జిగేల్‌రాణి పాటకు స్టెప్పులు

మా ప్రిన్సిపల్‌ చాలా స్ట్రిక్టు. చీమ చిటుక్కుమన్నా తెలియాలని ప్రతి తరగతిలో సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. ఓరోజు మా ఫిజిక్స్‌ లెక్చరర్‌ క్లాసుకి రాలేదు. కెమెరాలు ఉండటంతో ఆ సంతోషాన్ని ఎంజాయ్‌ చేయలేని పరిస్థితి మాది.

Published : 17 Feb 2024 00:07 IST

కాలేజీ కహానీ

మా ప్రిన్సిపల్‌ చాలా స్ట్రిక్టు. చీమ చిటుక్కుమన్నా తెలియాలని ప్రతి తరగతిలో సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. ఓరోజు మా ఫిజిక్స్‌ లెక్చరర్‌ క్లాసుకి రాలేదు. కెమెరాలు ఉండటంతో ఆ సంతోషాన్ని ఎంజాయ్‌ చేయలేని పరిస్థితి మాది. దాంతో మా ఫ్రెండ్‌ సురేంద్ర ఓ ఉపాయం ఆలోచించాడు. మా తరగతికి వచ్చే సీసీటీవీ కెమెరా వైర్‌ని కత్తిరిస్తానన్నాడు. వాడే వెళ్లి.. కాసేపయ్యాక వచ్చి ‘సక్సెస్‌’ అన్నాడు. ఇక చూస్కోండి. మాలో ప్రతి ఒక్కరిలో డ్యాన్స్‌ మాస్టర్లు, సింగర్లు నిద్ర లేచారు. ఆఖరికి అందరం కలిసి ‘జిగేల్‌ రాణి..’ పాట పాడుతూ స్టెప్పులేయసాగాం. పదిహేను నిమిషాలయ్యాక అటెండర్‌ వచ్చి క్లాస్‌లో అందరినీ ప్రిన్సిపల్‌ రమ్మంటున్నారు అన్నాడు. వెళ్లాక.. ‘అసలేం జరుగుతోంది? ఏం చేస్తున్నారు?’ అన్నారు సర్‌ కోపంగా. ‘ఫిజిక్స్‌ సర్‌ ఇంకా రాలేదు సర్‌.. సైలెంట్‌గా కూర్చొని ఆయన కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ అమాయకంగా నటించాడు సురేంద్ర. దానికాయన మరింతగా సీరియస్‌ మొహం పెట్టి.. మానిటర్‌ని మావైపు తిప్పి మా చేష్టలన్నీ చూపించారు. నవ్వలేక, ఏడ్వలేక అలాగే నిల్చుండిపోయాం. అందరికీ చీవాట్లు పెట్టి బయటికి పంపించారు. అసలు విషయం ఏంటంటే.. మావాడు సీసీటీవీ కెమెరా వైరుకి బదులు వేరొకటి కత్తిరించాడని తర్వాత తెలిసింది. అలాంటి సాహసాలు మళ్లీ ఎప్పుడూ చేయకపోయినా.. అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వాగదు.

జి.రఘు, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని