ఒక చిన్ని టెక్‌ దిగ్గజం..!

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి ఫోనో, లేకపోతే కంప్యూటరో ఇస్తే ఏం చేస్తాం. ‘ఇంకేం చేస్తాం.. ఎంచక్కా గేమ్స్‌ ఆడుకుంటాం. లేదంటే కార్టూన్స్‌ చూసుకుంటాం’ అంటారు, అంతే కదా!

Updated : 10 May 2024 04:15 IST

హాయ్‌ నేస్తాలూ..! మన చేతికి ఫోనో, లేకపోతే కంప్యూటరో ఇస్తే ఏం చేస్తాం. ‘ఇంకేం చేస్తాం.. ఎంచక్కా గేమ్స్‌ ఆడుకుంటాం. లేదంటే కార్టూన్స్‌ చూసుకుంటాం’ అంటారు, అంతే కదా! కానీ ఒక అన్నయ్య మాత్రం ఏఐకి సంబంధించిన అన్ని విషయాలూ ఎంచక్కా వివరిస్తాను.. అంటున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. వెంటనే ఈ కథనం చదివేయండి!

కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన రౌల్‌ జో అజుకి 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ వయసు పిల్లలు స్కూల్‌కి వెళ్లొచ్చి.. హోంవర్క్‌ చేసుకొని, మళ్లీ చదువుకోవడం ప్రారంభిస్తారు. ఈ అబ్బాయి మాత్రం, కృతిమ మేధకు సంబంధించిన.. అప్‌డేటెడ్‌ విషయాలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా చెబుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. యూట్యూబ్‌లో తన తరగతి వీడియోలు పోస్ట్‌ చేస్తాడు ఈ అబ్బాయి. ఆ వీడియోలు అతి తక్కువ సమయంలోనే వేలమంది వీక్షిస్తారట.

వక్తగా కూడా..!

మన రౌల్‌.. ఏఐకి సంబంధించిన తరగతులు చెప్పడమే కాకుండా.. టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌ కూడా. ఇప్పటి వరకు రెండు సార్లు దాదాపు 40 నిమిషాల పాటు ఆ వేదిక మీద తన ప్రసంగాన్ని వినిపించాడట. మీకో విషయం తెలుసా..! ప్రస్తుతం తను ఫ్రొఫెషనల్‌ ఏఐ ట్రైనర్‌ కూడా. ఇదంతా తనకు అంత సులభంగా ఏం సాధ్యం కాలేదట. ‘మా నాన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆయన పని చేసుకునేటప్పుడు చూసి.. నాకూ నేర్చించమని అడిగాను. ముందు ఆశ్చర్యపోయినా.. తర్వాత దానికి సంబంధించిన చిన్నచిన్న విషయాలు నేర్చుకోమని ఆన్‌లైన్‌ తరగతుల్లో చేర్పించారు. అప్పుడు నేను.. నాకు ఏ సమాచారం అవసరం లేదో ముందు తెలుసుకున్నాను. కావాల్సిన దాన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్‌ చేశాను. అలా కోడింగ్‌ వంటివన్నీ నేర్చుకొని.. ఆ తర్వాత ఏఐ సబ్జెక్టు కూడా నేర్చుకున్నాను’ అని చెబుతున్నాడు రౌల్‌.

ఆప్‌లో సందేహాలు..!

తను అందుబాటులో లేని సమయంలో విద్యార్థులకు వచ్చిన సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా ఒక ఆప్‌ని కూడా తయారుచేశాడు రౌల్‌. తను ఏ విధంగా అయితే.. వివరిస్తాడో అలాగే అందులో సమాధానం వచ్చేలా దాన్ని రూపొందించాడు. టెక్నాలజీలో ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్న రౌల్‌కి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని