అప్పుడే సినిమాల్లోకి రాను..

నైసా దేవ్‌గణ్‌.. బాలీవుడ్‌ పవర్‌ కపుల్‌ అజయ్‌ దేవ్‌గణ్‌-కాజోల్‌ల గారాలపట్టి. ఈమధ్య మీడియా డార్లింగ్‌గా మారింది.

Updated : 07 Jan 2023 13:36 IST

నైసా దేవ్‌గణ్‌.. బాలీవుడ్‌ పవర్‌ కపుల్‌ అజయ్‌ దేవ్‌గణ్‌-కాజోల్‌ల గారాలపట్టి. ఈమధ్య మీడియా డార్లింగ్‌గా మారింది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తన ప్రతి అడుగూ సంచలనమే అవుతోంది. ఈ కుర్రదాని కబుర్లు క్లుప్తంగా..

* నైసా అంటే గ్రీకు భాషలో ‘ఆరంభం’ అని, దూసుకెళ్లే తత్వం ఉన్న అమ్మాయి అని అర్థం. తమ కూతురు అన్నింట్లో ముందుండాలని అజయ్‌, కాజోల్‌లు ఏరికోరి మరీ ఈ పేరు పెట్టారట.

*  ఇరవై ఏళ్ల నైసాకి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తను ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సింగపూర్‌లోని యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఏసియాలో స్కూలు విద్య పూర్తి చేసుకొని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో డిగ్రీ చదువుతోంది.

*  నైసా చదువులో చురుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ. పదిహేడేళ్ల నుంచే అమ్మానాన్నల్ని వదిలి సొంతంగా ఉంటోంది. తమ ముద్దుల కూతురు సౌకర్యంగా ఉండాలని సింగపూర్‌లో ఉన్నప్పుడు సొంతంగా ఓ ఫ్లాట్‌ కూడా కొనిచ్చారు.

*  స్నేహితులు, ఆటలంటే ప్రాణం. కాలేజీలోని ఫుట్‌బాల్‌ జట్టు తరఫున ప్రచారం చేస్తుంది. పర్యటనలంటే ప్రాణం. ఏమాత్రం తీరిక దొరికినా టూర్లకు చలో అంటుంది. ప్రతి వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తప్పకుండా లాంగ్‌టూర్‌కి వెళ్తుందట.

*  సామాజిక మాధ్యమాల్లో నైసా ఆకట్టుకునే ఫొటోలు చూసి తను త్వరలోనే బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోందనే వార్తలు వచ్చాయి. దీన్ని అజయ్‌ దేవ్‌గణ్‌ కొట్టిపారేశారు. నైసా సైతం ‘చదువే ముఖ్య’మంటూ తేల్చి చెప్పింది.

*  తను వేదాంత్‌ మహాజన్‌ అనే ముంబయి కుర్రాడితో డేటింగ్‌ చేస్తోందంటూ కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్టే అతగాడితో సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోలు చాలానే బయటికొచ్చాయి. ఇక తన బెస్ట్‌ఫ్రెండ్స్‌ జాబితాలో షారుక్‌ కూతురు సహానాఖాన్‌, బోనీకపూర్‌ కుమార్తె ఖుషీ కపూర్‌, చుంకీ పాండే వారసురాలు అనన్య పాండేలు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని