మెట్రోలో ప్రేమ.. స్టేషన్‌లో పెళ్లి!

మూడు పదులు దాటి మూడేళ్లైనా మూడు ముళ్ల మురిపెం తీరలేదని బెంగతో బతుకుతున్న వేళ.. ‘మన ఇంటికి మూడిళ్ల ఆవల ఉన్న మానస నీతో పెళ్లికి ఒప్పుకుందిరా’ అంటూ ఓరోజు తీపి కబురు చెప్పారు అమ్మానాన్నలు.

Updated : 08 Jun 2024 06:41 IST

మూడు పదులు దాటి మూడేళ్లైనా మూడు ముళ్ల మురిపెం తీరలేదని బెంగతో బతుకుతున్న వేళ.. ‘మన ఇంటికి మూడిళ్ల ఆవల ఉన్న మానస నీతో పెళ్లికి ఒప్పుకుందిరా’ అంటూ ఓరోజు తీపి కబురు చెప్పారు అమ్మానాన్నలు. అది వినగానే ‘నా జీవితంలోనూ మొలకలు వచ్చాయ్‌’ అని తెగ సంబరపడ్డా. ఆలస్యం చేస్తే అసలుకే మోసమని వెంటనే పెట్టేబేడా సర్దుకొని వందేభారత్‌ కన్నా వేగంగా మెట్రో స్టేషనుకు చేరుకున్నా. కానీ అక్కడే ట్రైన్‌ పట్టాలు తప్పినట్టు నా జీవితం తలకిందులైంది. నా ముందు సీట్లో అందానికే అక్కసు పుట్టేలా ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే స్వర్గానికి దారి మర్చిపోయిన దేవకన్య సరాసరి హైదరాబాద్‌ మెట్రో ఎక్కేసిందేమో అనుకున్నా. రైలు ఇంజిన్‌తో బోగీలు కలిసినట్టు నా చూపులు ఆమెతో పెనవేసుకున్నాయి.

ఆ క్షణంలోనే ఆమెపై ఎంత ఇష్టం ఏర్పడిందంటే.. అర్జెంటుగా ఆమెకు గుడి కట్టాలనిపించింది. కానీ నేను అద్దెకుండే ఏరియాలో అసలేమాత్రం స్థలం లేదని ఆగిపోయా. తనకోసం చందమామను తీసుకొచ్చి ఇద్దామనుకున్నా.. ఇస్రో, నాసా ప్రయోగాలకు ఇబ్బంది అవుతుందేమో అని ఆ ఆలోచన వద్దనుకున్నా. బంగారంతో ఆ అమ్మాయికి తులాభారం వేద్దామనుకున్నా.. డైమండ్‌ లాంటి తనముందు అది దిగతుడుపే అని విరమించుకున్నా. ఆలసించిన ఆశాభంగమని మాట కలుపుదామని ప్రయత్నిస్తే.. ‘ఛీ.. వీడితో ఏంటి మాట్లాడేది’ అన్నట్టు ముఖం మూసారాంబాగ్‌ వైపు తిప్పుకుంది. అయినా నా గమనం అంతా తనవైపే ఉంటే గమ్యస్థానంతో పని ఏంటని నింపాదిగా కూర్చున్న. నేనా అమ్మాయిని ఆబగా చూడటం పక్కనున్న అంకుల్‌ గమనించారు కాబోలు.. ‘ఎక్కడ దిగాలమ్మా?’ అంటూ సుతిమెత్తగా గుర్తు చేశారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌’ అని బదులివ్వగానే.. ‘ఆ స్టేషన్‌ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా.. ఎందుకు దిగలేదు?’ అని కొరకొరా చూశారు. ‘ఆ అందమైన సుందరిని చూస్తూ నా జీవితమంతా ఇక్కడే గడిపేయాలనుంది అంకుల్‌’ అని ముసిముసిగా నవ్వుతూ జవాబిచ్చాను. దాంతో కూల్‌గా ఉన్న అంకుల్‌ కళ్లు ఎరుపెక్కాయి. జంతికలు నములుతున్నట్టు పళ్లని పటపటా కొరుకుతూ నాపై దూసుకొచ్చారు.

నేనూ తగ్గేదేలే అంటూ ముందుకెళ్లాను. మా గొడవను ఆపాల్సిన జనం జాతరలో కోళ్ల పందేల్ని చూసినట్టు ఆస్వాదించారు. నా క్రాఫ్‌ చెదిరి.. చొక్కా చిరిగాక గానీ అర్థమవలేదు.. నేను వలచిన ఆ బేబీ అంకుల్‌కి బేటీ అని. అలా మెట్రో స్టేషన్‌లో మొదలైన నా తొలిచూపు ప్రేమ.. పోలీస్‌స్టేషన్లో నాకు పెళ్లి (బడితెపూజ)తో ముగిసింది. జరిగిన తతంగమంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. జరగాల్సిన అసలు పెళ్లి కాస్తా పెటాకులైంది. అప్పుడర్థమైంది నాకు.. ప్రేమ, పెళ్లికి ఒకరే ముద్దు.. ఇద్దరు అసలే వద్దు అని.

- పంగా సాంబశివారెడ్డి, కడప   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని