ముప్ఫైల్లో విరాట్‌లా..

పేరుకి బ్యాట్స్‌మన్‌ అయినా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ కోహ్లి ఆల్‌రౌండర్‌. 35 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఉండే తన ఫిట్‌నెస్‌ రహస్యం ఏంటంటే..

Updated : 09 Mar 2024 09:21 IST

పేరుకి బ్యాట్స్‌మన్‌ అయినా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ కోహ్లి ఆల్‌రౌండర్‌. 35 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఉండే తన ఫిట్‌నెస్‌ రహస్యం ఏంటంటే..

క్రమంతప్పని వ్యాయామం: భోజనం, నిద్రలాగే.. విరాట్‌ వ్యాయామాన్నీ తన దినచర్యలో ఓ భాగంలా మార్చుకున్నాడు. స్ట్రెంగ్త్‌, కార్డియో, ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్లు.. ఇలా ప్రతీదీ తన వర్కవుట్‌లో ఉండాల్సిందే. కండరాల దృఢత్వానికి, బరువు పెరగకుండా ఉండేందుకు, శరీరంపై నియంత్రణకు.. పరుగు, సైక్లింగ్‌, కోర్‌ స్ట్రెంగ్త్‌ వ్యాయామాలు చేస్తుంటాడు. ప్లాంక్స్‌, క్రంచెస్‌, లెగ్‌ రేజెస్‌, హెచ్‌ఐఐటీ వర్కవుట్లు.. సరేసరి.

సమతుల ఆహారం: కఠోర వ్యాయామాలు ఎన్ని చేసినా.. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటేనే ఫలితం. అందుకే రోజూ సమతుల ఆహారం తీసుకుంటాడు. తన భోజనంలో ప్రొటీన్లు తక్కువ ఉండేలా.. పండ్లు, కూరగాయలు ఎక్కువ ఉండేలా చూసుకుంటాడు. కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎంత శ్రమించినా, మైదానంలో పొద్దంతా ఆడినా.. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండేందుకు తగినంత నీరు తాగుతాడు.

విశ్రాంతి ముఖ్యం: తగినంత ఆహారం తీసుకొని, కఠిన వ్యాయామాలు చేసినప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి కూడా ఉండాలి. ఎక్కువ కసరత్తులు చేసినప్పుడు శరీర అంతర్భాగాలు, జాయింట్స్‌, కండరాలు విశ్రాంతి కోరుకుంటాయి. కండరాలు తీవ్ర అలసటకు గురవుతాయి. శక్తి పుంజుకొని కసరత్తులకు మళ్లీ సిద్ధం కావాలంటే.. తగినంత విశ్రాంతి, నిద్ర తప్పనిసరి. కోహ్లి ఇది కచ్చితంగా పాటించేందుకు పార్టీలకు దూరంగా ఉంటాడు. గాయాలకు ఆస్కారం ఉండే వ్యాయామాలు చేయడు.

ప్రశాంతత కావాల్సిందే: వ్యాయామం దీర్ఘకాలం కొనసాగించాలంటే శరీరం, మనసూ.. రెండింటి మధ్యా సమన్వయం ఉండాలి. పనిపై ఏకాగ్రత కుదరాలంటే.. ఒత్తిడి దరి చేరకుండా ఉండాలంటే మనసు దృఢంగా ఉండాలి. అప్పుడే జిమ్‌లో చురుగ్గా కదలగలుగుతాం. దీనికోసం కోహ్లి ధ్యానం, యోగాలను క్రమం తప్పకుండా చేస్తాడు. ఇది తన ఆట, వ్యాయామం కొనసాగడానికి ప్రేరణగా నిలుస్తుందని చాలా సందర్భాల్లో చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని