ప్రేమ పూజ చేద్దామంటే..

కళ్లన్నీ సెల్లుకే అప్పగించి సిల్లీఫెలోలా ఎదురు చూస్తుండగా ఏ సాయంత్రానికో నా చరవాణి మోగింది. అది నా వలపు రాణి సందేశమే అనుకుంటూ పరుగెత్తుకెళ్లి హల్లో అన్నా.

Updated : 14 Jan 2023 02:39 IST

కళ్లన్నీ సెల్లుకే అప్పగించి సిల్లీఫెలోలా ఎదురు చూస్తుండగా ఏ సాయంత్రానికో నా చరవాణి మోగింది. అది నా వలపు రాణి సందేశమే అనుకుంటూ పరుగెత్తుకెళ్లి హల్లో అన్నా. తీయని స్వరం నా చెవిలో తేనెల మాటలు కుమ్మరిస్తుందనుకుంటే.. ఏదో కీచు గొంతు నా పీచమణిచేలా భయపెట్టింది. అయినా.. గొంతు వరస మార్చి నా చెలి సరసమాడుతోందని సర్దిచెప్పుకున్నా. ముచ్చట్లన్నీ ముగిశాక ముచ్చటగా ఐలవ్యూ చెబుతుందని ఆత్రంగా ఎదురుచూశా. తను చెప్పేది విని నా హృదయం ఉప్పొంగుతుంది అనుకుంటే.. చావు కబురు చల్లగా చెప్పి నా గుండెను ఆపేసినంత పని చేసింది. ఆఖర్న గోల్డ్‌ లోన్‌ కట్టమంటూ గద్దించేసరికి.. చేసింది నా బంగారం కాదు.. బంగారం లోను భామ అని తెలిసి తెగ బాధ పడ్డా. ఎలాగోలా ఆ గోలని ముగించి గేటు తీసేలోగా.. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన నా అందాల దేవత ఎదురుగా ప్రత్యక్షమైంది. ప్రేమ పూజ మొదలు పెడదామని నోరు విప్పేలోపే.. ‘ఏంటి ఇంతసేపు నీ ఫోన్‌ ఎంగేజ్‌? ఎవరా అమ్మాయి??’ అంటూ మూతి మీద ఒక్కటిచ్చింది. తను మూడక్షరాల పదం చెబితే మురిసిపోదామని భావిస్తే.. కింద పడ్డ మూడు పళ్లని చూసి లబోదిబో అన్నా.
పంపినవారు: పంగా సాంబశివారెడ్డి, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని