్వాసనకూ కారణమవుతాయి. దీంతో నవ్వాలన్నా, దగ్గరకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలన్నా నామోషీగా అనిపిస్తుంది. ఇది బెరుకుకు, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. అదే దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ఆహారం మంచిగా తినొచ్చు. పళ్ల నొప్పి, నోటి ఇన్‌ఫెక్షన్ల బెడద లేకపోవటం వల్ల చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. కంటి నిండా నిద్ర పడుతుంది. మొత్తంగా ఆరోగ్యం పుంజుకుంటుంది.

గుండెజబ్బు ముప్పు తగ్గుముఖం

చిగుళ్లవాపునకు గుండెజబ్బులకు సంబంధం ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చిగుళ్లవాపు శరీరంలో దీర్ఘకాల వాపుప్రక్రియకు (ఇన్‌ఫ్లమేషన్‌) దారితీస్తుంది. ఇది క్రమంగా గుండెపోటు, రక్తనాళాల్లో పూడికలు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. చిగుళ్లవాపు గలవారికి ఇలాంటి సమస్యల ముప్పు 3 రెట్లు ఎక్కువని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా చిగుళ్లవాపునకు పొగ తాగటం, అనారోగ్యకర ఆహారం తినటం వంటివీ తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే.

జ్ఞాపకశక్తి మెరుగు

దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి రక్తం వచ్చేవారు జ్ఞాపకశక్తి, ఇతర విషయగ్రహణ నైపుణ్యాల పరీక్షల్లో వెనకబడి పోతున్నారని పరిశోధకులు గుర్తించారు. పదాలను గుర్తుచేసుకోవటం, తీసివేతల్లో మరీ నాసిరకంగా ఉంటున్నారని తేలింది. రోజువారీ పనుల్లో ఇవి చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. యాంటీబ్యాక్టీరియల్‌ మౌత్‌వాష్‌, టూత్‌పేస్ట్‌ వాడకంతో చిగుళ్లవాపునకు దారితీసే బ్యాక్టీరియాను తగ్గించుకోవచ్చు.

ఇన్‌ఫెక్షన్లు, జబ్బుల ముప్పు దూరం

నోటి అపరిశుభ్రత అక్కడితోనే ఆగేది కాదు. ఇతర భాగాల్లోనూ ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావొచ్చు. చిగుళ్లజబ్బుకూ కీళ్లవాపును తెచ్చిపెట్టే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌కూ సంబంధం ఉంటోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు జబ్బుల్లోనూ అనుసంధాన కణజాల క్షీణత ఒకేలా ఉంటుండటం గమనార్హం. సమతులాహారం తినటం, తరచూ దంత వైద్యుడిని కలవటం, నోరు శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లజబ్బు ముప్పులను తగ్గించుకోవచ్చు. కాబట్టి రోజూ రెండు సార్లు.. ఉదయం, పడుకునే ముందు పళ్లు తోముకోవాలి. వీలైతే యాంటీసెప్టిక్‌ మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలించాలి.

రక్తంలో గ్లూకోజు అదుపు

మధుమేహం నియంత్రణలో లేనివారిలో రోగనిరోధకశక్తి సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందుకే మధుమేహులు తరచూ చిగుళ్లజబ్బు వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటారు. వీరికివి తీవ్రంగానూ పరిణమిస్తుంటాయి. అయితే నోటిని శుభ్రంగా ఉంచుకుంటే రక్తంలో గ్లూకోజును అదుపులో పెట్టుకునే అవకాశం లేకపోలేదు. మధుమేహుల్లో- చిగుళ్లజబ్బు లేనివారితో పోలిస్తే చిగుళ్లవాపు గలవారిలో గ్లూకోజు మోతాదులు అంతగా అదుపులోకి రావటం లేదని తేలటమే దీనికి నిదర్శం.

గర్భస్థ శిశువుకు రక్షణ

గర్భిణుల్లో చాలామంది హార్మోన్ల మార్పుల వంటి కారణాలతో చిగుళ్లవాపు బారినపడుతుంటారు. ఇది కొందరిలో నెలలు నిండక ముందే కాన్పు కావటానికి, తక్కువ బరువుతో పిల్లలు పుట్టటానికి దారితీయొచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి ముప్పులను తేలికగా తప్పించుకోవచ్చు. కాబట్టి గర్భిణులు ఆరోగ్య పరీక్షల్లో భాగంగా పళ్ల డాక్టర్‌నూ సంప్రదించటం మంచిది. ఇది పండంటి బిడ్డను కనటానికి తోడ్పడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని