నన్ను కదిలించాడలా..

‘ప్రేమలు’తో ప్రేమగా తెలుగు కుర్రకారుకి దగ్గరైన మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు.

Published : 27 Apr 2024 00:05 IST

‘ప్రేమలు’తో ప్రేమగా తెలుగు కుర్రకారుకి దగ్గరైన మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు. కళ్లతోనే కవ్వించేలా మాట్లాడే ఈ అమ్మడు ఇంతవరకు ఒక్కసారైనా ప్రేమలో పడలేదట. కానీ తనకొచ్చిన ప్రేమ ప్రపోజళ్లు బోలెడు అంటోంది. ప్లస్‌ టూ చదువుతున్నప్పుడే మొదటిసారి ఓ అబ్బాయి ఐ లవ్యూ చెప్పేశాడట. అతగాడికి ‘నో’ చెప్పిన మమిత.. అప్పట్నుంచీ ఎవరికైనా అదేమాట వల్లె వేస్తోంది. ఇప్పటివరకూ ఒక్క వాలెంటైన్‌ డే జరుపుకోలేదంటోంది. ఎంతోమంది ఎన్నోరకాలుగా చెప్పినా.. ఒక్కరి ప్రేమ విన్నపం మాత్రం తన గుండెదాకా చేరిందట. ‘ఒకతను మా కాలేజీ గేటు ముందే రోజూ నిల్చొని, నేను వస్తూపోతూ ఉన్నప్పుడు ఆరాధనాపూర్వకంగా చూసేవాడు. ఓసారి సంగతేంటని అడిగా. ‘మీరంటే చాలా ఇష్టం. మీ సినిమాలే కాదు.. మీ ప్రతి ఇంటర్వ్యూ తప్పకుండా చూస్తా’ అని చెప్పాడు. పలు సందర్భాల్లో నేను ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని విషయాలూ అప్పజెప్పాడు. ‘మీతో మాట్లాడటం కోసం కొద్దినెలలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నా’ అన్నాడు. ఆ క్షణం అతడి ప్రేమలో నిజాయతీ కనిపించింది’ అంటూ తనని కదిలించిన అపర ప్రేమికుడి గురించి చెప్పుకొచ్చింది మమిత. అప్పుడు అతడి అభిమానానికి ఓ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి సరిపెట్టేసిందట. ఇంతకీ తను అతిగా ప్రేమించేది ఎవరినో తెలుసా? చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టపడి నేర్చుకున్న నాట్యాన్ని. మోహినీయాట్టం, కూచిపూడిలలో తను రాష్ట్రస్థాయిలో అవార్డులూ గెల్చుకుంది. తకిట తకిట అంటూ.. రోజూ ఆ డ్యాన్స్‌ సాధన చేస్తూ ప్రేమనంతా కుమ్మరిస్తుందట. ఇంక సినిమా కెరియర్‌పై అత్యంత ఇష్టం ఎలాగూ ఉండనే ఉంది. అన్నట్టు ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. కొచ్చిలోని కాలేజీలో బీఎస్సీ సైకాలజీ చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని