బొటనవేలంత గబ్బిలం!

‘వేలెడంత లేవు కానీ..’ అని మిమ్మల్ని అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు అంటుంటారు కదూ!.. కానీ ఆ పోలిక మీకన్నా.. నాకే సరిగ్గా సరిపోతుంది తెలుసా? ఎందుకంటే నేను

Updated : 14 Sep 2020 00:21 IST

‘వేలెడంత లేవు కానీ..’ అని మిమ్మల్ని అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు అంటుంటారు కదూ!.. కానీ ఆ పోలిక మీకన్నా.. నాకే సరిగ్గా సరిపోతుంది తెలుసా? ఎందుకంటే నేను బొటనవేలంతే ఉంటాను కాబట్టి.

నా పేరు బమ్‌బోబి. ప్రపంచంలో అత్యంత చిన్న గబ్బిలాన్ని నేనే. కేవలం థాయ్‌లాండ్‌, ఆగ్నేయ మయన్మార్‌లో మాత్రమే కనిపిస్తుంటా. అదికూడా నదీ తీరాల వెంట సున్నపురాయితో ఏర్పడిన గుహల్లోనే జీవిస్తుంటా.

బుజ్జి రూపం నా సొంతం!

నేను 29 నుంచి 33 మిల్లీమీటర్లు ఉంటాను. ఉన్నంతలో నా చెవులు పెద్దగా కళ్లు మాత్రం చిన్నగా ఉంటాయి. రెక్కల వంటి నిర్మాణాలూ ఒకింత పెద్దగానే ఉంటాయి. మేం గుంపులుగా ఉన్నప్పటికీ పెద్ద పెద్ద సమూహాలుగా ఉండం. కొన్ని సార్లు కేవలం 10 నుంచి 15 మాత్రమే కనిపిస్తుంటాయి. అత్యధికంగా 500 వరకు ఉంటాయి.

గుహలోనే నిక్షేపంగా.. కాలక్షేపం

నేను ఎక్కువ సమయం గుహలోనే ఉంటా. రాత్రివేళ 30 నిమిషాలు, ఉదయం పూట కేవలం 20 నిమిషాలు మాత్రమే బయటకు వస్తా. చలి వాతావరణం, తేలికపాటి వర్షమూ మమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతుంది. అందుకే నేను గుహలో నిక్షేపంగా కాలక్షేపం చేస్తా. నేను నా ఇంటి నుంచి కేవలం కిలోమీటరు దూరం వరకే వెళ్తా.


పురుగులతో పొట్టనింపుకొంటా..

నేను ఎక్కువగా చెట్ల ఆకులపై ఉండే కీటకాలను హాంఫట్‌ చేస్తా. అంటే ఓ రకంగా చెట్లకు హాని చేసే పురుగుల పనిపడుతూ.. పర్యావరణానికి మేలు చేస్తున్నా అన్నమాట. అన్నీ అనుకూలిస్తే నేను 5 నుంచి 10 సంవత్సరాల వరకు బతుకుతాను.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని