చిన్నారి ‘షేర్‌’ఖాన్‌!

ఏడేళ్ల వయసులో.. కూరగాయల మార్కెట్‌ గురించే మనకు సరిగా తెలియదు. అలాంటిది ఓ బుడతడు మాత్రం ఏకంగా షేర్‌ మార్కెట్‌ గురించి అలవోకగా చెప్పేస్తున్నాడు. ఆ ప్రతిభే చిన్నారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. రికార్డులూ సృష్టించేలా చేసింది. మరి ఆ బుడతడు ఎవరో, అతడి ఘనత ఎలాంటిదో తెలుసుకుందామా!

Published : 03 Dec 2021 00:36 IST

ఏడేళ్ల వయసులో.. కూరగాయల మార్కెట్‌ గురించే మనకు సరిగా తెలియదు. అలాంటిది ఓ బుడతడు మాత్రం ఏకంగా షేర్‌ మార్కెట్‌ గురించి అలవోకగా చెప్పేస్తున్నాడు. ఆ ప్రతిభే చిన్నారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. రికార్డులూ సృష్టించేలా చేసింది. మరి ఆ బుడతడు ఎవరో, అతడి ఘనత ఎలాంటిదో తెలుసుకుందామా!

పేరు.. నోయిల్‌ అలెగ్జాండర్‌. వయసు.. ఏడేళ్లు. అమ్మానాన్న.. సిబు అలెగ్జాండర్‌, షహీనా. స్వస్థలం.. కేరళలోని కొచ్చి నగరం. నోయిల్‌ వాళ్ల నాన్న స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. రోజూ దాని గురించి చాలామందితో తరచూ మాట్లాడటం, ఫోన్‌లో చర్చించడం వంటివి చేస్తుంటారు. అవన్నీ గమనిస్తున్న నోయిల్‌కు కూడా వాటిపై ఆసక్తి ఏర్పడింది.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..
మన నోయిల్‌కు ఆసక్తితో పాటు అనుమానాలూ పెరిగాయి! ట్రేడ్‌ గురించి, స్టాక్‌ మార్కెట్ల గురించి వాళ్ల నాన్నను ఆ సందేహాలు అడిగేవాడు. మొదట చిన్నపిల్లాడు కదా అని వాళ్ల నాన్న చెప్పలేదు. కానీ ఈ బుడతడు వదిలితే కదా! పదే పదే అడగడం, కొన్ని కంపెనీల పేర్లు తెలుసుకుని చెప్పడం.. చేసేవాడు. ఆ పదాలు అతనికెలా తెలుసాయబ్బా! అని ఆశ్చర్యపోయేవారు అమ్మానాన్నలు. ఆ తర్వాత నుంచి నోయిల్‌ ఏది అడిగినా సమాధానం చెప్పడం ప్రారంభించారు. అవేకాకుండా ప్రముఖ ఎమ్‌ఎన్‌సీ (మల్టీ నేషనల్‌) కంపెనీల గురించి చెప్పడం, కరెన్సీ, వాణిజ్యం, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ ఇలా ప్రతీదీ తనతో షేర్‌ చేసుకునేవారు. నోయిల్‌ ఆసక్తి, జ్ఞాపకశక్తికి అమ్మానాన్నలు నివ్వెరపోయారు.

సాధనతో సాధించాడు..
నోయిల్‌లో చాలా ప్రతిభ దాగి ఉందని గుర్తించిన తల్లిదండ్రులు పిల్లాడితో ఎమ్‌ఎన్‌సీ కంపెనీల పేర్లు, లోగోలు గుర్తించడంపై సాధన చేయించారు. తమ కుమారుడు సాధించగలడు అన్న నమ్మకం కుదిరాక ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో పేరు కోసం దరఖాస్తు చేశారు. వాళ్లొచ్చి నోయిల్‌ను అడగ్గానే.. టకటకా 120 ఎమ్‌ఎన్‌సీ కంపెనీల పేర్లు, వాటి లోగోలను కేవలం 4 నిమిషాల్లోనే గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు. ఇంకేముంది ఎంచక్కా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు. ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో కూడా తన పేరు నమోదైంది. అలా అని నోయిల్‌ చదువును ఏమీ అశ్రద్ధ చేయలేదు. ఖాళీ దొరికితే పాటలూ పాడతాడు. వాళ్ల నాన్న దగ్గర ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్‌ల గురించి నేర్చుకునే పనిలో పడ్డాడు. ఎంతైనా నోయిల్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని