Shopping: అదే పనిగా కొనేస్తున్నారా..?

పనిలో ఉన్నా.. ఖాళీగా కూర్చున్నా మనసంతా ఈ కామర్స్‌ యాప్‌లు, వెబ్‌సైట్లపైనే. ఆఫర్లు ఏమున్నాయ్‌? రాయితీలు ఎంతొస్తున్నాయ్‌.. ఎప్పుడూ ఈ ఆరాలే.

Published : 25 May 2024 00:39 IST

పనిలో ఉన్నా.. ఖాళీగా కూర్చున్నా మనసంతా ఈ కామర్స్‌ యాప్‌లు, వెబ్‌సైట్లపైనే. ఆఫర్లు ఏమున్నాయ్‌? రాయితీలు ఎంతొస్తున్నాయ్‌.. ఎప్పుడూ ఈ ఆరాలే. యాప్‌ తెరిచామా.. ఏదో ఒకటి కొని తీరాల్సిందే. చాలామందిది ఇదేవరుస. యువతలో 28శాతం మంది జేబుని గుల్ల చేసే ఈ వ్యసనంతో బాధ పడుతున్నారంటున్నాయి అధ్యయనాలు. ఎందుకిలా.. వాటికి అడ్డుకట్ట వేసేదెలా? అంటే..

మోజు ఎందుకంటే..

  • షాపింగ్‌ చేస్తుంటే.. ఇన్‌స్టంట్‌ సంతోషం, ఉత్సాహం కలుగుతాయి. కంప్యూటర్, స్మార్ట్‌ 24గంటలూ అందుబాటులో ఉండటంతో వీటిని ఎప్పుడంటే అప్పుడు తెరవొచ్చు. 
  • ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం.. ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న వారిలో కొందరు ఆ బాధ నుంచి ఉపశమనాన్ని షాపింగ్‌లో వెతుక్కుంటుంటారు.
  • ఇష్టమైన పనులు చేయడం వల్ల శరీరంలో హాయిని కలిగించే డోపమైన్‌ అనే హార్మోను విడుదలవుతుంది. షాపింగ్‌తో కూడా ఇదే అనుభూతికి లోనవుతుంటారు. 
  • ఆఫర్లు, రాయితీలు, ఊరించే ప్రకటనలు సైతం కుర్రకారుపై మత్తులా పని చేస్తాయి. వాటి మోజులో పడి కొని తీరాలనే కోర్కెను పెంచుతాయి.
  • ఇతరులతో కలవనివారు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు సైతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ని ఒక వ్యాపకంలా మార్చుకుంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది. 

బయట పడదామిలా..

ఆర్థిక భారాన్ని కలిగిస్తూ, కొన్నాళ్లకి అపరాధభావాన్నీ కలుగజేసే ఈ వ్యసనం నుంచి బయట పడాలంటే ఏం చేయాలంటే..

  • ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయాలనే కోరిక కలిగినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయం వెదకాలి. వ్యాయామం, స్నేహితులతో మాట్లాడటం, బయటికి వెళ్లడం.. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి.
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌కి నెలకు ఇంతమొత్తమే ఖర్చు చేయాలి అని ఒక పరిమితి విధించుకోవాలి. అంతకుమించి వాడకుండా క్రెడిట్, డెబిట్‌ కార్డులకు లిమిట్‌ సెట్‌ చేయాలి. 
  • యోగా, ధ్యానంలాంటివి సైతం మనసుని అదుపులో పెట్టడానికి ఉపకరిస్తాయి. వాటిని పాటిస్తూ ఉంటే.. మనసు నియంత్రణలో ఉంటుంది. 
  • అధిక షాపింగ్‌తో కలిగే అనర్థాల్ని ఎక్కడైనా రాసుకొని, తరచూ వాటిని గుర్తు చేసుకుంటుండాలి. అవసరమైతే స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఆ షాపింగ్‌ యాప్‌లను తొలగించాలి.
  • కొన్నిసార్లు ఎన్ని అనుకున్నా.. దేన్నీ ఆచరణలో పెట్టలేని పరిస్థితి. ఈ అడిక్షన్‌ ముదిరినప్పుడు తప్పకుండా మానసిక నిపుణుడిని సంప్రదించాల్సిందే. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని