పెళ్లైన కొత్తలో..

నేపథ్యాలు వేరు.. ఆలోచనలు వేరు.. ఒక్కోసారి సంప్రదాయాలూ వేరు. ఎన్ని వైరుధ్యాలున్నా అమ్మాయి, అబ్బాయి పెళ్లితో ఒక్కటవుతారు. ఆశలు, ఆశయాలు ఒక్కటై జీవితాంతం కలిసి ముందుకు సాగుతామని బాసలు చేసుకుంటారు.

Published : 04 May 2024 00:18 IST

నేపథ్యాలు వేరు.. ఆలోచనలు వేరు.. ఒక్కోసారి సంప్రదాయాలూ వేరు. ఎన్ని వైరుధ్యాలున్నా అమ్మాయి, అబ్బాయి పెళ్లితో ఒక్కటవుతారు. ఆశలు, ఆశయాలు ఒక్కటై జీవితాంతం కలిసి ముందుకు సాగుతామని బాసలు చేసుకుంటారు. అది ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చినదైనా! మరి ఆ కుర్ర దంపతుల అనుబంధం దృఢమవ్వాలంటే..

సంభాషణ: మాట రెండు మనసుల్ని దగ్గర చేస్తుంది. ఆ మాటే మనసు దాటి బయటికి రాకుంటే ఇద్దరి మధ్య అంతరాల్ని పెంచుతుంది. అందుకే పెళ్లైన కొత్తలో పడుచు జంట తమ ఆలోచనలు, బాధలు, భావోద్వేగాలు, అనుమానాలు అన్నీ పంచుకోవాలి. అప్పుడు గానీ ఎవరి మనసులో ఏముందో తెలియదు. మాట్లాడటమే కాదు.. ఓపిగ్గా వినడమూ ముఖ్యమే. అలాంటప్పుడే అవతలి వాళ్లు మా మాటకి ప్రాధాన్యం ఉందని భావిస్తుంటారు.

సమయం: ఎంత బిజీ లైఫ్‌ అయినా.. పెళ్లయ్యాక ఆ హడావుడిని పక్కనపెట్టి ఒకరికొకరు కాస్తైనా సమయం కేటాయించాల్సిందే. రొమాంటిక్‌ మీల్‌, మూవీ డేట్‌, సరదాగా షాపింగ్‌.. వీలు చేసుకొని పార్కుకెళ్లడం, కుదిరితే ఓ లాంగ్‌టూర్‌.. ఇవన్నీ ఇద్దరినీ మానసికంగా దగ్గర చేస్తూ.. తీపి జ్ఞాపకాల్లా మారతాయి.

వైరుధ్యాలు: ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెళ్లాడి ప్రేమించుకుంటున్నా.. ఆలోచనలు, అభిరుచుల్లో ఇద్దరి మధ్య కొన్ని తేడాలుంటాయి. అవి పొరపొచ్చాలు, గిల్లికజ్జాలకు కారణమవుతాయి. అప్పుడే ఇద్దరిలో ఒకరైనా అడుగు వెనక్కి వేయాలి. కాస్తంత ఓపిక పట్టాలి. లేకుంటే.. అవే చినికిచినికి గాలివానలా మారి సంబంధానికే ఎసరు పెట్టేలా ముదురుతాయి. ఈ పరిస్థితి రాకూడదంటే.. ఎదుటి వాళ్లలో చిన్న చిన్న లోపాలను ఆమోదించగలగాలి.

మానసిక అండ: ఆపద, కష్టం.. ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా ఇద్దరికీ చేటేనని భావించాలి. అనారోగ్య సమస్యలు.. ఆత్మీయుల్ని కోల్పోవడం.. ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవాలి. ఏదైనా విజయం సాధించినప్పుడు మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. సంతోషాన్ని పంచుకోవడం.. దుఃఖమొస్తే ఓదార్పుని ఇవ్వడం.. ఈ రెండూ జరిగితే మనసులు మరింత దగ్గరవుతాయి.

సరిహద్దులు: ఎంత భార్యాభర్తలైనా.. వారికీ వ్యక్తిగత పరిధులంటూ ఉంటాయి. అందులో చొరబడితే చిక్కుల్లో చిక్కుకోక తప్పదు. వాళ్ల గౌరవ మర్యాదలు కాపాడటం, గోప్యతను కాపాడటం.. ఇద్దరికీ ముఖ్యం. దాపరికాలు లేకపోవడం మంచిదేగానీ.. వ్యక్తిగత స్వేచ్ఛ కరవైనప్పుడు చికాకులు మొదలవుతాయి.

రొమాన్స్‌: ఎంత ప్రేమ ఉన్నా.. రొమాన్స్‌ లేకపోతే ఆ సంసారం సువాసన లేని పువ్వులా మారుతుంది. చిలిపి కౌగిలింతలు.. ముద్దూముచ్చట్లు.. సరదాల సరసాలు.. వీటికి ఎప్పుడూ చోటుంటే.. ఆ అనుబంధం కలకాలం పదిలంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని