ఉద్యోగం వదిలే.. అర్హత మీకుందా?

బాస్‌ తిట్టాడనో.. కొలీగ్‌పై కోపంతోనో.. మరోచోట మంచి అవకాశం దొరుకుతుందనో.. ఉన్నపళంగా ఉద్యోగాన్ని వదులుకునే వాళ్లు ఎంతోమంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫర్వాలేదు.

Published : 18 May 2024 01:37 IST

బాస్‌ తిట్టాడనో.. కొలీగ్‌పై కోపంతోనో.. మరోచోట మంచి అవకాశం దొరుకుతుందనో.. ఉన్నపళంగా ఉద్యోగాన్ని వదులుకునే వాళ్లు ఎంతోమంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫర్వాలేదు.. అంచనాలు తలకిందులైతేనే చిక్కంతా. అందుకే కొలువుకి బై చెప్పేముందు ఒక్కసారి ఈ విషయాలు ఆలోచించండి. 

  •  ఉద్యోగం వదిలేయగానే ఆర్థిక పరిస్థితి మారుతుంది. చేతికొచ్చే డబ్బులు ఆగిపోతాయి. ఆ పరిస్థితిని తట్టుకోగలిగితేనే రాజీనామాకి సిద్ధం కండి. నెలా.. రెండునెలలా? ఏడాదా? ఎంతవరకు ఉద్యోగం లేకుండా ఉండగలరో ముందే ఒక అంచనాకు వస్తేనే నిర్ణయాన్ని ఆచరణలో పెట్టండి.
  •  మీ భవిష్యత్తు కెరియర్‌ లక్ష్యాలపై ఈ రాజీనామా తప్పక ప్రభావం చూపిస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నారా? కొలువు మారినా, సెక్టార్‌ మార్చుకున్నా.. ఏ ఢోకా ఉండదు అనుకున్నప్పుడే ముందడుగు వేయండి.
  • ఇంటి రుణం, కారు లోను, వ్యక్తిగత అప్పులు.. యువ వేతన జీవులకు ఇలాంటివేవో ఉండే ఉంటాయి. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే వీటితో కష్టాలు తప్పవు. ఇవన్నీ భరించగలను, కొలువు లేకున్నా కుటుంబ భారం మోయగలను అనుకున్నప్పుడు దేనికైనా సిద్ధపడొచ్చు.
  •  ఆవేశంలో ఓ నిర్ణయం తీసుకున్నా.. తర్వాత అది ఎమోషనల్‌గా మీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే.. ఇరుగు పొరుగు ఆరాలు, సొంత మనుషుల నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కోక తప్పదు. వీటన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటేనే ఉద్యోగం వదలడానికి మీరు అర్హులు.
  •  ఉద్యోగం వదిలేయడానికి ముందే, తర్వాత ఏం చేయాలనే యాక్షన్‌ ప్లాన్‌ మీకుండాలి. వేరేచోట చేరతారా? అంకుర సంస్థ ప్రారంభిస్తారా? వ్యాపారం చేస్తారా? దానికేం చేయాలి.. పెట్టుబడి ఎంతుండాలి.. ఈ వివరాలన్నింటితో పక్కా ప్రణాళిక ప్రకారం ఉంటే మీరేం చేసినా ఆపేవాళ్లు  ఉండరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని