all is well: అక్కడంతా ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’

‘ఆల్‌ ఈజ్‌ వెల్‌..’ అనుకుంటే అంతా మంచే జరుగుతుంది అని అహ్మద్‌ఖాన్‌ నమ్మకం. ఎవరీయన? అంటే ముంబయి బాంద్రాలోని రిజ్వీ కాలేజీ ప్రిన్సిపల్‌.

Updated : 25 May 2024 06:43 IST

‘ఆల్‌ ఈజ్‌ వెల్‌..’ అనుకుంటే అంతా మంచే జరుగుతుంది అని అహ్మద్‌ఖాన్‌ నమ్మకం. ఎవరీయన? అంటే ముంబయి బాంద్రాలోని రిజ్వీ కాలేజీ ప్రిన్సిపల్‌. ఆ కళాశాలలోనూ విద్యార్థులుంటారుగా! వాళ్లు కొంటె చేష్టలు చేస్తుండటం.. అప్పుడప్పుడు అవి శృతి మించడాలూ మామూలే కదా. అయినా ‘మా విద్యార్థులంతా బుద్ధిమంతులు’ అనే అంటుంటారు రిజ్వీ సర్‌. ఆఖరికి టీచర్‌ - తల్లిదండ్రుల సమావేశంలోనూ పిల్లల గురించి వాళ్ల తల్లిదండ్రులకు అంతా మంచే చెప్పండి అని కాలేజీలోని అధ్యాపకులకు సూచించారు కూడా. ఎందుకిలా అంటే.. గతంలో ఇక్కడి విద్యార్థుల ఆగడాలు ఎక్కువగా ఉండేవట. ఎంత చెప్పినా వాళ్లది అదే తీరు. వాళ్ల పేరెంట్స్‌ని పిలిచి, మందలించినా మార్పు కనపడలేదు. దీంతో బాగా ఆలోచించి రివర్స్‌ గేర్‌ వేశారాయన. విద్యార్థులపై ఫిర్యాదులు చేయకుండా కేవలం వాళ్లు చేసిన మంచి పనులు.. మంచి మార్కులు.. వీటి గురించే చెప్పాలని అధ్యాపకులందరికీ ఆదేశాలిచ్చేశారు. దాన్ని తూ.చా. తప్పకుండా ఆచరించారు లెక్చరర్లు. మహా అయితే కాలేజీ కుర్రాళ్లు మరింత బుద్ధిమంతులు కావడానికి మంచి సూచనలు చేయమన్నారు. మాస్టారి ట్రిక్కు ఫలించింది. ప్రిన్సిపల్, లెక్చరర్లు, కన్నవాళ్లు తెగ మెచ్చుకోవడంతో విద్యార్థుల్లోనూ మార్పు మొదలైందట. వాళ్లూ గాడిలో పడటం ప్రారంభించారు. ఎంత చేసినా కొందరు వెనకబెంచీ విద్యార్థులూ ఉంటారుగా. వాళ్ల కోసం, తుంటరివాళ్లకూ ప్రత్యేకంగా అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకేం.. ఆయన కోరుకున్నట్టు అంతా ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’గా సాగుతోంది మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని